Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కాంట్రాక్టర్ల రివర్స్‌

twitter-iconwatsapp-iconfb-icon
కాంట్రాక్టర్ల రివర్స్‌వర్షాలకు పుల్లలచెరువులో అధ్వానంగా మారిన రహదారి ,బురదమయంగా ఉన్న టంగుటూరు - పొదిలి రహదారి (ఫైల్‌)

ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులకు

ముందుకు రాని వైనం 

ఇప్పటికి మూడుసార్లు స్పందన కరువు

యంత్రాంగం ఎంత ప్రయత్నించినా ససేమిరా

తాజాగా నాల్గోసారి పిలిచిన అధికారులు

నివర్‌ తుపాన్‌కు భారీగా దెబ్బతిన్న రోడ్లు

అప్పటి నుంచి పనులు చేపట్టని వైనం

తాజా వర్షాలకు మరింత అధ్వానం

ఒంగోలు (జడ్పీ), డిసెంబరు 8 :

ఒకటోస్సారి.. రెండోస్సారి.. మూడోస్సారి.. నాలుగోస్సారి.. ఇది వేలంపాట అనుకుంటున్నారా! కాదు కాదు.. సర్కారు వారి టెండర్ల పాట్లు! జిల్లాలోని ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులకు కాంట్రాక్టర్లు ముందుకురాకపోవడంతో ఇలా పదేపదే టెండర్లు పిలుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచడం ఇందుకు ప్రధాన కారణమైంది. అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడినా వారు ససేమిరా అంటున్నారు. దీంతో రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గత సంవత్సరం నవంబరులో నివర్‌ తుఫాన్‌ విరుచుకుపడడంతో జిల్లాలోని ఆర్‌అండ్‌బీ రోడ్లు ధ్వంసమయ్యాయి. వాటి మరమ్మతులకు మార్చిలో ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అప్పటి నుంచి అధికారులకు టెండర్ల  కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికి మూడుసార్లు స్పందన కరువైనప్పటికీ పట్టు వదలని విక్రమార్కుల్లా  తాజాగా నాలుగోసారి బిడ్లు ఆహ్వానించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు గతంలో ఉన్న బకాయలు చెల్లించడంతోపాటు మున్ముందు బిల్లులు చెల్లింపుపై వారిలో విశ్వాసాన్ని కల్పిస్తే తప్ప ముందుకొచ్చే పరిస్థితి లేదు.  


 ప్రభుత్వ పనులకు టెండరు దక్కించుకోవడానికి గతంలో కాంట్రాక్టర్లు పోటీపడేవారు. వ్యూహప్రతివ్యూహాలతోపాటు రాజకీయ నాయకుల పైరవీల దాకా అందుబాటులో ఉన్న ఏఒక్క అవకాశాన్ని వదులుకునే వారు కాదు. ఎందుకుంటే అది ప్రభుత్వ పని అనే దిలాసా. సమయానికి డబ్బులు వస్తాయి కాబట్టి ఒక రూపాయి సంపాదించుకోవచ్చ అశ. దీంతో లెక్కకుమించి పోటీపడేవారు. కానీ ప్రస్తుతం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పనులంటేనే కాంట్రాక్టర్లు మాకొద్దు బాబోయ్‌ అని పరుగెడుతున్నాడు. పోటీ సంగతి దేవుడెరుగు కనీసం ఒకరిద్దరు కూడా బిడ్డింగ్‌కు ముందుకు రావడం లేదు. నివర్‌ తుఫాన్‌కు జిల్లాలో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులకు పదేపదే టెండర్లు పిలిచినా కాంట్రాక్ట నుంచి స్పందన కరువవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 


మార్చిలో అనుమతులు

జిల్లావ్యాప్తంగా మొత్తం 67 రహదారుల మరమ్మతులకు మార్చిలో ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులిచ్చింది. ఇవన్నీ కూడా గత సంవత్సరం నివర్‌ తుఫాన్‌కు దెబ్బతిన్నవే. వీటిని స్టేట్‌ హైవేస్‌, జిల్లాలోని ప్రధాన రహదారులుగా విభజించి అంచనాలు రూపొందించారు. జిల్లాలోని ప్రధాన రహదారులు 362 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని వాటికి రూ.86.3 కోట్లు ఖర్చు కాగలదని ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమోదించింది. వీటిని 61 పనులుగా విభజించి టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టారు. రాష్ట్రీయ రహదారులకు సంబంధించిన రూ.10.87 కోట్లతో ఆరు పనులకు బిడ్లు ఆహ్వానించారు. 


ఇప్పటికి మూడుసార్లు స్పందన కరువు

మొదటిసారి పిలిచిన టెండర్ల గడువు ఈ ఏడాది ఏప్రిల్‌ 13న ముగిసింది. దాదాపు 60 పనులకు బిడ్లను ఆహ్వానిస్తే ఒక్కటంటే ఒక్క టెండర్‌ మాత్రమే అప్పట్లో దాఖలైంది. చేసేదిలేక అధికారులు రెండోసారి బిడ్లను ఆహ్వానించారు. ఈదఫా ముందుగా  నిర్ణయించిన ముగింపు గడువుకన్నా మరికొన్ని రోజులు పొడిగించారు. తొలుత మే 6 వరకు గడువు ఇచ్చి అనంతరం దానిని 17 వరకు పొడిగించారు. అయినప్పటికీ కనీస స్పందన కరువైంది. రెండు నెలల క్రితం మూడోసారి టెండర్లకు యంత్రాంగం వెళ్లింది. ఈసారి రాష్ట్ర స్థాయిలో కాంట్రాక్టర్లతో సమావేశాలు కూడా ఏర్పాటు చేసి బిడ్లు  ఆహ్వానించారు. కానీ కాంట్రాక్టర్లలో ప్రభుత్వంపై నమ్మకం కలగకపోవడంతో మూడోసారి కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా నాలుగోసారి టెండర్లను ఆహ్వానించారు. ఈసారైనా కాంట్రాక్టర్లు స్పందిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.  

పాత బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ల వెనుకడుగు

గత ప్రభుత్వంలో ఆర్‌అండ్‌బీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రస్తుత ప్రభుత్వం బిల్లులను చెల్లించడం లేదు. వీళ్లలో అత్యధిక శాతం మంది చిన్న కాంట్రాక్టర్లే ఉండడంతో వారు ఆర్థికంగా నానా కష్టాలు పడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ప్రస్తుత టెండర్లకు  ఎవ్వరూ ముందుకు రావడం లేదు. పాతవారు ఆర్థిక కారణాలతో టెండర్లు వేయలేకపోతే కొత్తవారు వారి అనుభవాల రీత్యా జంకుతున్నారు. ఫలితంగా రోడ్లు అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పపడుతున్నారు. 


ఇటీవల  వర్షాలతో మరింత అధ్వానం...

నివర్‌ మరమ్మతులే ఇప్పటికీ ప్రభుత్వం చేపట్ట లేదు. ఇటీవల కురిసన వర్షాలతో ఆర్‌ అండ్‌ బీ రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. గోతుల మయమయిన రహదారుల కారణంగా ప్రమాదాలు సైతం ఎక్కువగా జరుగుతున్నాయి. నెలల తరబడి ప్రజల ఎదురు చూపులే తప్ప ఇంతవరకు రహదారుల మరమ్మతులు ప్రారంభం కాలేదు. ఇలా టెండర్ల దశ దాటడానికే  ఏడెనిమిదినెలల సమయం పట్టిందంటే ఇక మరమ్మతులు ఎప్పటికి పూర్తవుతాయో, రహదారి కష్టాలు ఎప్పటికి తీరతీయో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరమ్మతులు చేయాల్సిన రోడ్లలో ప్రధానమైనవి ఇవే.. 

ఆర్‌అండ్‌బీ అధికారులు మరమ్మతుల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్న వాటిలో నాయుడువారిపాలెం-జరుగులవారిపాలెం, మానేపల్లి-పుల్లలచెరువు, కొప్పోలు-మోటుమాల, ఒంగోలు-చండ్రపాలెం, తిక్కరాజుపాలెం--చెరుకూరు జిల్లా ప్రధాన రహదారుల జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర రహదారుల్లో కంభం--గిద్దలూరు, పర్చూరు--ఇంకొల్లు, గుంటూరు--పర్చూరు, టంగుటూరు-పొదిలి, వావిలేటిపాడు-కామేపల్లి- కొండపి, బాపట్ల-పర్చూరు ఉన్నాయి. ఇక ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సుమారు రూ.40 కోట్ల  మేర నష్టం వాటిల్లిందని అంచనా.  


 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.