అప్పుల ఊబిలోకి..

ABN , First Publish Date - 2020-10-30T10:13:46+05:30 IST

ఎంతో శ్రమించి పెట్టుబడులు పెట్టి వేసిన పంటచేలు చేతికందే సమయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి.

అప్పుల ఊబిలోకి..

 భారీ వర్షాలతో అపార నష్టం

తుడిచిపెట్టుకుపోయిన వరి, పత్తి, కూరగాయ పంటలు

ఓవైపు చెరువులు నిండిన సంతోషం..

మరోవైపు పంటలు దెబ్బతిన్న దు:ఖం

ఆందోళనలో రైతులు 


ఇబ్రహీంపట్నం: ఎంతో శ్రమించి పెట్టుబడులు పెట్టి వేసిన పంటచేలు చేతికందే సమయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియక రైతులు ఆందోళనలో ఉన్నారు. భారీ వర్షాలకు దాదాపు అన్ని చెరువులు, కుంటల్లోకి నీరు చేరడం హర్షించదగిన విషయమే. అయితే వానాకాలం పంటలు వర్షాలకు తుడిచిపెట్టుకుపోయి రైతాంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో ఎక్కువ శాతం రైతాంగం మెట్ట పంటలపైనే ఆధారపడి ఉంది. గత నాలుగైదేళ్లుగా వానాకాలం పంటలకు కాలం కలిసిరాక, సమయానుకూలంగా వర్షాలు కురవక వేసిన పంటచేలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ ఈ సారి అందుకు భిన్నంగా అధిక వర్షాలకు పంటలు నీటమునిగి భారీగా నష్టపోయారు.


మొత్తం గా 27,929 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. సుమారు రూ.5.60 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. అందులో వరి, పత్తి పంటలకు ఎక్కువ ఉన్నాయి. అక్కడక్కడా కంది పంటలకు నష్టం చేకూరగా కూరగాయ తోటలు పూర్తిగా కొట్టుకుపోయియి. వర్షాలకు పొలాలు జాలువారి ఇప్పటికీ కొన్నిచోట్ల పత్తి పంటలో నీరు నిలిచింది. వరి దిగుబడిలో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉన్న దండుమైలారంలో వరదలకు వరిపంటపై ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌, ఇబ్రహీంపట్నం, యాచారం మండలాల్లో వరి పంట నష్టం ఎక్కువగా ఉంది. ఒక్క మాడ్గుల మండలంలోనే 20,506 ఎకరాల్లో పత్తికి నష్టం చేకూరింది. అలాగే మంచాల మండలంలో 986 ఎకరాలు, యాచారం మండలంలో 703 ఎకరాలు, ఇబ్రహీంపట్నం మండలంలో 352 ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లింది. అక్కడక్కడ మామిడి తోటల్లో నీరు నిలిచింది. కాగా, భారీ వర్షాలకు పనికిరావనుకున్న బావుల్లో నీటిమట్టం అమాంతం పెరిగింది. చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నందున బోరు బావులు పుష్కలంగా నీరుపోస్తున్నాయి. 


మండలాల వారీగా పంటల నష్టం వివరాలు..

మండలం రైతుల సంఖ్య పంట నష్టం (ఎకరాల్లో)

అబ్దుల్లాపూర్‌మెట్‌ 699 1,247

ఇబ్రహీంపట్నం 1,760 2,681

మంచాల 1,427 1,810.10

మాడ్గుల 19,298 20,744.03

యాచారం 861 1,445

మొత్తం 24,045 27,927.13      

Updated Date - 2020-10-30T10:13:46+05:30 IST