ఉచిత బియ్యం ఉఫ్‌..!

ABN , First Publish Date - 2022-07-02T06:15:00+05:30 IST

గడిచిన రెండేళ్లుగా కరోనా ప్రభావంతో దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా మొదటి, రెండు దశల్లో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది.

ఉచిత బియ్యం ఉఫ్‌..!

మూడు నెలలుగా మంగళం

ఎత్తేసేందుకు జగన ప్రభుత్వం మాస్టర్‌ప్లాన

కేంద్రం నుంచి రాలేదంటూ కాలయాపన


ధర్మవరం

గడిచిన రెండేళ్లుగా కరోనా ప్రభావంతో దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా మొదటి, రెండు దశల్లో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. 2020లో బియ్యం పంపిణీని ప్రారంభించి, మధ్యలో విరామం ఇచ్చి అనంతరం 2021లో కొనసాగించింది. 2022 మార్చితో బియ్యం పంపిణీ ముగిసినప్పటికీ కేంద్రం మరో ఆరునెలలు పొడిగించింది. తెల్ల రేషనకార్డులోని ప్రతి సభ్యుడికి నెలకు 5 కిలోల వంతున ఉచిత బియ్యం అందజేయాలని కేంద్రం నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ పంపిణీ జరగాల్సి ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తన కోటాగా ఇచ్చే స్టోర్టెక్స్‌ బియ్యాన్ని, కేంద్రం ఉచిత కోటా కింద సాధారణ బియ్యాన్ని పంపిణీ చేసింది. ఏప్రిల్‌లో ఉచిత బియ్యం పంపిణీ చేపట్టలేదు. జిల్లాల విభజన నేపథ్యంలో సాధారణ కోటా పంపిణీ ఆలస్యమవడంతో మే నెలలో రెండునెలల కోటా ఒకేసారి ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు జూలై నెల ప్రారంభమైనా ఉచిత బియ్యం పంపిణీపై ప్రభుత్వం నోరు మెదపడంలేదు. పైగా జూన నెలలో అస్సలు ఉచిత కోటానే రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది.  శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా 5.58 లక్షల మంది కార్డుదారులుండగా.. ఇందులో 4.39 లక్షల మంది ప్రతినెలా బియ్యం తీసుకుంటున్నారు. ప్రతినెలా ఉచిత బియ్యం కోటాగా 8,437 మెట్రిక్‌ టన్నులు అందించాల్సి ఉంది. ఉచిత  బియ్యం కోసం కార్డుదారులు రేషన దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కోటా ఎండీయూ వాహనాల ద్వారా అందిస్తూ.. కేంద్రం ఉచిత బియ్యం మాత్రం చౌక ధరల దుకాణాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. దీంతో కార్డుదారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డీలర్లు సతమతమవుతున్నారు.


స్టాక్‌ లేదని.. ఆపై కోత!

ప్రధాన మంత్రి గరీబ్‌ యోజన ద్వారా కేంద్రం అందించే రేషనను మార్చి నెల వరకు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. తర్వాత ఉచిత బియ్యం పంపిణీకి మంగళం పాడేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ప్లానే వేసింది. ఏప్రిల్‌లో సరఫరాతో పాటు బియ్యం నిల్వలు లేవనీ, సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ చెబుతూ వచ్చింది. తర్వాత కేంద్రం నుంచి బియ్యం కోటా తక్కువగా వస్తోందంటూ కాలయాపన చేయడానికి ప్రయత్నించింది. తాము బియ్యం ఇవ్వకపోవడానికి కేంద్ర ప్రభుత్వ అలసత్వం, ఆలస్యమే కారణమంటూ అధికారులు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న రేషనకార్డుదారులందరికీ ఉచిత బియ్యం ఇవ్వకుండా కేవలం 60 శాతం మంది కార్డుదారులకు సరిపడా బియ్యాన్ని మాత్రమే కేంద్రం తన కోటాగా విడుదల చేస్తోందని రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. రెండేళ్లుగా ఇదే కోటా ఇస్తుండగా.. కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేసి, ఇప్పుడు కొత్తగా సాకులు చెప్పడం ఏమిటని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మార్చి వరకు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకొచ్చిందని ఇటు నాయకులు, అటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేవలం కేంద్రం అమలు చేస్తున్న పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని బీజేపీ నాయకుల వాదన. కేంద్రం నుంచి వస్తున్న ఉచిత బియ్యం కార్డుదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.


మూడునెలలుగా ఇవ్వలేదు

కరోనా కాలంలో కేంద్రప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం మూడునెలలుగా ఇవ్వలేదు. జూన వరకు కార్డులో ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం అందిస్తామంది. బియ్యం కోసం మూడునెలలుగా ఎదురుచూస్తున్నాం. ఇంతవరకు ఉచిత బియ్యం గురించి స్టోర్‌ డీలర్లను అడిగితే రాలేదు వస్తే ఇస్తాం అని చెబుతున్నారు.

సరోజమ్మ, మరువపల్లి, పెనుకొండ మండలం


కేంద్రం నుంచి సరఫరా నిలిచిపోయింది

ఉచిత బియ్యం పంపిణీ కేంద్ర పరిధిలో ఉంది. కేంద్రం సరఫరా చేసిన వెంటనే కార్డుదారులకు అందజేస్తాం. గత మూడునెలలుగా బియ్యం సరఫరా నిలిచిపోయింది. వచ్చే అవకాశాలు లేవని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

 వంశీకృష్ణారెడ్డి, డీఎ్‌సఓ

Updated Date - 2022-07-02T06:15:00+05:30 IST