ప్రాధాన్యమేదీ?

ABN , First Publish Date - 2022-05-17T06:09:24+05:30 IST

ప్రాధాన్యమేదీ?

ప్రాధాన్యమేదీ?
మిల్లులో ధాన్యం బస్తాలు

ధాన్యం కొనుగోలులో అడుగడుగునా ఇబ్బందులు

ఈ-క్రాప్‌లో బీపీటీ-2231 రకం నమోదు సమస్యలు

ఇప్పటికే ఆర్‌బీకేలకు చేరిన బస్తాలు

కొనేది లేదంటున్న మిల్లర్లు

ఏం చేయాలో తెలియక రైతుల సతమతం

ఇప్పటివరకు కొన్నది 51 వేల టన్నుల ఖరీఫ్‌ ధాన్యమే..

రైతుల వద్దే మరో 90 వేల టన్నులు 

మళ్లీ ఖరీఫ్‌ వస్తున్నా తొలగని సమస్యలు


ధాన్యం విక్రయాల్లో సమస్యలు రైతులకు కన్నీరు తెప్పిస్తున్నాయి. తాజాగా ఈ-క్రాప్‌ వారిని అష్టకష్టాలపాలు చేస్తోంది. సర్వర్‌లో సమస్యలు, ఉన్నతాధికారుల నుంచి స్పందన కొరవడటం కారణంగా బీపీటీ-2231 (ఎరుపు) రకం ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇప్పటికే పంటను ఆర్‌బీకేలకు తరలించిన రైతులు ఏం చేయాలో తెలియక కలత చెందుతున్నారు. మరోపక్క ఇంకా ఈ-క్రాప్‌లో నమోదు కాని రైతులు ఆందోళనలో ఉండగా, ఇంకోపక్క మిగులు ధాన్యం సమస్య కలచివేస్తోంది.


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ధాన్యం విక్రయాల్లో రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ-క్రాప్‌లో పంటల వివరాలు తప్పులతడకగా నమోదు చేయడం, నేటికీ సరికాకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. రైతులు ముతకరకం ధాన్యం సాగు చేస్తే బీపీటీ-5204 సాగు చేసినట్టుగా ఈ-క్రాప్‌లో నమోదైంది. గత ఖరీఫ్‌లో కోడూరు, అవనిగడ్డ, గుడ్లవల్లేరు, పెడన, గుడివాడ, పామర్రు, మొవ్వ తదితర మండలాల్లో బీపీటీ-2231 (ఎరుపు) రకం ధాన్యాన్నే సాగు చేశారు. 2231 రకం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సర్వర్‌లో బీపీటీ రకంగానే చూపడంతో ఈ కొత్త వంగడం కొనుగోలుకు అనుమతులు రాలేదు. దీంతో ఏయే మండలాల్లో బీపీటీ-2231 రకం ధాన్యం సాగు చేశారో వ్యవసాయ శాఖ అధికారులు వివరాలు సేకరించారు. వాటిని కొనేందుకు అనుమతులు ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాసినా సమాధానం రాలేదు. దీంతో రైతులు ఆర్‌బీకేల ద్వారా మిల్లర్లకు విక్రయించిన ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. మిల్లులకు రవాణా చేసిన ధాన్యానికి ఆన్‌లైన్‌లో రైతుల పేరు నమోదుకాకపోవడంతో మిల్లర్లు ఈ ధాన్యం మాకొద్దని చెబుతున్నారు. దీనిని మళ్లీ వెనక్కి తెచ్చేందుకు రైతులపై అదనపు భారం పడనుంది. ఒకవేళ వెనక్కి తెచ్చినా ఎక్కడ, ఏ ప్రాతిపదికన విక్రయించాలనే అంశంపై రైతుల్లో అయోమయం నెలకొంది. ఈ రకం ధాన్యం కొనేందుకు ప్రభుత్వం కొద్దిరోజుల్లో అనుమతులు ఇచ్చినా, నగదు ఖాతాల్లో జమయ్యేందుకు 51 రోజులు పడుతుంది. ఈ వ్యవధిలో మళ్లీ ఖరీఫ్‌ ప్రారంభమై వరినాట్లు కూడా వేయాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు.

ఇప్పటివరకు 51వేల టన్నులే కొనుగోలు

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 1.44 లక్షల టన్నుల ధాన్యాన్ని రబీలో కొనాలని అధికారులు నిర్ణయించారు. ఈ-క్రాప్‌ సక్రమంగా నమోదు కాకపోవడంతో మిగులు ధాన్యంగా కొంత, కుప్పనూర్పిడి చేయాల్సిన ధాన్యంగా మరికొంత చూపారు. ఖరీఫ్‌ ధాన్యంతో పాటు రబీలో 19వేల టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిల్లర్లకు అనుమతులు కూడా ఇచ్చారు. సోమవారం నాటికి 51 వేల టన్నుల ధాన్యాన్నే కొన్నారు. మిగిలిన వాటి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుంటే, కొందరు రైతులు బీపీటీ రకం వరి వంగడం సాగు చేసినట్టుగా చూపిస్తోంది. బీపీటీ రకం ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకునే వెసులుబాటు ఉంది. బీపీటీ-2231 ధాన్యాన్ని మాత్రం ఎంతమేర మిల్లర్లు నేరుగా కొంటారు, ఎంత ధర చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. దీంతో పాటు ముతకరకాల ధాన్యం ఇప్పటికీ సుమారు 90వేల టన్నులు ఆర్‌బీకేల ద్వారా కొనాల్సి ఉంది. మిల్లర్లకు అనుమతులు ఇచ్చినా.. ఇటీవల వరకూ వారంలో రెండు రోజులు మిల్లులకు సెలవు ప్రకటించారు. మిగిలిన ఐదు రోజులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మిల్లులు పనిచేయాలనే నిబంధన పెట్టారు. దీంతో బిహార్‌, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి మిల్లుల్లో పనిచేసేందుకు వచ్చిన కూలీలు తిరిగి వెళ్లిపోతున్నారు. కూలీల కొరత, విద్యుత్‌ వాడకంలో ఆంక్షల కారణంగా జిల్లాలోని 173 మంది మిల్లర్లు ధాన్యం కొనకుండా మిన్నకుండిపోయారు. దీంతో నెల రోజులుగా కొనుగోళ్లు మందగించాయి. 

నమోదుకాని రైతుల సంగతేంటి?

జిల్లాకు చెందిన దాదాపు ఎనిమిది వేల మంది రైతుల వివరాలు అసలు ఈ-క్రాప్‌లో నమోదు కాలేదని అధికారుల పరిశీలనలో తేలింది. వారి వివరాలు నమోదు చేస్తున్నా.. పౌరసరఫరాల లాగిన్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో ఈ అంశం పెండింగ్‌లోనే ఉంది. అలాగే, ఒక రైతు 10 ఎకరాల్లో వరి సాగుచేస్తే ఐదెకరాల పంట వివరాలను ఆన్‌లైన్‌ చేసి, మిగిలిన ఐదెకరాలను మిగులు ధాన్యంగా చూపారు. మిగులును విక్రయించేం దుకు కోతలు పూర్తయిన నాలుగైదు నెలల సమయం పట్టింది. ప్రస్తుతం దీనిని కోటాలోనే కొంటున్నారు. 


పై అధికారులకు చెబుతాం.. 

బీపీటీ-2231 రకంతో పాటు ఇతర రకాల ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులను సేకరించి పౌరసరఫరాల ఉన్నతాధికారులకు సమాచారం పంపుతాం. ఇటీవల కాలంలో 51 వేల టన్నుల ధాన్యం కొనేందుకు అనుమతులు ఇచ్చాం. మిగిలిన ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు తీసుకుంటాం.

- శ్రీధర్‌, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌

Updated Date - 2022-05-17T06:09:24+05:30 IST