ఎయిడెడ్‌పై పునరాలోచన

ABN , First Publish Date - 2021-10-28T06:21:26+05:30 IST

ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది.

ఎయిడెడ్‌పై పునరాలోచన

బోధన, బోధనేతర సిబ్బందిని సరండర్‌ చేస్తూ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవలసిందిగా యాజమాన్యాలకు విద్యా శాఖ అధికారుల ఫోన్‌

ఎయిడెడ్‌లో కొనసాగించాల్సిందిగా కోరుతూ లేఖరులు రాయాలని సూచన

మరోవైపు ఎయిడెడ్‌ టీచర్ల కౌన్సెలింగ్‌కు సీనియారిటీ జాబితా సిద్ధం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడికక్కడ రోడ్డెక్కుతుండడంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారం మరింత ముదరకుండా చూడాలని విద్యా శాఖను అప్రమత్తం చేసింది. దీంతో అధికారులు రెండు రోజులుగా పాఠశాలల నిర్వాహకులకు ఫోన్‌ చేసి ఎయిడెడ్‌ టీచర్లను ప్రభుత్వానికి సరండర్‌ చేస్తూ గతంలో ఇచ్చిన లేఖలను వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ఎయిడెడ్‌ టీచర్లు, ఇతర సిబ్బందిని  కొనసాగించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే విద్యార్థులకు అన్నిరకాల ప్రయోజనాలు వర్తింపజేయాలని కోరుతూ విద్యా శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాయాలని కోరుతున్నారు. దీంతో రెండు, మూడు రోజుల్లో అన్ని యాజమాన్యాలు లేఖలు రాయాలని నిర్ణయించాయి. 


జ్ఞానాపురం ఘటనతోనే...

ఆస్తులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందిని తమకు అప్పగించాలని ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లాలో తొమ్మిది పాఠశాలల యాజమాన్యాలు ఆస్తుల అప్పగించగా, మరో 62 పాఠశాలల యాజమాన్యాలు టీచర్లు, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ను సరండర్‌ చేస్తూ ఇటీవల లేఖలు ఇచ్చాయి. ఇకపై ఆయా పాఠశాలలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందదని చెప్పడంతో విద్యార్థులను సమీపంలో గల ప్రభుత్వ పాఠశాలలకు పంపడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఉపాధ్యాయులకు జీతాలు, పాఠశాలల నిర్వహణకు సరిపడేలా పిల్లల నుంచి ఫీజులు వసూలు చేయడానికి వారి ఆర్థిక స్థోమత సరిపోదని అంచనాకు వచ్చిన యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి లేఖలు తీసుకున్న అనంతరం స్కూళ్లను మూసివేయాలని భావించాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జ్ఞానాపురంలోని సెక్రెడ్‌ హార్ట్‌, సెయింట్‌ పీటర్స్‌ పాఠశాలల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై పిల్లలను వేరే పాఠశాలల్లో చేర్పించుకోవాలని సూచించింది. విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నపళంగా పాఠశాలలను మూసేయడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నించారు. తాము ఏమీ చేయలేమని, ప్రభుత్వ విధానం వల్ల పాఠశాలలను నడపలేకపోతున్నామని చెప్పడంతో పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో మిగిలిన పాఠశాలల యాజమాన్యాలు  మూసివేతపై పునరాలోచనలో పడ్డాయి. తమ పాఠశాలల వద్ద కూడా ఆందోళనలు జరిగే అవకాశం ఉందని గుర్తించి...విద్యా శాఖ సూచన మేరకు గతంలో ఇచ్చిన లేఖలు వెనక్కి తీసుకుని, ఎయిడెడ్‌లో కొనసాగించాల్సిందిగా కోరుతూ లేఖలు రాస్తున్నాయి.


ఎయిడెడ్‌ టీచర్ల కౌన్సెలింగ్‌కు సీనియారిటీ జాబితా సిద్ధం

జిల్లాలో 246 మంది టీచర్లు, 40 మంది బోధనేతర సిబ్బంది ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉన్నారు. వీరందరినీ ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేయాలని భావించిన విద్యా శాఖ సీనియారిటీ జాబితా సిద్ధం చేసింది. గత నెలలో బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి వున్నప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. అయితే తాజాగా సీనియారిటీ జాబితాను రెడీ చేసింది. ఒక పక్క పాఠశాలలు ఎయిడెడ్‌ విధానంలో కొనసాగుతాయని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు టీచర్ల సీనియారిటీ జాబితాను సిద్ధంచేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


వసంతబాల విహార్‌ పాఠశాలను ప్రభుత్వం తీసుకోవాలి..

గురుద్వారా జంక్షన్‌లో వసంత బాలవిద్యావిహార్‌ విద్యాలయంలో ప్రాఽథమిక, ఉన్నత పాఠశాలలను ప్రభుత్వం తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విశాలమైన ప్రాంగణం, భవనాలతో కార్పొరేట్‌ సంస్థకు దీటుగా వున్న పాఠశాలలో ఇప్పటివరకు తమ పిల్లలకు ఉచితంగా చదువులు లభిస్తున్నాయని, ఎయిడెడ్‌ నుంచి తొలగిస్తే ఫీజులు చెల్లించలేమని కలెక్టర్‌, వీఎంఆర్‌డీ, జీవీఎంసీ కమిషనర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. కాగా పదో తరగతి చదువుతున్న పిల్లలను విద్యా సంవత్సరం మధ్యలో మరోచోటకు మార్చడంపై తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. 


ఆర్‌సీఎం పరిధిలోనే పాఠశాలలు కొనసాగుతాయి

రత్నకుమార్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, ఆర్‌సీఎం స్కూళ్లు, విశాఖపట్నం

మా పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో 21 పాఠశాలలు ఎయిడెడ్‌ విధానంలో కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎయిడెడ్‌ టీచర్లు, సిబ్బందిని విద్యా శాఖకు అప్పగిస్తూ ఇప్పటికే లేఖలు ఇచ్చాం. దీంతో టీచర్లు వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే రెండు రోజుల క్రితం జ్ఞానాపురంలో జరిగిన ఘటనతో విద్యా శాఖ నుంచి వచ్చిన సమాచారం మేరకు గతంలో ఇచ్చిన లేఖలు వెనక్కి తీసుకుంటున్నాం. ఎయిడెడ్‌ విధానంలో పాఠశాలలు కొనసాగింపుతోపాటు ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అన్ని రాయితీలు ఇవ్వాలని లేఖలు రాస్తున్నాం. 


పాఠశాల మూసివేతను వ్యతిరేకిస్తాం

దుర్గాప్రసాద్‌, పేరెంట్‌, వసంతబాల విద్యావిహార్‌

నేను గురుద్వారా జంక్షన్‌లో ఒక అపార్టుమెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నా. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు తొమ్మిది, మరొకరు ఏడో తరగతిని వసంత బాలవిద్యావిహార్‌లో చదువుతున్నారు. అయితే ఇప్పుడు పాఠశాల మూసివేస్తామని, మరో పాఠశాలకు పిల్లలను పంపాలని టీచర్లు చెబుతున్నారు. ఇది అన్యాయం. మధ్యలో పాఠశాలలను మూసేస్తే పిల్లల భవిష్యత్తు ఏంటీ? వసంత బాలవిహార్‌ను ప్రభుత్వం తీసుకుని నడపాలి.

Updated Date - 2021-10-28T06:21:26+05:30 IST