అందోలు ఇక.. తెలంగాణ కోనసీమ

ABN , First Publish Date - 2022-06-21T05:49:58+05:30 IST

అందోలు నియోజకవర్గం త్వరలోనే తెలంగాణ కోనసీమగా మారుతుందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. వట్‌పల్లి మండలం సాయిపేట, అందోలు మండలం తాలెల్మ గ్రామాల మధ్య రూ. 36.74 కోట్లతో నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఎంపీ బీబీపాటిల్‌, అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డితో కలిసి మోటార్ల స్విచ్‌ ఆన్‌ చేశారు.

అందోలు ఇక.. తెలంగాణ కోనసీమ
రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ వద్ద మంజీరా నీటిలో పూలను వెదజల్లుతున్న మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, ఎంపీ బీబీపాటిల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి తదితరులు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే సాగునీరు అధికంగా అందుతున్న నియోజకవర్గం

1.80 లక్షల ఎకరాలకు మంజీరా, కాళేశ్వరం నీరు

ఎమ్మెల్యే చొరవతో మూడేళ్లలో రూ. 100 కోట్ల నిధులు

కేసీఆర్‌ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు

ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు


జోగిపేట, వట్‌పల్లి, జూన్‌ 20: అందోలు నియోజకవర్గం త్వరలోనే తెలంగాణ కోనసీమగా మారుతుందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. వట్‌పల్లి మండలం సాయిపేట, అందోలు మండలం తాలెల్మ గ్రామాల మధ్య రూ. 36.74 కోట్లతో నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఎంపీ బీబీపాటిల్‌, అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డితో కలిసి మోటార్ల స్విచ్‌ ఆన్‌ చేశారు. డిస్ట్రిబ్యూటర్‌ ఛానెల్‌ వద్ద మంజీరా నీటిలో పూలను వెదజల్లారు.  మంజీరా జలాలతో పక్కనే ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం తాల్మెలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఎంతో ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగూరు జలాలను స్థానికంగా సాగు అవసరాలకు కేటాయిస్తున్నారని స్పష్టం ఏశారు. నియోజకవర్గంలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని పేర్కొన్నారు. సింగూరు నుంచి కాల్వల ద్వారా ఇప్పటికే 40వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరో 70 వేల ఎకరాలు, బసవేశ్వర, సంగమేశ్వ లిఫ్ట్‌ పథకం ద్వారా 60 ఎకరాలు, రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతలతో 13 వేల ఎకరాలకు నీరందుతుందని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా సాగునీరందే నియోజకవర్గం అందోలు మాత్రమేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్‌, తన నియోజకవర్గం సిద్దిపేట  రైతులకు కూడా ఈ అదృష్టం దక్కలేదని పేర్కొన్నారు. మూడేళ్లలో కాళేశ్వరం, బసవేశ్వర, సంగమేశ్వ లిఫ్ట్‌ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. చెప్పిన సమయంలోపు పనులను పూర్తిచేయించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఒక్క ఎకరా తగ్గకుండా సాగులోకి వస్తుందని, తెలంగాణ కోనసీమగా అందోలు మారుతుందన్నారు. రైతులు కోటీశ్వరులవుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ చేపట్టిన నీటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో ఎక్కడైనా ఎకరా భూమి రూ. 30 లక్షల కంటే ఎక్కువ ధర పలుకుతున్నదని చెప్పారు. రైతులు పొలాలు అమ్ముకోవద్దని రెండుమూడేళ్లలో భూమి ధర రూ. 60 లక్షలు అవుతుందని చెప్పారు.


సింగూరుపై హక్కే లేదన్నరు

జిల్లాలో మంజీరా నది 51 కిలోమీటర్లు ప్రవహిస్తున్నా గత ప్రభుత్వాలు సింగూరు ప్రాజక్టుపై ఈ ప్రాంతానికి హక్కు లేకుండా చేశాయని మంత్రి విమర్శించారు. హైదరాబాద్‌కు తాగునీటి కోసమే ప్రాజెక్టును వాడుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు గోదావరి నీరు ఇచ్చి, సింగూరు నీటిని అందోలు నియోజవర్గానికే ఇస్తున్నామని చెప్పారు. ఇటీవల వర్షాభావంతో సింగూరు ఎండిపోవడంతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. దీంతో ముఖ్యమంత్రి స్పందించి ప్రాజక్టులో సంవత్సరం పొడవు నీరుండేలా కాళేశ్వరం నీటిని తరలించానికి పూనుకున్నారని చెప్పారు. ఇందుకోసం నిర్మిస్తున్న కాలువ పనులు చకచకా సాగుతున్నాయని వెల్లడించారు. అందోలు నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందని మంత్రి పేర్కొన్నారు. గత మూడేళ్లలోనే నియోజకవర్గ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలియజేశారు. నియోజకవర్గం దశ-దిశను మార్చిన ఎమ్మెల్యేగా క్రాంతికిరణ్‌ నిలిచారని మంత్రి కితాబునిచ్చారు. యాభై ఏళ్లలో నిత్యం ప్రజల్లో ఉంటూ వారి బాగోగులు పట్టించుకున్న ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ఒక్కరేనని అభినందించారు.  ఈ సందర్భంగా ఆయన మాజీ ఎంపీ పట్లోల్ల మాణిక్యరెడ్డిని గుర్తుకు తెచ్చుకున్నారు. తాలెల్మ ఎత్తిపోతల కోసం ఆయన తపించారని స్మరించుకున్నారు.


నాలుగు నెలల్లో జంట లిఫ్టుల టెండర్లు పూర్తి : జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌

రాష్ట్రం ఏర్పడిన తరువాత గత ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపారని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ పేర్కొన్నారు. అందోలు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, సంగారెడ్డి నియోజకవర్గాల వరప్రదాయిని బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల టెండర్లను నాలుగు నెలల్లో పూర్తిచేసి పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని నిరూపించడానికి తాలెల్మ లిఫ్ట్‌ ఒక నిదర్శనమని కొనియాడారు. మంత్రి హరీశ్‌, ఎమ్మెల్యే క్రాతికిరణ్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుల్కల్‌ మండలంలో చేపట్టాల్సిన పనులపై మంత్రి హరీశ్‌కు వినతిపత్రం అందజేశారు. మండలంలో కాల్వ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న గ్రామాలకు నీరందించడానికి ఎత్తిపోతలను నిర్మించాలని కోరారు. బస్వాపూర్‌ గ్రామానికి, వ్యవసాయ భూములకు మధ్యన సింగూరు కాల్వపై బ్రిడ్జి నిర్మించాలని కోరారు. అంతకుముందు 500 బైకులతో అందోలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి 16 కిలోమీటర్ల దూరంలోని సాయిపేట వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శరత్‌, హెచ్‌సీఏ సభ్యుడు భిక్షపతి, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, డిక్కీ చైర్మన్‌ రాహుల్‌ కిరణ్‌, ఎత్తిపోతల చైర్మన్‌ లింగన్న, ఏఎంసీ చైర్మన్‌ రజనీకాంత్‌, జడ్పీటీసీ రమేశ్‌, ఎంపీపీ అద్యక్షులు జోగు బాలయ్య, అపర్ణ, ఉపాధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు వర్కల అశోక్‌, డైరెక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి, నాయకులు రామాగౌడ్‌, నాగభూషణం, నర్సింహారెడ్డి, యాదగిరిరెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, విజయ్‌గుప్త, వీరారెడ్డి, మాణిక్యంగౌడ్‌, మల్లయ్య, కృష్ణాగౌడ్‌, రమేశ్‌గుప్త, వెంకటేశం, సంగారెడ్డి, అనిల్‌  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-21T05:49:58+05:30 IST