సివిల్స్‌లో సత్తాచాటిన బీర్‌పూర్‌ మండల వాసి

ABN , First Publish Date - 2022-05-31T05:34:54+05:30 IST

సివిల్స్‌ ఫలితాల్లో జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన శరత్‌నాయక్‌ సత్తా చాటాడు.

సివిల్స్‌లో సత్తాచాటిన బీర్‌పూర్‌ మండల వాసి
శరత్‌ నాయక్‌

- శరత్‌ నాయక్‌కు 374వ ర్యాంకు

బీర్‌పూర్‌, మే 30: సివిల్స్‌ ఫలితాల్లో జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన శరత్‌నాయక్‌ సత్తా చాటాడు. సోమవారం విడుదలైన ఫలితాల్లో 374వ ర్యాంకు సాధించాడు. శరత్‌ నాయక్‌ తండ్రి భాష్య నాయక్‌ వ్యవసాయం చేస్తుండగా, తల్లి యమున మినీ అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు. భాష్య నాయక్‌ యమున దంపతులకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు కుమారులు, ఒక్క కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు శరత్‌నాయక్‌ ఏడో తరగతి వరకు మంచార్యాల జిల్లా దండెపల్లి మండలంలోని మ్యాదరిపేటలో చదివాడు. ఎనిమిది నుంచి పదోతరగతి వరకు జగిత్యాలలోని శ్రీచైతన్య కాన్సెప్ట్‌ స్కూల్‌లో, ఇంటర్మీడియట్‌ జగిత్యాలలోని శ్రీచైతన్య కళాశాలలో పూర్తి చేశాడు.  కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ వెటర్నరి కళాశాలలో కోర్సు పూర్తి చేసి వెటర్నరిలో గోల్డ్‌మెడల్‌ సాధించాడు. ఇంటి వద్దే ఉంటూ ఇంటర్నెట్‌ సహాయంతో సివిల్‌ కోర్సుకు ప్రిపెయర్‌ అయ్యి మొదటి ప్రయత్నంలోనే 374 సాధించాడు. కష్టపడి చవించామని తమ కష్టానికి ప్రతిఫలం దక్కిందని శరత్‌ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మండల యువకుడు శరత్‌ నాయక్‌ సివిల్స్‌ ఫలితాల్లో సత్తాచాటడం గర్వంగా ఉందని ఎంపీపీ మసర్తి రమేష్‌, జడ్పీటీసీ పాత పద్మ, వైస్‌ ఎంపీపీ లక్ష్మణ్‌ రావ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ ముప్పాల రాంచందర్‌ రావ్‌, చర్లపెల్లి సర్పంచ్‌ అజ్మీర ప్రభాకర్‌, నాయకులు కొల్ముల రమణ, ముక్క శంకర్‌, నారపాక రమేష్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-05-31T05:34:54+05:30 IST