స్వదేశాగమన సమస్యలు

ABN , First Publish Date - 2020-05-06T06:01:43+05:30 IST

కరోనా నేపథ్యంలో, విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే భారీ కార్యక్రమం ఆరంభం కాబోతున్నది. దాదాపు మూడులక్షలమంది కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టుకున్న నేపథ్యంలో...

స్వదేశాగమన సమస్యలు

కరోనా నేపథ్యంలో, విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే భారీ కార్యక్రమం ఆరంభం కాబోతున్నది. దాదాపు మూడులక్షలమంది కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టుకున్న నేపథ్యంలో, దశలవారీగా జల, వాయుమార్గాల్లో వారిని తరలించాలని భారత ప్రభుత్వం సంకల్పించింది. ఎయిర్‌ ఇండియా తొలివిడతలో రేపటినుంచి 13వతేదీ వరకూ 13 దేశాలనుంచి 64 విమానాలతో ఒకేవారంలో దాదాపు పదిహేనువేలమందిని స్వదేశానికి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. గల్ఫ్‌యుద్ధం తరువాత ఎయిర్‌ ఇండియా ఇంతపెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే తొలిసారి అని అంటున్నారు. ఏ మార్గంలో స్వదేశానికి వస్తున్నా, వారందరికీ క్షుణ్ణంగా వైద్యపరీక్షలు చేసిన తరువాతే దేశంలో అడుగుపెట్టనిస్తామని కేంద్రం హామీ ఇస్తున్నది. భారత్‌ వచ్చిన తరువాత వీరందరూ విధిగా పద్నాలుగు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తరువాత వారి ఆరోగ్యస్థితికి అనుగుణంగా నిర్ణయాలు జరుగుతాయి. వారికి అవసరమైన పరీక్షలు, క్వారంటైన్‌ ఏర్పాట్లు చేయాల్సింది ఎలాగూ రాష్ట్రాలే.


కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తామనీ, దగ్గు, జలుబు ఇత్యాదివి ఉన్నట్టయితే ముందుగానే సమాచారం ఇవ్వాలనీ, ప్రయాణంలో సైతం కొన్ని నిబంధనలు తూచ తప్పక పాటించాల్సిందేనని విదేశాంగశాఖ గట్టిగా చెబుతున్నది. కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ మాత్రం ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వూహాన్‌ నుంచి వచ్చిన ఓ వైద్యవిద్యార్థిని కారణంగా దేశంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు చేసుకున్న రాష్ట్రం అది. విదేశాల్లో చిక్కుకున్నవారిని స్వదేశానికి తీసుకురావాలన్న కేంద్రం నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మాత్రం సరైనది కాదని విజయన్‌ అంటున్నారు. పూర్తిస్థాయి కరోనా పరీక్షలతో రోగం లేదని నిర్థారించుకున్నవారిని మాత్రమే ఇలా తేవాల్సింది పోయి, కేవలం థర్మల్‌ స్క్రీనింగ్‌తో విమానాలు ఎక్కించడం ఏమిటని ఆయన అడుగుతున్నారు. ఏ ఒక్కరికి వైరస్‌ ఉన్నా, విమానంలో ఉన్న మిగతావారంతా ప్రమాదంలో పడతారనీ, పైగా, వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న అమెరికా, బ్రిటన్‌ ఇత్యాది దేశాల్లో ఉన్నవారిని తరలిస్తే పెను సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరిస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌లు ఏ స్థితిలో ఉన్నాయో తెలిసిందే. బ్రిటన్‌ మరణాల్లో ఇటలీని మించిపోయింది. విదేశాల్లోని భారతీయులు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడ్డారు. గల్ఫ్‌దేశాల్లోనే పదివేలమందికిపైగా భారతీయులకు కరోనాసోకిందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, వీరందరి రాకతో ఇంతకాలం కష్టపడి అమలుచేసుకున్న కట్టడికి ప్రయోజనం లేకుండా పోతుందన్న అనుమానం కొందరిలో ఉండటం సహజం.


విదేశీవిమానాల రాకపోకలను మార్చిలో హఠాత్తుగా నిలిపివేయడంతో విదేశాల్లో అనేకమంది నిలిచిపోయారు. కరోనా ధాటీకి చాలాదేశాల్లో ఉద్యోగాలు, ఉపాధులు తీవ్రంగా దెబ్బతిన్నందువల్ల తిరిగి వచ్చేయాలనుకుంటున్నవారి సంఖ్య విపరీతంగా ఉంది. మరీ ముఖ్యంగా, గల్ఫ్‌దేశాల్లో కార్మికుల వెతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఉపాధికోల్పోయి వారు కనీసం నెలరోజులనుంచీ నడివీధుల్లో నిలిచిపోయారు. పెద్దదేశాలకు పోయేవారి ప్రయోజనాలు వేరు, పూటగడవని స్థితిలో అన్ని కష్టాలకు ఎదురొడ్డి గల్ఫ్‌కు పోయినవారు వేరు. కూలీలుగా, కార్మికులుగా, ఇంటిపనివారుగా బతుకీడుస్తున్న వీరిని కరోనా రోడ్డున పడేసింది. ప్రపంచమార్కెట్‌లో ముడిచమురు ధరలు తీవ్రంగా పతనం కావడంతో గల్ఫ్‌దేశాల ప్రధాన ఆదాయం బాగా దెబ్బతిన్నది. పనులు లేక కంపెనీలు మూతబడటంతో ఉద్యోగాలు పోయాయి. కార్మికులతో బలవంతంగా ఉద్యోగాలకు రాజీనామాలు చేయించడం, వేతనం లేని సెలవు పేరిట వదిలించుకోవడమే కాక, చివరకు అక్రమవలసదారులన్న పేరిట కూడా వేట జరుగుతోంది. ఉపాధి కల్పించిన దేశమే వారి బాగోగులు చూసుకోవాలన్న అంతర్జాతీయ నియమాలేవీ ఇక్కడ అమలు కావు. మీ వారిని వెంటనే వెనక్కు తీసుకుపోవాలని గల్ఫ్‌దేశాలు ఎంతోకాలంగా మనవెంటబడుతున్నాయి కూడా. గల్ఫ్‌దేశాలకు వలసకార్మికులు ఇలా హఠాత్తుగా బరువైపోయిన ఈ స్థితిలో, వారిని వెట్టిచాకిరీకి కూడా తెగించి వలసపోయేట్టు చేసిన మనమే తిరిగి ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకాలమూ వారు పంపిన విదేశీమారక ద్రవ్యాన్ని చక్కగా అనుభవించిన దేశం, ఇకపై వారికి ఏలోటూ రాకుండా వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలి. వారి సంక్షేమాన్ని చూడటంతో పాటు, రాబోయే రోజుల్లో వారి నైపుణ్యాన్ని వినియోగించుకోగలిగే మార్గాలను కూడా అన్వేషించాలి.

Updated Date - 2020-05-06T06:01:43+05:30 IST