బాబ్రీ విధ్వంసంపై సుప్రీం నిర్దేశంతోనే మలి విచారణ

ABN , First Publish Date - 2020-10-01T08:29:30+05:30 IST

2017 ఏప్రిల్లో కుట్రకోణం కేసును పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు నిర్దేశించింది...

బాబ్రీ విధ్వంసంపై సుప్రీం నిర్దేశంతోనే మలి విచారణ

  • ఆడ్వాణీ, జోషీ సహా 48 మందిపై..
  • 2001లోనే అభియోగాల ఉపసంహరణ
  • 2017లో వాటిని పునరుద్ధరించిన సుప్రీం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: ఐదు శతాబ్దాలు రగిలిన అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో మసీదు కూల్చివేత కీలక పరిణామం. 1992 డిసెంబరు 6వ తేదీన కరసేవకులు అయోధ్య చేరుకుని.. కట్టడాన్ని కూల్చివేసిన సంఘటన దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. బీజేపీ సీనియర్‌ నేతలు లాల్‌కృష్ణ ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ, ఉమాభారతి, వినయ్‌ కతియార్‌తో పాటు పలువురు వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్‌, సంఘ్‌పరివార్‌ నాయకులు ఆనాడు అక్కడే ఉన్నారు. వారు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే కరసేవకులు మసీదును కూల్చివేశారని ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విధ్వంసానికి సంబంధించి అప్పట్లో రెండు కేసు లు నమోదయ్యాయి. ఒకటి గుర్తు తెలియని కరసేవకులపై నమోదు కాగా.. రెండోది ఆడ్వాణీ, జోషీ తదితరులపై నమోదైంది. కూల్చివేత వెనుక కుట్ర కోణం ఉందని 1993 అక్టోబరులో వారిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఎనిమిదేళ్లు విచారణ తర్వాత.. 2001 మే నెలలో సీబీఐ ప్రత్యేక కోర్టు వీరందరిపై అభియోగాలను ఉపసంహరిస్తూ తీర్పు ఇచ్చింది. సాంకేతిక కారణాలతో వారిపై అభియోగాలను కోర్టు కొట్టివేసిందంటూ 2004 నవంబరులో సీబీఐ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు వారందరికీ నోటీసులు జారీచేసింది. అయితే 2010లో సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదే సమయంలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని నిర్దేశించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు 2011 మేలో స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఆడ్వాణీ తదితరులపై కేసు కొట్టివేతను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. 2017 ఏప్రిల్లో వారిపై కుట్రకోణం కేసును పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు నిర్దేశించింది. గుర్తుతెలియని కరసేవకుల కేసును, వీఐపీ నేతలపై ఉన్న కేసును కలిపేసింది. సీబీఐ కోర్టు విచారణకు ఆదేశించింది. దరిమిలా కేసు విచారణను వేగవంతం చేసిన కోర్టు.. అన్ని పక్షాల వాదోపవాదాలను ఆలకించాక.. ఆడ్వాణీ తదితరులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.

Updated Date - 2020-10-01T08:29:30+05:30 IST