మళ్లీ.. ‘కాల్‌’కలం..!

ABN , First Publish Date - 2021-10-09T05:37:39+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం.. మళ్లీ వార్తల్లో నిలిచింది. మరో ‘కాల్‌’ కలకలం జిల్లా అంతటా వైరల్‌ అవుతోంది. ఓవైపు తప్పు సరిదిద్దకుంటే ఏసీబీని ఆశ్రయిస్తానని డీఎంహెచ్‌ఓను పరోక్షంగా హెచ్చరించడమే కాకుండా.. జాయింట్‌ కలెక్టర్‌పై ఆరోపణలు చేసిన ఆడియో సంభాషణ వైరల్‌ ఆ శాఖలో చర్చనీయాంశమైంది.

మళ్లీ.. ‘కాల్‌’కలం..!

 డీఎంహెచ్‌వోతో రిటైర్డ్‌ ఏవో ఫోన్‌ సంభాషణ లీక్‌

 జేసీని తిట్టిపోస్తూ వ్యాఖ్యలు

 తప్పు సరిచేయకుంటే ఏసీబీ వద్దకే వెళ్తా.. సరెండర్‌ అయిపోతా

 జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారికే ఫోన్‌లో పరోక్ష హెచ్చరిక

 ‘రీ ఓకే’ ఆర్డర్‌ ఇచ్చేస్తానంటూ బదులిచ్చిన డీఎంహెచ్‌వో

 జిల్లా అంతటా రికార్డింగ్‌ వైరల్‌ 

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం.. మళ్లీ వార్తల్లో నిలిచింది. మరో ‘కాల్‌’ కలకలం జిల్లా అంతటా వైరల్‌ అవుతోంది. ఓవైపు తప్పు సరిదిద్దకుంటే ఏసీబీని ఆశ్రయిస్తానని డీఎంహెచ్‌ఓను పరోక్షంగా హెచ్చరించడమే కాకుండా.. జాయింట్‌ కలెక్టర్‌పై ఆరోపణలు చేసిన ఆడియో సంభాషణ వైరల్‌  ఆ శాఖలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..  జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో కొద్దినెలల కిందట పరిపాలనాధికారి(ఏవో)గా పక్కి చిట్టిబాబు పనిచేశారు. వైద్యఆరోగ్యశాఖ పరిధిలో గత ఏడాది కొన్ని పోస్టుల భర్తీ విషయంలో నకిలీ సర్వీసు సర్టిఫికెట్లు వెలుగుచూశాయి. దీనిపై ఏవో చిట్టిబాబుతోపాటు మరికొందరిపై ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. కొద్దినెలల కిందటే చిట్టిబాబును ప్రభుత్వానికి సరెండర్‌ చేసేశారు. ఇటీవల చిట్టిబాబు రిటైర్‌ అయ్యారు. ఇదిలా ఉండగా కరోనా ఉధృతి నేపథ్యంలో ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలను కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్‌), పీహెచ్‌సీల్లో నియమించారు. వారిని ఇటీవల ప్రభుత్వ ఆదేశాలతో తొలగించేశారు. అయితే ఇక్కడే పొరపాటు జరిగిందంటూ డీఎంహెచ్‌వోతో రిటైర్డ్‌ ఏవో చిట్టిబాబు జరిపిన ఫోన్‌ సంభాషణ వెలుగులోకి వచ్చింది.  


 కాల్‌ రికార్డింగ్‌లో ఏముందంటే?

డీఎంహెచ్‌ఓ చంద్రానాయక్‌తో రిటైర్డ్‌ ఏవో ఫోన్‌లో మాట్లాడుతూ... ‘ఎటువంటి ఉత్తర్వులు లేకుండా జాయింట్‌ కలెక్టర్‌ చెప్పారని ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలను మీరు సంతకం పెట్టి మరీ తొలగించేశారు. అందులో నేను పైసా కూడా డబ్బులు తినలేదు. ఎవరో ఇచ్చిన ఆర్డర్‌ ప్రకారం వారిని తీసేస్తే ఎలా? అందరూ కలసి నాకు అన్యాయం చేశారు. జేసీ శ్రీనివాసులు కూడా అన్యాయం చేశారు. టెర్మినేషన్‌ సంతకం మీరు ఎలా పెడతారు? సూపరింటెండెంట్‌ భాస్కరరావు మాటలు విని మోసపోయారు. ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలను కాదు తొలగించాల్సింది. 600 మంది వైద్యులు, స్టాఫ్‌నర్సులు.. డెంటల్‌ డాక్టర్లను తొలగించాలి. ఉన్న ఎక్జిస్టింగ్‌ పోస్టులను తీసేయకూడదు. జేసీ చెబితే మీరు ఎలా తొలగిస్తారు? డబ్బులు ఇచ్చిన వారిని ఉంచేసి.. డబ్బులు ఇవ్వనివారిని తీసేస్తారా? కోర్టుకు వెళ్తే బుక్కయ్యేది మీరే. ఇటువంటప్పుడే ఆలోచించాలి. నా పిల్లల సాక్షిగా చెబుతున్నా. నేను అబద్ధం ఆడను. అందుకే ఏసీబీ దగ్గరికి వెళ్తాను. జేసీ పిచ్చివేషాలు వేస్తున్నాడా? మిమ్మల్ని బుక్‌ చేసేశారు. అయినా నేనున్నాను. మీకేంకాదు. డబ్బుల కోసమే మిమ్మల్ని మోసం చేశారు. మీరు రిటైర్‌ అయితే అంతే సంగతి. పింఛను కూడా రాదు. మీరు డబ్బులు తిన్నారా? ఎవడో తింటే మీరు ఎందుకు బాధపడాలి? మనం మనం కూర్చుందాం. ఆదివారం ఆఫీసుకు వచ్చి అన్నీ సరిచేద్దాం. లేదంటే ఏసీబీ వద్దకు వెళ్తా. అంతే!’ అని పేర్కొన్నారు. ఇలా మాట్లాడుతూ మధ్యలో జేసీపై కూడా అసభ్యకర పదాలు ఉపయోగించారు. 


 సండే రండి... రీ ఓకే ఆర్డర్‌ ఇచ్చేస్తా...

రిటైర్డ్‌ ఏవో మాటలకు ఫోన్‌లో డీఎంహెచ్‌వో ఇలా బదులిచ్చారు. ‘రాష్ట్రం మొత్తం ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలను అలానే తీసేశారు. జేసీ గారు ఓరల్‌గా చెబితేనే అలా చేశా. అయినా కోర్టుకువెళ్లి అభ్యర్థులు మళ్లీ ఉత్తర్వులు తెచ్చుకోవచ్చు. మీరు ఎక్కడున్నారు.. సరే సండే(ఆదివారం) రండి. అన్నీ పరిశీలించి మళ్లీ రీఓకే ఆర్డర్‌ ఇచ్చేద్దాం. సండే రావాలి. సండే వస్తారా.. మండే వస్తారా? మీరు రండి’ అని డీఎంహెచ్‌వో మాట్లాడినట్టు రికార్డింగ్‌ వైరల్‌ అవుతోంది. 

 

 ఎందుకు ప్రశ్నించలేకపోయారో?

రిటైర్డ్‌ ఏవో... ఇక్కడి నుంచి సరెండర్‌పై వెళ్లిన వ్యక్తి ఫోన్‌లో డీఎంహెచ్‌వోనే ప్రశ్నించిన పరిస్థితి.. చనువు ఎలా వచ్చింది..?. ఏసీబీ వద్దకు వెళ్తాను అని పరోక్షంగా బెదిరించే సాహసం ఎలా చేయగలిగారనేది  వైద్యఆరోగ్య శాఖలో చర్చనీయాంశమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే కాల్‌ రికార్డింగ్‌ బయటకు విడుదల చేశారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పైగా ఏసీబీ వద్దకు వెళ్తా అంటే ‘వెళ్తే వెళ్లండి.. ప్రభుత్వ ఆదేశాలతోనే చేశానుగా... ఇందులో జేసీని విమర్శించడం ఎంతవరకు సబబు’ అని కూడా డీఎంహెచ్‌వో  తిరిగి ప్రశ్నించలేని స్థితిలో ఎందుకున్నారనే దానిపై విమర్శలు వినిపిస్తున్నాయి.  ఈ ‘కాల్‌’ కలకలంపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశమవుతోంది. 


  ఫోన్‌ చేస్తే మాట్లాడా.. 

రిటైర్డ్‌ ఏవో చిట్టిబాబు ఫోన్‌చేస్తే మాట్లాడాను. కానీ ఆడియో రికార్డింగ్‌ చేసినట్లు నాకు తెలియదు. ఇంకా నేను ఏమీ మాట్లాడలేదు. రిటైర్డ్‌ ఏవో చెప్పిన వాటిలో వాస్తవం లేదు. జేసీ గారే రిటైర్డ్‌ ఏఓపై కేసు పెడతారు. 

 - చంద్రానాయక్‌, డీఎంహెచ్‌వో

Updated Date - 2021-10-09T05:37:39+05:30 IST