ధాన్యం డబ్బులివ్వరా?

ABN , First Publish Date - 2022-07-27T05:28:00+05:30 IST

గిట్టుబాటు ధర వస్తుందని.. సకాలంలో నగదు చేతికి అందుతుందని.. దళారులు దగా చేస్తారని.. ఇలా రకరకాల కారణాలతో అన్నదాతలు ధాన్యాన్ని ఆర్‌బీకేల ద్వారా ప్రభుత్వానికి విక్రయించారు.

ధాన్యం డబ్బులివ్వరా?

చెల్లింపులపై ప్రభుత్వం మీనమేషాలు

అన్నదాతలకు రూ.65.50 కోట్ల బకాయిలు

ఆర్‌బీకేల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులు

నెలలు గడుస్తున్నా బకాయి చెల్లించని ప్రభుత్వం

సాగు ఆరంభమైనా నగదు అందక అన్నదాతల్లో ఆందోళన 


నరసరావుపేట, జూలై 26: గిట్టుబాటు ధర వస్తుందని.. సకాలంలో నగదు చేతికి అందుతుందని.. దళారులు దగా చేస్తారని.. ఇలా రకరకాల కారణాలతో అన్నదాతలు ధాన్యాన్ని ఆర్‌బీకేల ద్వారా ప్రభుత్వానికి విక్రయించారు. అయితే రైతుల ఆశలను వమ్ము చేస్తూ నెలలు గడుస్తున్నా ధాన్యం డబ్బులు ఇవ్వడంలో ప్రభుత్వం మీనమేషాలు వేస్తోంది. ఆర్‌బీకేల చుట్టూ తిరగలేక.. తిరిగినా సమాధానం చెప్పేవారు లేక రైతులు అటు ధాన్యం పోయి.. ఇటు డబ్బులు రాక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుతో దళారులే నయం ఎప్పుడు డబ్బులు ఇస్తామన్న మాటైనా చెప్పేవారన్న అభిప్రాయానికి రైతులు వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్‌ వ్యాపారుల మాదిరిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఆర్‌బీకేల ద్వారా రైతుల నుంచి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే నెలలు గడుస్తున్నా విక్రయించిన ధాన్యానికి సంబంధించిన నగదు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. రైతులకు ఇంకా రూ.65.50 కోట్లు ప్రభుత్వం బకాయి పడినట్లు సమాచారం. ఈ నగదు ఎప్పుడు చెల్లిస్తుందో కూడా నేటికి స్పష్టత లేదు. జిల్లాలోని రైతులు రబీలో 74,775 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఆర్‌బీకేల ద్వారా 1,09,504 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. నిబంధనలు అధికంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు  ఆర్‌బీకేలకు ధాన్యం విక్రయించేందుకు సుముఖత చూపలేదు. తక్కువ ధర అయినా ప్రైవేట్‌ వ్యాపారులకు పలువురు ధాన్యం విక్రయించారు. అయితే మద్దతు ధర లభిస్తుందనే ఆశతో 2,088 మంది రైతులు ఆర్‌బీకేల ద్వారా విక్రయించారు. సుమారు 45,384 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి రెండు విడతల్లో రూ.21.50 కోట్లు రైతులకు చెల్లించారు. ఇంకా రూ.65.50 కోట్లు ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బు ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు ఆర్‌బీకేల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆశాజనకంగా వర్షాలు పడుతుండటంతో కొన్ని రోజులుగా ఖరీఫ్‌ సాగు ఆరంభమైంది. దీంతో రైతులకు సాగు పెట్టుబడికి డబ్బు తక్షిణావసరమైంది. పొలాలు దుక్కులు దున్ని విత్తనాలు కూడా కొనుగోలు చేశారు. కాల్వలకు నీరు విడుదల చేసిన వెంటనే వరి సాగు చేయనున్నారు. అయితే చేతిలో నగదు లేక.. ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఇప్పటికీ అందకపోవడంతో ఇప్పటి వరకు వెచ్చించిన డబ్బును వడ్డీలకు తెచ్చినట్లు పలువురు రైతులు తెలిపారు. డబ్బు రావాల్సి ఉన్నా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ధాన్యం డబ్బు చెల్లిస్తే సాగుకు ఉపయోగ పడుతుందని రైతులు చెబుతున్నారు. అయితే వీరి మొర ఆలకించే నాఽధుడే కరువయ్యారు. 


వారంలో చెల్లిస్తాం : డీఎం వరలక్ష్మి

రైతులకు ధాన్యం నగదు వారంలో చెల్లించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ డీఎం వరలక్ష్మి మంగళవారం తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి వరకు రూ.21.50 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. ఇంకా రైతులకు 65.50 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.   

 

 

Updated Date - 2022-07-27T05:28:00+05:30 IST