కేజీ రోడ్డుకు మరమ్మతులు

ABN , First Publish Date - 2020-10-24T11:03:18+05:30 IST

ఇటీవల కురిసిన వర్షాలకు కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి చాలా చోట్ల దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి.

కేజీ రోడ్డుకు మరమ్మతులు

ఆధునికీకరణకు రూ.22కోట్లు 


ఆత్మకూరు, అక్టోబరు 23: ఇటీవల కురిసిన వర్షాలకు కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి చాలా చోట్ల దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. నేషనల్‌ హైవే అధికారులు సిద్ధాపురం నుంచి మట్టిని తరలించి చదును చేశారు. కానీ భారీ వర్షాలకు బురదమయమై వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. ఈ సమస్యపై ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి నేషనల్‌ హైవే అధికారులు స్పందించారు. తాత్కాలిక పరిష్కారం కోసం ఎర్రగూడూరు నుంచి బిలుకు రాళ్లను తరలించి చదును చేశారు. సంజీవనగర్‌ తండా, పల్లకట్ట ప్రదేశంలో బిలుకు వేయడం వల్ల వాహన రాకపోకలకు వెసులుబాటు కలిగింది. అనాలోచితంగా మట్టి వేసిన సిబ్బందిపై ఎన్‌హెచ్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


రూ.22 కోట్లతో ఎన్‌హెచ్‌-340సీ కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి ఆధునికీకరణకు పనులను చేపడుతున్నట్లు నేషనల్‌ హైవే జిల్లా ఈఈ ఇందిర పేర్కొన్నారు. ప్రస్తుతం కర్నూలు నుంచి 79 కి.మీ. మేర కేజీ రోడ్డు మరమ్మతు పనులను చేపట్టామని, మిగతా 54 కి.మీ. వరకు పనులు చేయాల్సి ఉందని అన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే ఈ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. 


Updated Date - 2020-10-24T11:03:18+05:30 IST