విద్యాశాఖలో వసూళ్ల ఏడీ..!

ABN , First Publish Date - 2021-11-30T06:40:57+05:30 IST

ఆయనో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ). ఆయన వద్దకు ఫైల్‌ వెళ్లిందంటే.. దానికి కాసుల కప్పం కట్టాల్సిందే. లేకుంటే..

విద్యాశాఖలో వసూళ్ల ఏడీ..!

డైరెక్టర్‌ ఆఫీస్‌ పేరు చెప్పి బెదిరింపులు..

జిల్లా నుంచి స్టేట్‌ వరకూ అక్రమాలు

నిత్యం రూ.10 వేల నుంచి 

రూ.20 వేలు లేనిది ఇంటికెళ్లడు..

డబ్బులివ్వందే ఫైలు కదల్చడు

ఆరు నెలలైనా అంతే..

కోట్లకు పడగలెత్తిన ఏడీ

అనంతపురం విద్య, నవంబరు 29: ఆయనో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ). ఆయన వద్దకు ఫైల్‌ వెళ్లిందంటే.. దానికి కాసుల కప్పం కట్టాల్సిందే. లేకుంటే... అది ఆరు మాసాలైనా... ఏకంగా ఏడాది గడిచినా.. కదలదు. మామూళ్లు ఇచ్చుకుని సారును ప్రసన్నం చేసుకోవాల్సిందే. దీనికితోడు తాను డైరెక్టర్‌ కార్యాలయం (పాఠశాల విద్యాశాఖ)లో పనిచేసిన అనుభవాన్ని చెప్పుకుని అక్కడా తన మనుషులున్నారంటూ.. క్షణాల్లో పని కానిచ్చేస్తానంటూ నమ్మిస్తాడు. డబ్బు లాగేసి సొమ్ము చేసుకుంటాడు. ఇదీ జిల్లా విద్యాశాఖలో ఓ ఏడీ తీరు. ఆయన బాధితులు కుప్పలు తెప్పలు. ఉపాధ్యాయ సంఘాల నాయకుల నుంచి ఆ శాఖ ఉద్యోగులు సైతం ఆయన బాధితులే. సుమారు రెండేళ్ల కిందట డైరెక్టర్‌ ఆఫీస్‌ నుంచి జిల్లాకు వచ్చిన ఆ ఏడీ పేరు చెబితే... అమ్మో.. ఆయనకు పైకం ఇవ్వకుంటే ఫైళ్లు తొక్కిపెడతాడంటూ బహిరంగంగానే డీఈఓ ఆఫీ్‌సలో చర్చించుకుంటున్నారు.


డబ్బులివ్వనిదే.. ఫైల్‌ కదలదు..

జిల్లా విద్యాశాఖలో ఏడీగా ప్రస్తుతం పనిచేస్తున్న ఆయన పేరు చెబితే చాలు అయ్యబాబోయ్‌ వసూళ్ల కిలాడీ అంటారు. ఆయనకు వచ్చే పైకం రాకుంటే.. ఇక చుక్కలు చూపిస్తాడు. నెలల తరబడి, ఏళ్ల తరబడి డీఈఓ ఆఫీస్‌ చుట్టూ తిప్పిస్తాడు. టీచర్లు, ఉద్యోగుల ఫైళ్లు ఆయన వద్దకు వస్తే... ముందుగా మాట్లాడుకోవాలి. ఒప్పందం కుదుర్చుకుని ఆయన ఖజానాకు లెక్కలు కట్టకుంటే... ఇక వాటిని తొక్కి పెట్టేస్తాడు. నిత్యం రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఆయన జేబులో నిండనిదే... ఆయనకు నిద్ర పట్టదు. ఇలా కోట్లకు పడగలెత్తాడు. సుమారు ఏడాదిన్నర కిందట రిటైరైన ఓ క్లర్క్‌ తన రిటైర్మెంట్‌, మెడికల్‌ బెనిఫిట్స్‌ కోసం ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాడు. విద్యాశాఖ ఉన్నతాధికారుల వద్ద వాహన డ్రైవర్‌గా విధులు నిర్వర్తించిన మరో రిటైర్డ్‌ ఉద్యోగి సైతం ఈయన బాఽధితుడే. చిన్న ఉద్యోగులే కాదు.. ఎంఈఓలు, ఇతర ఉపాధ్యాయ సంఘం నాయకులు సైతం ఆయన బాధితుల జాబితాలో ఉన్నారు. కదిరి ప్రాంతంలో పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఎంఈఓను సైతం మూడు నెలలకుపైగా తిప్పాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే... ఆయన ముక్కుపిండి వసూళ్లు చేసే క్రమంలో ఎందరో బాధితులున్నారు.


డైౖరెక్టర్‌ ఆఫీస్‌ పేరు చెప్పి బెదిరింపులు

స్టేట్‌ ఆఫీ్‌సతో బెదిరింపుల అస్త్రం కూడా ప్రయోగిస్తాడు. ఈ వసూళ్ల ఏడీ జిల్లా విద్యాశాఖలోకి సుమారు రెండేళ్ల కిందట వచ్చాడు. ఏడీగా ప్రస్తుతం పనిచేస్తున్న ఓ ఉద్యోగి గతంలో డైరెక్టర్‌ ఆఫీస్‌లో పనిచేశాడు. ఆయన అక్కడ ఉన్నప్పుడు సైతం మామూళ్లకు అలవాటు పడ్డాడు. గతంలో సైతం పైకం ఇవ్వనిదే.. పైలు కదిపే వాడు కాదు. జిల్లాకు చెందిన కొందరు సమగ్రశిక్ష సెక్టోరియల్‌, అసెస్టెంట్‌ సెక్టోరియల్‌ అధికారులకు నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా పక్షం రోజులు ఆపినట్లు సమాచారం. ఆఖరికి తయన చెప్పిన ఖాతాలోకి డబ్బు వేస్తే... ఉత్తర్వు కాపీలను పంపినట్లు విమర్శలున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసి కడపకు బదిలీపై వెళ్లిన ఓ ఏడీని సైతం ఈయన భారీగా ఇబ్బందులకు గురిచేసినట్లు విమర్శలున్నాయి. డైౖరెక్టర్‌ ఆఫీ్‌సలో తనకు ఉన్న పరిచయాలతో ఆ ఏడీకి ఫోన్లు చేయించి, తక్షణం విజయవాడ రావాలనీ, లేదా కోర్టు కేసులకు అటెండ్‌ కావాలంటూ చెప్పించి, వేధించినట్లు సమాచారం. ఇతర ఉద్యోగులు సైతం ఆయన కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విమర్శలున్నాయి. పలు ప్రైవేట్‌ స్కూళ్ల ఫైళ్లు, ఇతర టీచర్ల సర్వీసు మ్యాటర్లకు  మరింత రెట్టింపు రేటు కట్టి తనకున్న పరిచయాలతో డైరెక్టర్‌ ఆఫీ్‌సలో చక్రం తిప్పుతూ లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.


అడిగేవారేరీ...?

ఈ అక్రమార్కుడికి ఆఫీ్‌సలో బోర్‌ కొట్టినా, సెలవు పెట్టాలనుకుంటే... ఇక సెలవుల చీటీ (లెటర్‌) పెట్టడు, అనుమతి తీసుకోడు. ఏకంగా 2, 3 రోజులు డ్యూటీకి డుమ్మా కొడతాడు. ఉన్నతాధికారులు ఎవరూ అడగలేదనుకో.. సెలవుల తర్వాత డ్యూటీకి వచ్చిన రోజు రిజిస్టర్‌లో సంతకాలు చేసేస్తాడు. ఎవరైనా కనుక్కుంటే మాత్రం... ఆగమేఘాల మీద సీఎల్‌ వేసినట్లు డీఈఓ ఆఫీస్‌ ఉద్యోగులకు సందేశం పంపి, మేనేజ్‌ చేయాలని చూస్తాడు. విద్యాశాఖ ఉన్నతాధికారిని సైతం తప్పుదోవ పట్టించి పాలనను భ్రష్ణుపట్టించాడన్న  విమర్శలున్నాయి. కొందరి నుంచి రూ. 40 వేలు, రూ.50 వేలు తీసుకుని పాలనానుభవం లేని క్లర్కులను డీఈఓ ఆఫీ్‌సకు వేసుకున్నాడు. దీంతో విద్యాశాఖలోని పలు సెక్షన్లలో కొందరికి కనీసం ఫైల్స్‌ రాసే పరిజ్ఞానం కూడా లేదని ఇతర ఉద్యోగులు వాపోతున్నారు. కోర్టు కేసులు, ఇతర అత్యవసర పనులు పడితే చిన్న ఫైల్‌ రాయమంటే దిక్కులు చూసే వారు చా లామంది ఉన్నారు. ఇలాంటి స్టాఫ్‌ అంతా ఈ వసూళ్ల ఏడీ నియమించుకున్న వారేనన్న ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఈయన అక్రమాలు అన్నీ.. ఇన్నీ కావు. జిల్లా నుంచి స్టేట్‌ ఆఫీస్‌ వరకూ ఉన్నాయి. మరి అటు వ్యవస్థకు, ఇటు విద్యాశాఖకు చేటుగా మారిన ఈ వసూళ్ల ఏడీపై కొత్త విద్యాశాఖ కమిషనర్‌  ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి.

Updated Date - 2021-11-30T06:40:57+05:30 IST