Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 16 Aug 2022 20:31:40 IST

Richard Speck: స్పైడర్‌లో ‘భైరవుడు’ ఏడుపులు చూసి హ్యాపీగా ఫీలవుతాడు.. ఇతని నవ్వుల వెనుక ఎంత కథ ఉందంటే..

twitter-iconwatsapp-iconfb-icon
Richard Speck: స్పైడర్‌లో భైరవుడు ఏడుపులు చూసి హ్యాపీగా ఫీలవుతాడు.. ఇతని నవ్వుల వెనుక ఎంత కథ ఉందంటే..

మరణం అనేది మనిషికి భయానకం అయితే మరికొన్ని జీవులకు ఆట విడుపు అవుతుంది. అడవిలో పులి తన ఆకలి కోసం జింకను వేటాడుతుంది, జింక ప్రాణ రక్షణ కోసం పరుగులు పెడుతుంది. కానీ మాటువేసిన పులి నుంచి తప్పించుకోవడం ఆ జింకకు కష్టతరమైన పని. జంతువులు ఇలా వాటి ఆకలిని తీర్చుకోవడం కోసం ఇతర జంతువులను వేటాడతాయి.


కానీ.. అలాంటి వేటను మనుషులు సాగిస్తే.. పైశాచిక ఆనందం, ఉన్మాదం, హింసను చూడటాన్ని ఓ పండుగలా భావించడం అనుకోవచ్చు. ఇంకా కారణాలు వేరే ఉండవచ్చు కానీ అలాంటి మనుషులు హింసాయుత స్వభావంతో రగిలిపోతుంటారు.


ఆడవాళ్లను అత్యాచారం చేయడం, వారిని హింసించి చంపడం అనేది ఏ మాత్రం ఊహించుకోలేని చర్య. ప్రపంచంలో ఇవన్నీ ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటాయి. కానీ.. ఎనిమిది మంది నర్సింగ్ స్టూడెంట్లను ఊచకోత కోసిన ఈ ఘటన గురించి తెలుసుకుంటే నాటి ప్రపంచం కళ్ళముందు కదులుతుంది. కలవరపెట్టే ఆ ఘటన, దానికి పాల్పడిన ఆ వ్యక్తి గురించి వివరాల్లోకి వెళ్తే..


1966, జులై 13వ తేదీ రిచర్డ్ స్పెక్ (Richard Speck) అనే వ్యక్తి చికాగోలో 8 మంది నర్సింగ్ స్టూడెంట్స్‌ని ఊచకోత కోసి చంపాడు. అతని గురించి, ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకునే క్రమంలో ఎన్నో భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Richard Speck: స్పైడర్‌లో భైరవుడు ఏడుపులు చూసి హ్యాపీగా ఫీలవుతాడు.. ఇతని నవ్వుల వెనుక ఎంత కథ ఉందంటే..


ఎవరు ఈ రిచర్డ్ స్పెక్!!

రిచర్డ్ స్పెక్ అమెరికా చరిత్రలో మోస్ట్ వాంటెడ్ సీరియల్ కిల్లర్స్‌లో ఒకడు. 1966, జులై 13న సౌత్ డీరింగ్ ఏరియాలో ఉన్న నర్సింగ్ స్టూడెంట్స్ బిల్డింగ్‌లోకి జొరబడి అక్కడ ఒకేసారి ఎనిమిది మంది నర్సింగ్ విద్యార్థినులను చంపి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు. దిగ్భ్రాంతికి గురిచేసే ఈ సంఘటన వెనకున్న రిచర్డ్ స్పెక్ జీవితం ఏంటని ఆరా తీస్తే..


నిర్లక్ష్యపు బాల్యం!!

చిన్నతనంలో నిర్లక్ష్యం చేయబడే పిల్లలు పెద్దయ్యాక సమాజానికి కంఠకులవుతారు అనే మాట వాస్తవం అనిపిస్తుంది కొందరి జీవితాలను తెలుసుకున్న తరువాత. రిచర్డ్ జీవితం కూడా అలాంటిదే.


రిచర్డ్ బెంజమిన్ స్పెక్ 1941 సంవత్సరంలో ఇల్లినాయిస్ లోని మోన్‌మౌత్ అనే చిన్న సిటీలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఇద్దరు వ్యక్తులకు జన్మించాడు. ఇతని బాల్యం ఆరేళ్ళ వరకు సజావుగానే సాగింది. అయితే ఆరేళ్ళ తరువాత అంటే 1947 సంవత్సరంలో రిచర్డ్ స్పెక్ తండ్రి గుండెపోటుతో మరణించాడు. అప్పటికి స్పెక్ తండ్రికి 53 సంవత్సరాల వయసు. తండ్రి మరణించిన కొన్ని సంవత్సరాల తరువాత రిచర్డ్ స్పెక్ తల్లి ఆర్థిక, సామాజిక, ఇతర కారణాల వల్ల రెండవ వివాహం చేసుకుంది. ఆమె పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఆమెకు భర్త అయ్యాడు కానీ రిచర్డ్ స్పెక్‌కు తండ్రి స్థానాన్ని ఇవ్వలేకపోయాడు, తండ్రిగా బాధ్యతను స్వీకరించలేకపోయాడు.


వృత్తి రీత్యా ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ అయిన రిచర్డ్ మారు తండ్రి అతడి జీవితంలో చాలా నేరచరిత్రను నింపుకుని ఉన్నాడు. అతనికి తాగుడు వ్యసనం ఉండేది. పీకల దాకా తాగొచ్చి చిన్నారి రిచర్డ్‌ను ఇష్టమొచ్చినట్టు తిట్టేవాడు. రిచర్డ్ స్పెక్‌ను, అతని తల్లిని తీసుకుని రిచర్డ్ మారు తండ్రి వారు నివసిస్తున్న ప్రాంతం నుంచి ఈస్ట్ డల్లాస్‌కు మారారు. ఆ తరువాత అక్కడ కూడా కుదురుగా ఉండలేకపోయారు. వారు ఏ ఇంట్లోనూ ఎక్కువ రోజులు ఉండలేక ఒకచోటి నుండి మరొకచోటికి మారేవారు, పేదవారు నివసించే మురికివాడలలో కొన్నిసార్లు బ్రతికారు. అలా రిచర్డ్ స్పెక్ తల్లిదండ్రుల దగ్గర గందరగోళ జీవితాన్ని చూసాడు.


విఫలమైన చదువు!!

రిచర్డ్ స్పెక్ తన తరగతి గదిలో చాలా మొద్దబ్బాయి. తను కళ్ళజోడు పెట్టుకోవడానికి నిరాకరించిన కారణంగా అతడు తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడేవాడు కాదు. అతి కష్టం మీద పాసయ్యేవాడు. ఎనిమిదవ తరగతి చాలాసార్లు ఫెయిల్ అయిన తరువాత గట్టెక్కాడు. ఉన్నత పాఠశాల చదువులో కేవలం మొదటి సెమిస్టర్‌కే అతనిలో చదువు మీద ఆసక్తి చచ్చిపోయి రెండవ సెమిస్టర్ తప్పేలా చేసింది. తన మారు తండ్రిని చూస్తూ పెరుగుతున్న స్పెక్ తను కూడా తాగడం అలవాటు చేసుకున్నాడు. ఒకవైపు తాగుడు అలవాటు, మరొక వైపు చదువు మీద అనాసక్తి వల్ల అతను బడికి వెళ్లడం మానేశాడు. 


జీవితం ముందుకు కొనసాగడం కోసం ఎన్నో రకాల చిన్నాచితకా ఉద్యోగాలు చేశాడు. ఆ క్రమంలోనే టెక్సాస్ స్టేట్ ఫెయిర్‌లో పరిచయం అయిన 15 సంవత్సరాల అమ్మాయిని గర్భవతిని చేశాడు, ఆ తరువాత వివాహం కూడా చేసుకున్నాడు.  అయినప్పటికీ అతను చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ అందులో కొనసాగడానికే ఇష్టపడ్డాడు. అతని చేతి మీద "నరకాన్ని సృష్టించడానికి జన్మించాడు" అనే వాక్యాలను పచ్చబొట్టు పొడిపించుకుని, ఆ సిద్ధాంతం ప్రకారమే జీవించాడు. దానికి నిదర్శనం అతను తన 24 సంవత్సరాల కాలంలో 41 సార్లు అరెస్టవ్వడం.


పెరిగిన హింసాత్మక ప్రవర్తన!!

రిచర్డ్ తన జీవితంలో కాలంతో పాటు తన హింసను కూడా క్రమంగా పెంచుకుంటూ పోయాడు. ఆ పైశాచిక ఆనందం అతనికి ఎంతగానో నచ్చేది. అతని భార్య షిర్లీ మలోన్ అతని గురించి చెబుతూ "అతడు ప్రతిరోజూ నాలుగైదు సార్లు శృంగారంలో పాల్గొనమని ఒత్తిడి చేసేవాడు. తిరస్కరిస్తే కత్తి చూపించి మరీ అత్యాచారం చేసేవాడు" అని పేర్కొంది.


రిచర్డ్ స్పెక్ గురించి ఇన్వెస్టిగేట్ చేసిన ఒక అధికారి "అతను తాగుతున్నప్పుడు ఎవరిని అయినా చాలా భయంకరంగా బెదిరిస్తాడు, ఎవరితో అయినా ముందూ వెనుక చూడకుండా పోరాటం చేస్తాడు. కానీ అతని దగ్గర కత్తి లేదా వేరే ఇతర ఏ ఆయుధాలు లేనప్పుడు అతను ఎవరినీ ఏమి చేయలేడు, కనీసం ఎలుకను చంపడం కూడా అతని చేతకాదు" అని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే తాగుడు, ఆయుధాలు అతని జీవితాన్ని చాలా దుర్భర పరిస్థితులలోకి నెట్టాయని చెప్పవచ్చు. అతని జీవితంలో జరిగిన అరెస్టులలో దొంగతనం, మోసం, దోపిడీలు చేయడం వల్ల జరిగినవే అధికం. ఆ క్రమంలో అతను ఇతరుల మీద గాయాలు చేయడం, పొడవడం, శరీర భాగాలలో ముఖ్యమైన నరాలను కట్ చేయడం వంటి క్రూర చర్యలకు కూడా పాల్పడ్డాడు.


1965వ సంవత్సరం నుంచి అతడి ఆగడాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అతని అపార్ట్మెంట్ బిల్డింగ్ పార్కింగ్ స్థలంలో ఒక మహిళ మీద 17 అంగుళాల కత్తితో దాడిచేసాడు. ఆ దాడిలో ఆమె తప్పించుకున్నా అతనికి మాత్రం 16 నెలల జైలు శిక్ష విధించారు. అయితే దురదృష్టవశాత్తు కేసులో ఏదో లోపం కారణంగా అతనికి ఆరు నెలల శిక్షాకాలం పూర్తవగానే విడుదల చేశారు. రిచర్డ్ స్పెక్ ఘోరాలు చూస్తూ అతనితో ధైర్యంగా ఉండలేక అతని భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుని వారిద్దరికి పుట్టిన కొడుకును అతని కన్ను కూడా సోకకుండా ఆమె దగ్గరే పెంచి చాలా జాగ్రత్తగా చూసుకుంది.


రిచర్డ్ తన నివాసాన్ని మార్చుకోవాలని అక్కడి నుంచి తను పుట్టిన మోన్‌మౌత్‌కు తిరిగి వెళ్ళాడు. అక్కడ బార్‌లో జరిగిన గొడవలో పీకల దాకా తాగి ఉన్న రిచర్డ్ ఒక వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా కత్తితో పొడిచి చంపేశాడు, చనిపోయిన వ్యక్తి కారును దొంగిలించడం మాత్రమే కాకుండా అతని కిరాణా షాప్ మొత్తాన్ని దోచుకున్నాడు. అంతటితో ఆగకుండా అతడి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న 65 సంవత్సరాల మహిళను ఘోరంగా హింసించి మరీ అత్యాచారం చేశాడు. దీని తరువాత అతడు కార్పెంటర్ అవతారం ఎత్తాడు, ఒక బార్‌లో చెక్క పని చేస్తున్నప్పుడు అక్కడున్న 32 సంవత్సరాల పని మనిషిని హత్య చేశాడు. ఈ హత్య గురించి ఇంటరాగేషన్ ఎదుర్కొన్న తరువాత రిచర్డ్ స్పెక్ తన సోదరితో కలసి మోన్‌మౌత్ నుండి చికాగోకి వెళ్ళిపోయాడు.

Richard Speck: స్పైడర్‌లో భైరవుడు ఏడుపులు చూసి హ్యాపీగా ఫీలవుతాడు.. ఇతని నవ్వుల వెనుక ఎంత కథ ఉందంటే..


చికాగో ఊచకోతల పరంపర!!

మోన్‌మౌత్ నుంచి చికాగో వెళ్లిపోయిన తరువాత అక్కడ నేషనల్ మారిటైమ్ యూనియన్‌తో షిప్‌లో ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నం చేశాడు. ఆ ఉద్యోగం కోసం సుమారు అయిదు రోజులు అక్కడే ఉన్నాడు. అసైన్మెంట్ అంతా అయిపోయిన తరువాత జూన్ 12న అతనికి రావలసిన ఉద్యోగాన్ని వేరేవారికి ఇచ్చారనే విషయం రిచర్డ్‌కి చెప్పలేనంత కోపం తెప్పించింది. ఆ కోపం అతనిలో రాక్షసుడిని నిద్రలేపింది. అక్కడికి దగ్గరలోనే మద్యం కొనుగోలు చేసి మద్యం సేవించాడు. అక్కడే మద్యం సేవిస్తున్న 53 సంవత్సరాల ఎల్లా మే హుపర్ అనే మహిళను కత్తితో బెదిరించి ఆమె ఇంటికి వెళ్ళాడు, అక్కడ ఆమెను అత్యాచారం చేయడం మాత్రమే కాకుండా ఆమె దగ్గరున్న మెయిల్ ఆర్డర్ 22 క్యాలిబర్ రాహ్మ్ తుపాకినీ దొంగిలించాడు. ఆ తుపాకీ అతని చేతిలో పడగానే అతని పిచ్చి పరాకాష్టకు చేరుకుంది. 


అతను తుపాకినీ తన వెంట ఉంచుకుని చికాగోలో సౌత్ సైడ్ వీధులలో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ దూరం నడిచిన తరువాత అతనికి నర్సింగ్ స్టూడెంట్స్ బస చేసే వసతి గృహం కనిపించింది. అతను సుమారు 11 గంటల సమయంలో ఆ బిల్డింగ్‌లోకి ప్రవేశించాడు. పిల్లిలా మెల్లిగా ఆ బిల్డింగ్‌లో ఉన్న పడకగదులలోకి వెళ్ళాడు.

Richard Speck: స్పైడర్‌లో భైరవుడు ఏడుపులు చూసి హ్యాపీగా ఫీలవుతాడు.. ఇతని నవ్వుల వెనుక ఎంత కథ ఉందంటే..


ఫిలిపినా ఎక్స్చేంజ్, కోరజోన్ అమురావ్ (23) అనే ఇద్దరు నర్సింగ్ స్టూడెంట్స్ పడుకున్న గది తలుపులను కొట్టాడు. వారు తలుపు తెరవగానే తన దగ్గరున్న తుపాకీ చూపించి వేరే గదిలో ఉన్న మెర్లిటా గార్గుల్లో(23), వాలాంటినా పాసిన్ (23) అనే స్టూడెంట్స్ దగ్గరకు వెళ్ళాడు. వీరిలో మెర్లిటా గార్గుల్లో, వాలంటినా పాసిన్ ఫిలిప్పీన్‌కు చెందినవారు. ఆ తరువాత ఆ నలుగురిని తుపాకీతో బెదిరించి ఇంకొకగదిలో ఉన్న అమెరికన్ స్టూడెంట్స్ అయిన ప్యాట్రిసియా మాటుసెక్(20), పమేలా విల్కెనింగ్(20), నినా జో ష్మాలే(24) అనే విద్యార్థుల దగ్గరకు వెళ్ళాడు. ఇలా అతని చేతిలో ఏడు మంది నర్సింగ్ స్టూడెంట్స్ చిక్కుకున్నారు. వాళ్ళందరిని గదిలో ఉన్న దుప్పట్లను చించి వాటి సహాయంతో చేతులను వెనుకకువిరిచి కట్టేసాడు. 


ఆ తరువాత వారిలో ఒక్కొక్కరిని గదిలో నుంచి బయటకు తీసుకెళ్లి చంపాడు. ఈ క్రమంలో ఏడుమందిలో ఒకరైన కోరజోన్ అమురావ్ రిచర్డ్ బారి నుంచి తప్పించుకుంది. ఆ బిల్డింగ్‌లో హత్యలు చేసి రిచర్డ్ పారిపోయిన తరువాత పోలీసులు అక్కడికి వచ్చినపుడు కోరజోన్ జరిగిన భయానక ఘటనను వివరిస్తూ..


"అతడు ఏడు మంది చేతులను వెనుకకు విరిచి కట్టేశాడు. ఆ తరువాత ఒక్కొక్కరిని బయటకు తీసుకెళ్తున్నప్పుడు అమెరికా అమ్మాయిలు మాతో ఒక విషయం చెప్పారు. "అతడు చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు అతడిని ఏ విధంగానూ నమ్మలేం, మనం అరిచి గోల చేస్తే అతను ఏదైనా హింస చేయచ్చు, అదే మనం నిశ్శబ్దంగా ఉంటే అతను కూడా నిశ్శబ్ధంగానే ఉంటాడు. అందుకే మనం గోల చేయద్దు" అని. ఆ మాటల వల్ల మేమెవ్వరం గట్టిగా అరిచి గోల చెయ్యలేదు. అతను కూడా ఎవరినీ హింసించలేదు. కానీ ఒక్కొక్కరిని గదిలో నుండి బయటకు ఎంతో నిశ్శబ్దంగా తీసుకెళ్లాడు, అయితే బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరినీ గొంతు కోసి, లేదా పొడిచి చంపేశాడు. అందరి మరణం కేకలతో, ఏడుపులతో, బాధాకరమైన అరుపులతో ముగిసింది. ఈ భయంకర పరిస్థితులు జరుగుతున్నప్పుడు నేను పక్కనే ఉన్న మంచం కిందకి దొర్లిపోయి దాక్కున్నాను. అదే సమయంలో బిల్డింగ్‌లో తన గదిలోకి వెళ్తున్న సుజానే ఫారిస్(21) అనే అమ్మాయిని అతడు పొడిచి చంపేశాడు, ఆ తరువాత మేరీ ఆన్ జోర్డాన్(20) అనే అమ్మాయిని తన బాయ్ ఫ్రెండ్ బిల్డింగ్ దగ్గర వదిలి వెళ్లడం చూసిన అతడు ఆమెను అత్యాచారం చేసి చాలా హింసాత్మకంగా చంపాడు. ఈ గందరగోళంలో అతను ఎంతమందిని కట్టేసాను అనే విషయం మరిచిపోయినట్టున్నాడు. ఆ కారణం వల్ల నేను ఉదయం 6 గంటల వరకు మంచం కిందనే బిక్కుబిక్కుమంటూ గడిపాను. అతడు పారిపోయాక పోలీసులు అక్కడికి వచ్చేవరకు కిటికీ దగ్గర నుంచి గట్టిగా అరుస్తూనే ఉన్నాను" అని వివరంగా తెలిపింది.

Richard Speck: స్పైడర్‌లో భైరవుడు ఏడుపులు చూసి హ్యాపీగా ఫీలవుతాడు.. ఇతని నవ్వుల వెనుక ఎంత కథ ఉందంటే..


రిచర్డ్ అరెస్ట్, అతని మరణం!!

రిచర్డ్ పారిపోయిన తరువాత కొన్నిరోజులకు అతడు అనారోగ్య కారణం వల్ల ఆసుపత్రికి వెళ్ళినపుడు ఒక వైద్యుడు రిచర్డ్ చేతిపై ఉన్న పచ్చబొట్టును చూసి పోలీసులకు సమాచారం అందించాడు. అతడిని విచారించిన మానసిక రోగుల టీమ్ అతడిని అనుమానించడానికి తగిన కారణం ఉందని తెలిపింది. ఆ తరువాత ఏప్రిల్ 3,1967న  రిచర్డ్ దర్యాప్తు ప్రారంభమైంది. ఆ సమయంలో రిచర్డ్ తనకు హత్యల గురించి ఏదీ జ్ఞాపకం లేదని చెప్పాడు. కానీ రిచర్డ్‌కు షాక్ ఇస్తూ పోలీసులు అమురావ్‌ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా అమురావ్ రిచర్డ్‌ను చేత్తో తాకి మరీ "ఇతనే హత్యలు చేసిన వ్యక్తి" అని ఎంతో ధైర్యంగా చెప్పింది. హత్యలు జరిగిన చోట దొరికిన చేతిముద్రలు, రిచర్డ్ చేతి ముద్రలతో సరిపోవడం సాక్ష్యానికి మరింత బలం చేకూర్చింది. ఆ సాక్ష్యాల దృష్ట్యా రిచర్డ్ కు కేవలం 45 నిమిషాల వాదనతోనే ఉరిశిక్ష విధించింది. అయితే ఉరిశిక్ష సమంజసం కాదని చెప్పే కొన్ని సంఘాల పోరాటం వల్ల ఉరిశిక్ష కాస్తా జీవిత ఖైదుగా మార్చబడింది. 


ఇల్లినాయిస్‌లోని స్టేట్‌విల్లే కరెక్షనల్ సెంటర్‌లో రిచర్డ్ స్పెక్ ఈ శిక్షను అనుభవించాడు. అక్కడున్నప్పుడు కూడా అతను డ్రగ్స్‌తో పట్టుబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అతడి సెల్‌లోకి వచ్చే పిచ్చుకలను అతను అలాగే ఉంచుకునేవాడు, అందుకని అతన్ని "బర్డ్ మ్యాన్" అని పిలిచేవారు. 


ఇంత ఘోరాలతో నిండిన రిచర్డ్ జీవితంలో మరొక విషయం అందరినీ భయోత్పాతానికి గురిచేసింది. 1988, 1996 లలో రిచర్డ్ ఒక వీడియో తీసి వాటిని ఒక లాయర్ ద్వారా ప్రజల్లోకి విడుదల చేయించాడు. ఆ వీడియోలో కేవలం అమ్మాయిలు ధరించే ప్యాంటీలు వేసుకుని అతడు మరొక ఖైదీతో ఉన్నాడు. హార్మోన్స్‌ను ఇంప్రూవ్ చేసే ఒక డ్రగ్‌ను వాడటం వల్ల అమ్మాయిలకు పెరిగినట్టు రొమ్ములు పెరిగిన అతను తోటి ఖైదీతో చాలా జుగుప్సాకరంగా నోటితో సెక్స్ చేయడం ఆ వీడియోలో ఉంది. ఆ సమయంలో ఆ ఇద్దరూ చాలా మొత్తంలో కొకైన్ తీసుకోవడం అందులో రికార్డ్ అయ్యింది. అదొక డ్రగ్ స్మగ్లింగ్ ప్రమోషన్ అని చాలామంది అభిప్రాయపడ్డారు.


ఒక వీడియోలో తోటి ఖైదీ రిచర్డ్‌ను నర్సింగ్ స్టూడెంట్స్ ఊచకోత గురించి ప్రశ్నించగా "ఆరోజు వారిది కాదు, నాది. అందుకే నా చేతిలో వారు చనిపోయారు" అని ఎంతో పాశవికంగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.


ఇంత క్రూరత్వాన్ని నింపుకున్న రిచర్డ్ జీవితం బట్టబయలు కావడానికి కారణం చనిపోయిన ఎనిమిది మంది నర్సింగ్ స్టూడెంట్సే. వీరందరూ పాతిక సంవత్సరాల లోపు వారే. రిచర్డ్ తన యాభై సంవత్సరాల జీవితంలో ఎంతోమంది సంతోషాలను నలిపేశాడు, ఎన్నో జీవితాలను చిదిమేశాడు, చివరికి తన 50వ పుట్టినరోజునే గుండెపోటుతో మరణించాడు. అతని మరణం భవిష్యత్తుకు సమస్య లేకుండా చేసినా, బాధిత ఆత్మలు మాత్రం క్షోభిస్తూనే ఉంటాయేమో!!

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.