వామ్మో..ఇవేం రోడ్లు

ABN , First Publish Date - 2020-11-05T09:50:03+05:30 IST

బీటీ లేచిపోయింది.. కంకర తేలింది.. ఎక్కడ చూసినా గుంతలమయం.. వాహనాలు అటుంచితే.. నడవ వీలుకాని వైనం.. ఇది యాచారం మండలంలోని చిన్నతూండ్ల -చౌదర్‌పల్లి, కొలన్‌గూడ - చిన్నతూండ్ల రోడ్ల దుస్థితి. ఇది ఈనాటిది కాదు

వామ్మో..ఇవేం రోడ్లు

యాచారం మండలంలో నడవడానికి వీలులేని రహదారులు

కొలన్‌గూడ - చిన్నతూండ్ల మధ్య   గుంతలమయం

ఏళ్లు గడుస్తున్నా.. మరమ్మతులు కరువు


యాచారం : బీటీ లేచిపోయింది.. కంకర తేలింది.. ఎక్కడ చూసినా గుంతలమయం.. వాహనాలు అటుంచితే.. నడవ వీలుకాని వైనం.. ఇది యాచారం మండలంలోని చిన్నతూండ్ల -చౌదర్‌పల్లి, కొలన్‌గూడ - చిన్నతూండ్ల రోడ్ల దుస్థితి. ఇది ఈనాటిది కాదు. ఐదారేళ్లుగా ఈ రోడ్లపై ప్రయాణికులు పాట్లు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇవే కాదు  మండలలోని మరికొన్ని రోడ్లు ఇలాగే ఉన్నా మరమ్మతులకు నోచడం లేదు. కొత్త రోడ్డు దేవుడెరుగు ఉన్న రోడ్డు మరమ్మతులు చేయించేందుకైనా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు మరింత ధ్వంసమయ్యాయి. పలుచోట్ల బీటీ దెబ్బతిన్నది. వాహనాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నతూండ్ల నుంచి కందుకూరు మండలం కొలన్‌గూడ గ్రామాల మధ్య నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుపై అడుగడుగునా గుంతలు పడి కనీసం పాదచారులు నడవలేని పరిస్థితి నెలకొంది. ఈ రహదారిని బాగుచేయడం కోసం రూ.99లక్షల నిధులు విడుదల చేస్తున్నట్లు, టెండర్లు పిలిచి త్వరలో బాగు చేస్తామని స్థానిక నాయకులు రోడ్డు పరిధిలోని గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చి ఎడాదిన్నర అవుతున్నా రోడ్డు మాత్రం బాగు చేయలేకపోతున్నారనే విమర్శలు  ఉన్నాయి. అసలు టెండర్లు పిలిచారా లేదా అనే అనుమానం కలుగుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.  చిన్నతూండ్ల నుంచి చౌదర్‌పల్లి గ్రామాల మధ్యన నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు ధ్వంసమైంది. రహదారి పాడై నాలుగేళ్లవుతున్నా బాగు చేయించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఈ రహదారిపై మూడు చోట్ల కంకర తేలిపోయింది. చాలాచోట్ల గుంతలు పడి ప్రమాదకరంగా ఉంది. ఇబ్రహీంపట్నం మండల పరిధి పెద్దతూండ్ల నుంచి యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామం మధ్యన రెండు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేయాలని గత ఐదేళ్లుగా ఇరు గ్రామాలవాసులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. పెద్దతూండ్ల నుంచి చౌదర్‌పల్లి గ్రామాల మధ్య బీటీ రోడ్డు వేయించాలని ఇరుగ్రామాల ప్రజలు అధికారులకు విజ్ఞప్తి  చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చౌదర్‌పల్లి నుంచి యాచారం రహదారి పాడై నాలుగేళ్లవుతున్నా బాగు చేయడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. 


సాగర్‌- హైదరాబాద్‌  ప్రధాన రహదారి నుంచి కొత్తపల్లి వరకు పలుచోట్ల మరమ్మతు చేయాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్పారు. కొత్తపల్లి నుంచి కొత్తపల్లితండా వరకు కంకర తేలి అరిగోస తీస్తున్నా పట్టించుకునే వారు లేరని తండావాసులు గగ్గోలు పెడుతున్నారు. నజ్దిక్‌సింగారం నుంచి అయ్యవారిగూడ వరకు పలుచోట్ల కంకరతేలినా బాగుచేసే వారు లేరని స్థానికులు ఆందోళన వెలిబుచ్చారు. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట నుంచి యాచారం వరకు నాలుగులేన్ల రహదారి విస్తరణ పనులు నత్తకే నడక నేర్పుతున్నాయని స్థానికులంటున్నారు. నందివనపర్తి నుంచి మేడిపల్లి వరకు రహదారి విస్తరణ పనులు నిదానంగా సాగుతున్నాయి. నల్లవెల్లి నుంచి మంతన్‌గౌరెల్లి వరకు నాలుగున్నర కిలోమీటర్ల మేర కంకర తేలింది. కనీసం పాదచారులు నడవలేని దుస్థితి నెలకొంది. సాగర్‌ ప్రధాన రహదారి నుంచి కిషన్‌పల్లి వరకు మూడు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేయించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని కిషన్‌పల్లి వాసులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ధ్వంసమైన రహదారులను యుద్ధప్రాతిపదికన బాగు చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - 2020-11-05T09:50:03+05:30 IST