శస్త్రచికిత్స ద్వారా ఎముకను తొలగించిన వైద్యులు
మదనపల్లె క్రైం, నవంబరు 30: గొంతులో ఇరుక్కుపోయిన ఎముకను మంగళవారం మదనపల్లె జిల్లా ఆస్పత్రి ఈఎన్‌టీ వైద్యులు తొలగించారు. సోమల మండలం రంగసానిపల్లెకు చెందిన నరసింహులు మంగళవారం ఇంట్లో వండిన చికెన్ తింటూ పొరపాటున ఓ ఎముక మింగేశాడు. అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి ఆడకపోవడంతో ఇబ్బంది పడ్డాడు. ఈక్రమంలో కుటుంబీకులు 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి ఈఎన్‌టీ వైద్యులు పాల్‌రవికుమార్, సంపూర్ణమ్మ బాధితుడిని పరీక్షించి ఆధునిక పరికరాల ద్వారా శస్త్రచికిత్స చేసి ఎముకను తొలగించారు. దీంతో ప్రమాదం తప్పింది.