Abn logo
Aug 11 2020 @ 02:46AM

నాపై మీడియా చేస్తున్న ‘విచారణ’ ఇది!

  • సుప్రీంలో రియా చక్రవర్తి అఫిడవిట్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 10: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసును గోరంతలు కొండంతలు చేస్తున్నారని అతని గర్ల్‌ ఫ్రండ్‌ రియా చక్రవర్తి సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. నిరంతరం సంచలనాలు సృష్టించే పనిలో నిమగ్నమైన మీడియా ఈ కేసు ద్వారా తనపై అవధుల్లేని ‘విచారణ’ సాగిస్తోందని, ఇది తనకు తీవ్ర మనోవేదన కలిగిస్తోందని ఆమె చెప్పారు. మీడియా తీరు తన ప్రైవసీ హక్కులకు భంగకరంగా మారిందని రియా పేర్కొన్నారు. పట్నాలో తనపై దాఖలైన కేసును ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ గతంలో రియా దాఖలు చేసిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో మంగళవారం మళ్లీ విచారణకు రానున్న నేపథ్యంలో... రియా 12 పేజీలతో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేశారు. తనపై పట్నాలో సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ కేసు పెట్టడానికి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమారే కారకులని వార్తలు వచ్చాయని, ఈ రాజకీయ కుట్రలలో తనను బలి పశువును చేయవద్దని ఆమె సుప్రీంకోర్టుని అభ్యర్థించారు. సుశాంత్‌ మృతి విచారకరమని, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటనను మీడియా గోరంతలు కొండంతలు చేసిందని ఆమె ఆరోపించారు. రియా చక్రవర్తి ఆరోపణలపై బిహార్‌ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కాగా, బిహార్‌ ప్రభుత్వ సిఫారసు మేరకు సుశాంత్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణను సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే.


Advertisement
Advertisement
Advertisement