క్యాంపుల్లో ప్రజాప్రతినిధులు

ABN , First Publish Date - 2021-11-27T06:10:36+05:30 IST

జిల్లాలోని ప్రజాప్రతినిధులు క్యాంపు బాట పట్టారు. దీంతో అధికారికంగా నిర్వహించాల్సిన జిల్లా, మండల పరిషత్‌ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్‌లో చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయగా కాంగ్రెస్‌కు చెందిన జడ్పీటీసీ నాగం కుమార్‌ ఒక్కరే హాజరయ్యారు.

క్యాంపుల్లో ప్రజాప్రతినిధులు
క్యాంపులో వేములవాడ నియోజకవర్గ ప్రతినిధులు

-  వాయిదా పడుతున్న సమావేశాలు  

- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌పై ఉత్కంఠ

- జిల్లాలో 203 మంది ఓటర్లు 

- జడ్పీలో పోలింగ్‌ కేంద్రం

 - ఏర్పాట్లు చేసిన అధికారులు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జిల్లాలోని ప్రజాప్రతినిధులు క్యాంపు బాట పట్టారు. దీంతో అధికారికంగా నిర్వహించాల్సిన జిల్లా, మండల పరిషత్‌ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్‌లో చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయగా కాంగ్రెస్‌కు చెందిన జడ్పీటీసీ నాగం కుమార్‌ ఒక్కరే హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మిగతా జడ్పీటీసీలు, ఎంపీపీలు  క్యాంపుల్లో ఉండడంతో  వాయిదా పడింది. దీంతోపాటు గురువారం ఎల్లారెడ్డిపేట మండల పరిషత్‌ సమావేశం ఇదే తరహాలో వాయిదా వేశారు. ఈ నెల చివరి వరకు నిర్వహించాల్సిన సమావేశాలు వాయిదా పడనున్నట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు ఓట్లు వేయడానికి జిల్లా పరిషత్‌ కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు సంబంధించి  అధికారులు సర్వం సిద్ధం చేశారు. 

ప్రాధాన్యత ఓటుతో తికమక

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 201 స్థానిక ప్రజాప్రతినిధులు ఓట్లు ఉండగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్‌, రమేష్‌బాబుకు ఓటు హక్కు ఉంది. దీని ప్రకారం 203 ఓట్లు ఉన్నాయి. ఇందులో 12 జడ్పీటీసీ, 122 ఎంపీటీసీలు, 67 మున్సిపల్‌ కౌన్సిలర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇందులో జడ్పీటీసీల్లో టీఆర్‌ఎస్‌కు 11 మంది, కాంగ్రెస్‌కు ఒకరు, 122 మంది ఎంపీటీసీల్లో టీఆర్‌ఎస్‌కు 85 మంది, కాంగ్రెస్‌కు 17 మంది, బీజేపీకి 13 మంది, స్వతంత్రులుగా 7 గురు ఉన్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో 67 మంది కౌన్సిలర్లు ఉండగా టీఆర్‌ఎస్‌కు 53 మంది, కాంగ్రెస్‌కు ముగ్గురు, బీజేపీకి 10 మంది, స్వతంత్రులుగా ఒకరు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రాధాన్యత క్రమం ఉంటుంది. అభ్యర్థులకు ఒకటి, రెండు, సంఖ్యలు వేయాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధుల్లో కొందరు నిరక్షరాస్యులు, అవగాహన తక్కువగా ఉన్నవాళ్లు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎల్‌.రమణ, భానుప్రసాద్‌ అభ్యర్థులుగా ఉండగా వీరికి కూడా ప్రాధాన్యత క్రమం ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్‌కు 10 మంది  పోటీలో ఉన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఎవరికి ఓటు వేస్తారనే ఆంశంపై ఉత్కంఠత నెలకొంది. అవగాహన కలిగిన ఎమ్మెల్యేలు సైతం ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేసే క్రమంలో తిరస్కరణకు గురైన సంఘటనలు ఉన్నాయి. దీనిని దృస్టిలో పెట్టుకొని జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో తికమక పడితే టీఆర్‌ఎస్‌కు నష్టం కలుగుతుందని భావిస్తున్నారు.

10వ తేదీ వరకు క్యాంపుల్లోనే 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌ డిసెంబరు 10న ఉంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు క్యాంపులకు తరలివెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. వీరిని బెంగుళూరు, గోవా ప్రాంతాలకు తీసుకెళ్లారని చర్చ సాగుతోంది. డిసెంబరు 10వ తేదీ వరకు క్యాంపుల్లోనే ఉంటారని, ఉదయం జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత ఇళ్లకు పంపిస్తారని  తెలుస్తోంది. మరోవైపు ఓటింగ్‌పై శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. 


Updated Date - 2021-11-27T06:10:36+05:30 IST