ఇండియాకు బదులు భారత్... సుప్రీంకోర్టు విచారణ జూన్ 2న...

ABN , First Publish Date - 2020-05-29T23:33:13+05:30 IST

మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా ‘భారత్’ అని మార్చాలని

ఇండియాకు బదులు భారత్... సుప్రీంకోర్టు విచారణ జూన్ 2న...

న్యూఢిల్లీ : మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా ‘భారత్’ అని మార్చాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు జూన్ 2న విచారణ జరుపుతుంది. మన దేశాన్ని ‘భారత్’ అని కానీ, ‘హిందుస్థాన్’ అని కానీ పిలిస్తే, గర్వకారణంగా ఉండటంతోపాటు ఆత్మాభిమానాన్ని నింపుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించి ‘ఇండియా’కు బదులుగా ‘భారత్’ లేదా ‘హిందుస్థాన్’ అని పెట్టాలని ఆదేశించాలని కోరారు.


మన దేశం పేరు, భూభాగం గురించి రాజ్యాంగంలోని అధికరణ 1లో వివరించారు. దీనిని సవరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. మన దేశం పేరును భారత్ లేదా హిందుస్థాన్‌గా మార్చితే, ప్రజలంతా వలస పాలకుల జాడల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని తెలిపారు. మన జాతీయతపట్ల మనం గర్వించే పరిస్థితి వస్తుందని, ముఖ్యంగా భావి తరాలవారు ఆత్మాభిమానంతో, జాతీయాభిమానంతో వ్యవహరించడానికి వీలవుతుందని తెలిపారు. మన దేశానికి స్వాతంత్ర్యం కోసం అహరహం శ్రమించిన మన పూర్వీకుల పోరాటానికి న్యాయం చేసినట్లవుతుందన్నారు. 


ఈ పిటిషన్‌పై విచారణ శుక్రవారం జరగవలసి ఉంది. అయితే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అందుబాటులో లేకపోవడంతో విచారణను జూన్ 2కు వాయిదా వేశారు.




Updated Date - 2020-05-29T23:33:13+05:30 IST