గౌరవమేనా?

ABN , First Publish Date - 2022-01-25T06:34:58+05:30 IST

ఇండియాగేట్ వద్ద యాభైయేళ్ళుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతికి నరేంద్రమోదీ ప్రభుత్వం స్థానచలనం కలిగించడం తీవ్ర విమర్శలకు కారణమైంది....

గౌరవమేనా?

ఇండియాగేట్ వద్ద యాభైయేళ్ళుగా నిర్విరామంగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతికి నరేంద్రమోదీ ప్రభుత్వం స్థానచలనం కలిగించడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ స్మారకంలోని జ్యోతిని కొద్దిదూరంలోని ‘నేషనల్ వార్ మోమోరియల్’ జ్యోతిలో విలీనం చేశారు. ఒక ఎయిర్ మార్షల్ పర్యవేక్షణలో మొన్న శుక్రవారం మధ్యాహ్నం సైనిక గౌరవాలూ లాంఛనాల మధ్య ఈ ప్రక్రియ జరిగింది. అమరజవాన్లకు నివాళులర్పించిన అనంతరం ఒక ప్రత్యేక కాగడాతో ఇక్కడి జ్యోతిని జాతీయ యుద్ధస్మారకం వద్దకు తీసుకుపోయి అక్కడి జ్వాలలో కలిపేశారు. 1971లో పాకిస్థాన్‌తో యుద్ధంలో గెలిచి, బంగ్లాదేశ్ ఆవిర్భావంతో విజయేందిరగా కీర్తినందుకున్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1972 జనవరి 26న వెలిగించిన ఈ జ్యోతిని యాభైయేళ్ళు నిండటానికి ఓ నాలుగురోజుల ముందే మరోచోటకు తరలించడం వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని విపక్షాల ఆరోపణ.


ప్రభుత్వ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్నవారి వాదన కూడా పూర్తిగా కాదనలేనిదే. మొదటి ప్రపంచయుద్ధం సహా వివిధ యుద్ధాల్లో మరణించిన దాదాపు లక్షమంది బ్రిటిష్ ఇండియా సైనికుల స్మారకంగా 1931లో నిర్మితమైన ఇండియా గేట్ మీద బ్రిటిష్ అధికారులు, సైనికులు సహా ఓ పదమూడువేల పేర్లు ఉన్నాయి. స్వాతంత్ర్యానికి ముందు, ఆ తరువాత వివిధ పోరాటాల్లో కన్నుమూసిన సైనికులకు ఇండియాగేట్ సంపూర్ణ ప్రతీక కాబోదు. ఒక్క రెండో ప్రపంచయుద్ధంలోనే బ్రిటిష్ సేనలో భాగంగా వేలాదిమంది భారతీయులు కన్నుమూసిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్యానంతరం ఒక జాతీయ యుద్ధస్మారకాన్ని నిర్మించుకోవాలన్న ఒత్తిడి సైన్యం నుంచి ఉన్నప్పటికీ వివిధ కారణాలవల్ల ఆ ఆలోచన ముందుకు సాగలేదు. అందువల్ల, ఇటీవలి కార్గిల్ వార్ సహా స్వాతంత్ర్యానంతర యుద్ధాల్లో కన్నుమూసిన సైనికులందరినీ స్మరించుకొనే ఏకైక స్థలంగా అమర్ జవాన్ జ్యోతి మారిపోయింది. 2014 ఎన్నికల ప్రచారంలోనే వార్ మెమోరియల్ హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి రాగానే ఆ మాట నిలబెట్టుకోవడం, ఐదేళ్ళ తరువాత నరేంద్రమోదీ ఇండియాగేట్‌కు అరకిలోమీటరు దూరంలో నలభై ఎకరాల సువిశాల స్మారకాన్ని ఆవిష్కరించడం తెలిసిందే. స్వాతంత్ర్యానంతర యుద్ధాల్లో కన్నుమూసిన 26వేల పైచిలుకు సైనికుల పేర్లు హోదాలు గ్రానైట్ ఫలకాలపై చెక్కివున్న ఈ స్థలంలో రాబోయే రోజుల్లో ప్రతీ వీరసైనికుడి పేరూ చేర్చగలిగే అవకాశం కూడా ఉన్నది. ఇక్కడ కూడా ఓ జ్యోతి వెలుగుతూ, ఇదే అధికారిక సైనిక సంస్మరణ కేంద్రంగా మారిపోయింది. అందువల్ల, 1971 యుద్ధానికి మాత్రమే ప్రతీకగా నిలిచిన జ్యోతిని అన్ని యుద్ధాలకూ, అందరి సైనికుల త్యాగాలకు చిహ్నంగా నిర్మించుకున్న స్మారకంలో విలీనం చేస్తే తప్పేమిటన్నది వాదన. ఇండియాగేట్ నీడన ఇంతకాలమూ వెలిగిన జ్యోతి ఇప్పుడు చేరవలసిన చోటుకే చేరిందని అంటున్నారు.


ఇది అమర్ జవాన్ జ్యోతిని ఆర్పివేయడం కాదు, కొంతభాగాన్ని విలీనం చేయడమే అని పాలకులు చెబుతున్నప్పటికీ దీనివెనుక దురుద్దేశాలున్నాయని కాంగ్రెస్ ప్రధానంగా నమ్ముతోంది. ఇందిరమ్మతో ముడిపడిన ఓ బలమైన జ్ఞాపకాన్ని జ్యోతి తరలింపు ద్వారా అంతిమంగా తుడిచేయడం మోదీ బృందం ఉద్దేశమని భావన. బంగ్లా స్వర్ణోత్సవాల సందర్భంగా మోదీ ప్రభుత్వం ఇందిర ఊసెత్తకపోవడం తెలిసిందే. వార్ మెమోరియల్ నిర్మాణ సమయంలో రెండుచోట్లా జ్యోతులు వెలుగుతాయని చెప్పిన ప్రభుత్వం, అమర్ జవాన్ జ్యోతి మాదిరిగా కొత్త స్మారక కేంద్రం ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకోకపోవడంతో అసలుదానిని తుడిపివేసే ప్రయత్నంలో ఉన్నదని విమర్శ. పాకిస్థాన్‌తో చేసిన యుద్ధానికీ, బంగ్లాదేశ్ ఆవిర్భావానికీ, ఆ సందర్భంగా భారతదేశం అంతర్జాతీయంగా వేసిన కీలకమైన అడుగులకూ సాహసోపేతమైన నిర్ణయాలకూ ప్రతీక అమర్ జవాన్ జ్యోతి. యాభైయేళ్ళపాటు వెలిగిన ఓ జ్యోతిని మరోచోటకు తరలిస్తున్నప్పటికీ ఆ జ్యోతి వెలిగిన సందర్భాన్నీ, అందులోని స్ఫూర్తినీ తరలించలేరు. వెలుగుతున్న జ్యోతి అమరత్వానికి మాత్రమే కాక, ఆ వీరుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదని చెప్పడానికి సంకేతం.

Updated Date - 2022-01-25T06:34:58+05:30 IST