అద్దె కట్టండి బాబోయ్‌!

ABN , First Publish Date - 2022-06-11T05:26:11+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న సచివాలయాలు కనీసం అద్దె కూడా చెల్లించలేక పోతున్నాయి.

అద్దె కట్టండి బాబోయ్‌!

దయనీయంగా సచివాలయ వ్యవస్థ

కనీసం అద్దె కూడా చెల్లించలేని వైనం

194 చోట్ల అద్దె భవనాల్లో నిర్వహణ

రూ.82.73 లక్షల బకాయిలు

నిర్వహణకూ నిధులు ఇవ్వని ప్రభుత్వం


నెల్లూరు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న సచివాలయాలు కనీసం అద్దె కూడా చెల్లించలేక పోతున్నాయి. తమకు ఇవ్వాల్సిన అద్దె చెల్లించాలని భవన యజమానులు అధికారులను వేడుకుంటున్నారు. ఆర్భాటంగా ఈ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చినా నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా సచివాలయాల పరిపాలనకు అందించలేదు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పంచాయతీల పరిస్థితి ఈ సచివాలయాల రాకతో మరింత భారంగా మారింది. పోనీ ఈ సచివాలయాలు ప్రజలకు ఏమైనా ఉచిత సేవలందిస్తున్నాయా అంటే అదీ లేదు. వందల సర్వీసులు ఇక్కడ అందిస్తున్నా ప్రతి సేవకు రుసుము వసూలు చేస్తున్నారు.  జిల్లాలో 665 సచివాలయాలు ఉన్నాయి. కొన్ని సచివాలయాలను మునుపటి పంచాయతీ భవనాల్లో ఏర్పాటు చేయగా ఆ భవనాలు లేని చోట అద్దె భవనాల్లో నెలకొల్పారు. ప్రస్తుతం 194 సచివాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి రూ.82.73 లక్షలు  అద్దె బకాయిలు ఉన్నాయి. వీటిని విడుదల చేయాలని జిల్లా అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించారు. కాగా సచివాలయాలకు సొంత భవనాలు నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. కొన్ని సచివాలయాల భవనాలు మాత్రమే పూర్తి కాగా మరికొన్ని నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతుండటంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. 


పంచాయతీలపై భారం

ఒక్కో సచివాలయానికి నెలకు సరాసరి రూ.5 వేల వరకు నిర్వహణ ఖర్చులవుతున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. అందులో ఇంటర్నెట్‌ బ్రాండ్‌బ్యాండ్‌ బిల్లు, స్టేషనరీ, మంచినీరు వంటి ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. గతంలో కన్నా ఇప్పుడు విద్యుత్‌ బిల్లు ఎక్కువగా వస్తోంది. చిన్న పంచాయతీలకు జనరల్‌ ఫండ్‌ ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి పంచాయతీలు ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడుతుంటాయి. అయితే ఇటీవల విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్‌ బకాయిల పేరుతో ప్రభుత్వం జమ చేసుకుంది. దీంతో  సచివాలయాల నిర్వహణ కష్టంగా మారింది. అంతంత మాత్రంగా ఉండే జనరల్‌ ఫండ్‌ నిధులు ఈ సచివాలయ నిర్వహణకే సరిపోతున్నాయని పలువురు పంచాయతీ కార్యదర్శులు చెబుతుండటం గమనార్హం. దీంతో గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు నిధుల్లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. సచివాలయాల్లో సేవలకు ప్రజల నుంచి వసూలు చేస్తున్న రుసుమును కూడా ప్రభుత్వం తిరిగి సచివాలయాలకు ఇవ్వడం లేదు. అందులో ఎంతో కొంత ఇచ్చినా నిర్వహణ భారం తగ్గుతుందని సిబ్బంది అంటున్నారు. 


 






Updated Date - 2022-06-11T05:26:11+05:30 IST