ధాన్యం.. జాప్యం

ABN , First Publish Date - 2021-05-17T05:16:35+05:30 IST

ధాన్యం.. జాప్యం

ధాన్యం.. జాప్యం

ఆర్‌బీకేలకు కేటాయించినా మిల్లులు తెరవని పరిస్థితి

మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకుండా తొక్కిపెడుతున్నారని రైతుల ఆరోపణ

వెంటాడుతున్న వర్షం భయం

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి/విస్సన్నపేట : జిల్లాలో రబీ సీజన్‌లో పండించిన ధాన్యం విక్రయించడం రైతులకు తలనొప్పిగా మారింది. నిబంధనల పేరుతో మిల్లర్లు, అధికారులు ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఈ-క్రాప్‌లో పంట వివరాలు నమోదు కాకుంటే ఆ ధాన్యం కొనుగోలు చేయమని ఆర్‌బీకేల్లో పనిచేసే సిబ్బంది చెబుతున్నారు. జిల్లాలో 497 ధాన్యం కొనుగోలు కేంద్రాలుండగా, ఈ సీజన్‌లో వాటిలో 400 వరకు పనిచేస్తున్నాయి. అయితే, ఆర్‌బీకేలకు కేటాయించిన మిల్లులు చాలావరకు మూతపడి ధాన్యం కొనుగోళ్లు జరపకపోవడంతో విక్రయాలు నిలిచిపోతున్నాయి. వరి కోత యంత్రాల ద్వారా నూర్పిడి చేసిన ధాన్యం ఇతర జిల్లాలకు రవాణా చేయాలంటే అనుమతులు పరిమితంగా ఇస్తుండటంతో ధాన్యం కొనుగోళ్లలో మరింత ఆలస్యం జరుగుతోంది. ఇతర జిల్లాలకు ధాన్యం రవాణా చేసేందుకు ఆర్‌బీకేల్లో నమోదు కోసం ప్రయత్నిస్తే ఇతర జిల్లాల్లోని మిల్లుల వివరాలు లాగిన్‌లో చూపని పరిస్థితి ఏర్పడింది. 

ధాన్యం మాకొద్దంటున్న మిల్లర్లు

రబీ సీజన్‌లో 82,363 హెక్టార్లలో వరిసాగు జరిగింది. 6 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనాగా ఉంది. ఇప్పటివరకు 1.25 లక్షల టన్నుల ధాన్యం కూడా కొనుగోలు జరగని స్థితి. జిల్లాలో 801 ఆర్‌బీకేలున్నాయి. ఎంపిక చేసిన ఒక్కో ఆర్‌బీకేకు 10 నుంచి 12 మిల్లులను కేటాయించారు. రైతులు తాము పండించిన ధాన్యం శాంపిళ్లను ఆర్‌బీకేలకు తీసుకెళ్తే ఏ మిల్లుకు, ఏ తేదీన పంపాలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి వివరాలు తెలియజేస్తారు. దీనిని బట్టి రైతులు మిల్లుకు ధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు చిక్కు ఉంది. ఉదాహరణకు బందరు మండలం నెలకుర్రు పీఏసీఎస్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి చల్లపల్లి మిల్లును కేటాయించారు. రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేయనని ఈ మిల్లు యజమాని తెగేసి చెప్పారు. ఘంటసాలలోని మిల్లును కేటాయించగా, ఈ మిల్లుకు తాళాలు తీయడం లేదు. పాగోలులోని మిల్లును కేటాయించగా, రబీ ధాన్యం కొనుగోలు చేసేందుకు అనుమతులే తీసుకోలేదని యజమాని సమాధానం చెబుతున్నారు. విస్సన్నపేట మండల ధాన్యాన్ని గుడివాడలోని ఆరు మిల్లులకు కేటాయించారు. ఇప్పటివరకు కేవలం 2,430 టన్నుల ధాన్యం మాత్రమే ఈ మండలం నుంచి కొన్నారు. తిరువూరు మండలంలో 7,120 ఎకరాల్లో వరిసాగు జరగ్గా, 19,130 టన్నుల ధాన్యం దిగుబడి అంచనాగా ఉంది. ఇటీవల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి రైతులు ఆందోళనకు దిగారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోంది. ఈ-క్రాప్‌లో నమోదు కాలేదనే కారణంతో కొందరు రైతుల వివరాలు ఈ మండలంలోని ఆర్‌బీకేల్లో నమోదు కాని స్థితి నెలకొంది. తిరువూరులో కేవలం రెండు మిల్లులకే అనుమతులు ఇవ్వగా, మిగిలిన ధాన్యం హనుమాన్‌ జంక్షన్‌లో కేటాయించారు.

కావాలనే తొక్కిపెడుతున్నారా..?

మచిలీపట్నంలో రోజుకు వెయ్యి నుంచి 4వేల సారలు మిల్లింగ్‌ చేసే సామర్థ్యం ఉన్న మిల్లులు ఉన్నాయని రైతులు అంటున్నారు. ధాన్యం ఒక్కసారి కొనుగోలు చేస్తే 15 రోజుల వ్యవధిలోనే మిల్లింగ్‌ కార్యక్రమం పూర్తవుతుంది. అనంతరం మిల్లులను ఖాళీగా ఉంచాల్సి ఉంటుంది. ఈ కారణంతో ధాన్యంలో తేమశాతం, ఇతరత్రా కారణాలు చూపి మిల్లర్లు కొసరి కొసరి  ధాన్యం కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.  

వర్షాలకు రైతుల్లో భయం

వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వారంలో మూడు నాలుగు దపాలుగా వర్షం కురుస్తూనే ఉంది. శనివారం కూడా కురిసింది. మరో మూడు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  దీంతో రైతుల్లో భయం పట్టుకుంది. ఇదే అదనుగా భావించి రూ.1,418 కొనాల్సిన బస్తా ధాన్యాన్ని రూ.1,000కే కొంటున్నారు.




Updated Date - 2021-05-17T05:16:35+05:30 IST