రేషన్‌కు.. కోత

ABN , First Publish Date - 2021-10-01T05:13:45+05:30 IST

రేషన్‌ కార్డులపై కోత పడింది. అనర్హుల కార్డులను తొలగించేందుకు ప్రభుత్యం చర్యలు చేపట్టింది. జిల్లాలో మొత్తం 8,22,624 తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుని.. అనర్హుల కార్డుల ఏరివేతకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, కారు కలిగి ఉన్నవారు, నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత్‌ వినియోగం, మునిసిపాలిటీల్లో వెయ్యి అడుగుల్లో ఇల్లు, పదెకరాలకు పైగా పొలం ఉన్న వారి కార్డులను రద్దు చేశారు. జిల్లావ్యాప్తంగా 31వేల కార్డులను తొలగించారు.

రేషన్‌కు.. కోత

- జిల్లాలో 31వేల తెల్లరేషన్‌ కార్డుల తొలగింపు

- ఆరు అంశాల ఆధారంగా ఏరివేత

- ఆందోళన చెందుతున్న బాధితులు  

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

రేషన్‌ కార్డులపై కోత పడింది. అనర్హుల కార్డులను తొలగించేందుకు ప్రభుత్యం చర్యలు చేపట్టింది. జిల్లాలో మొత్తం 8,22,624 తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుని.. అనర్హుల కార్డుల ఏరివేతకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, కారు కలిగి ఉన్నవారు, నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత్‌ వినియోగం, మునిసిపాలిటీల్లో వెయ్యి అడుగుల్లో ఇల్లు, పదెకరాలకు పైగా పొలం ఉన్న వారి కార్డులను రద్దు చేశారు. ఇక కేంద్ర సర్వేలో కొన్ని కుటుంబాల్లో ఉన్నవారికంటే ఎక్కువ మంది పేర్లు కార్డుల్లో ఉండటం, అందరివీ ఆధార్‌ నంబర్లు లేకపోవడం వంటివి గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 31వేల కార్డులను తొలగించారు. ఇందులో సచివాలయ ఉద్యోగులే 15వేల మంది ఉన్నారు. తొలగించిన కార్డుదారులకు ఈ నెల నుంచి రేషన్‌ సరుకులు నిలిపివేయనున్నారు. ఇప్పటికే కొంతమందికి సామాజిక పింఛన్లు తొలగించగా.. తాజాగా రేషన్‌ కార్డులపై కూడా కోత విధించడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. 


పోర్టబులిటీ అమలైనా.. 

తెల్లరేషన్‌ కార్డులో రాష్ట్ర కార్డు, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డు రెండు రకాలు ఉన్నాయి. రాష్ట్ర కార్డు కలిగినవారు పోర్టబులిటీ విధానం ద్వారా 13 జిల్లాల్లో ఎక్కడైనా నిత్యావసర సరుకులు తీసుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులు ఇతర రాష్ట్రాల్లో కూడా సరుకులు తీసుకోవచ్చు. కార్డులో ఉన్న సభ్యుల్లో ఒకరు వేలిముద్ర వేసినా.. సరుకులు పంపిణీ చేస్తారు. పోర్టబులిటీ విధానం అమలు చేస్తున్నా.. జిల్లాలో ప్రతినెలా 80 వేల నుంచి లక్ష కార్డుదారులు నిత్యావసర సరుకులు తీసుకోవడం లేదు. దీనిని గుర్తించిన పౌరసరఫరాల శాఖ.. రేషన్‌ తీసుకోకపోవడానికి గల కారణాలను వలంటీర్ల ద్వారా సేకరించింది. వాహనాలు వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకునేందుకు కొందరు మొగ్గు చూపడం లేదు. మరికొందరు ఇతర ప్రాంతాల్లో ఉండడం, తదితర కారణాలతో సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు. ఈ నేపథ్యంలో అటువంటి వారికి తాత్కాలికంగా రేషన్‌ నిలిపి.. అర్హతను నిరూపించుకున్న తర్వాత పునరుద్ధరించాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కార్డుతో సంక్షేమ పథకాలు ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో కార్డు రద్దయితే.. తమకు పథకాలు కూడా నిలిచిపోతాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హుల కార్డులు రద్దయితే.. ధ్రువపత్రాలు సమర్పించి పునరుద్ధరించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 


ఆధార్‌ నెంబర్‌ నమోదైతేనే.. : 

జిల్లావ్యాప్తంగా 31వేల మంది రేషన్‌ కార్డులు ఈ నెల నుంచి రద్దయ్యాయి. బోగస్‌ కార్డులపై ఇప్పటికే పరిశీలన పూర్తయింది. అర్హులవి ఎవరివైనా నిలిచిపోతే.. ధ్రువపత్రాలు సమర్పించి పునరుద్ధరించుకోవచ్చు. కార్డుల్లో ఆధార్‌ నెంబర్లు ఉన్నవారికి మాత్రమే రేషన్‌ అందుతుంది. కార్డుల్లో ఆధార్‌ నమోదు కాని వారంతా ఈ నెలాఖరులోగా నమోదు చేసుకోవాలి.

వెంకటరమణ, డీఎస్‌ఓ 

 ......................................


300 క్వింటాళ్లు రేషన్‌ బియ్యం పట్టివేత

హిరమండలం, సెప్టెంబరు 30 : పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం నల్లబజారుకు తరలిస్తున్నారు. విజిలెన్స్‌ అధికారులు తరుచూ దాడులు నిర్వహిస్తున్నా.. అక్కమార్కుల్లో మార్పు రావడంలేదు. బుధవారం అర్ధరాత్రి హిరమండలం బ్యారేజీ సెంటర్‌ సమీపంలో లారీతో అక్రమంగా తరలిస్తున్న 600 బస్తాల (300 క్వింటాళ్లు) రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ సనపల కిరణ్‌కుమార్‌, ఎస్‌ఐలు అశోక్‌, రామారావు, సిబ్బందితో కలిసి తనిఖీ చేసి.. వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆదేశాల మేరకు గస్తీ నిర్వహించామని తెలిపారు. ఆంధ్రా నుంచి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని.. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అప్పగించామన్నారు. అక్కడి నుంచి లారీతో బియ్యాన్ని సరుబుజ్జిలి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించామని తెలిపారు.  డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామని చెప్పారు. ఈ బియ్యం ఎల్‌ఎన్‌పేట మండలంలో ఒక మిల్లుకు చెందినవిగా గుర్తించామని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.    

Updated Date - 2021-10-01T05:13:45+05:30 IST