పంచాయతీలకు ఊరట

ABN , First Publish Date - 2020-07-12T09:46:29+05:30 IST

ఆర్ధికలేమితో నీరసించి పోతున్న పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడంతో ఊరట లభించింది.

పంచాయతీలకు ఊరట

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : ఆర్ధికలేమితో నీరసించి పోతున్న పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడంతో ఊరట లభించింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి మొదటివిడతగా జిల్లాకు రూ.35.61 కోట్ల నిధులను విడుదల చేసింది. పాలకవర్గాలు లేకపోవటంతో ఈ నిధులు నిలిచిపోతాయనే ప్రచారం జరిగింది. వర్షాకాలం, కరోనా విజృంభణ రోజుల్లో ఈ నిధులు అక్కరకు వచ్చే అవకాశం ఉంది. వీటిలో 15శాతం మండల పరిషత్‌లకు, మరో 15శాతం జిల్లా పరిషత్‌కు కేటాయించాల్సి ఉందని డీపీవో పి. సాయిబాబు తెలిపారు. 


జిల్లాలో 970 పంచాయతీలు ఉన్నాయి. మరో 10 తండాలను పంచాయతీలుగా గుర్తించగా వీటి సంఖ్య 980కు చేరింది. 2018 ఆగస్టులో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం పూర్తయింది. అప్పటినుంచి ప్రత్యేక అధికారుల పాలనలోనే నడుస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఆదాయ వనరులున్న పంచాయతీల్లో ప్రత్యేకాఽధికారులు తమ చిత్తానుసారం నిధులు మింగేశారనే ఆరోపణలున్నా యి. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ, రక్షిత తాగునీటి వసతి,  పారిశుధ్య నిర్వహణ వంటి పనులను పంచాయతీ కార్యదర్శులు  చేస్తూ వస్తున్నారు. అధిక పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి మరీ పనులు చేయించారు. 


జిల్లాలో 39 రక్షిత తాగునీటి పథకాలు ఉన్నాయి. వీటిద్వారా 843కు పైగా ఆవాసాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వీటి నిర్వహణకు ఏటా రూ.25కోట్ల మేర ఖర్చవుతోంది. అధిక పంచాయతీల్లో నిధుల కొరతతో బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కేంద్రం నిధులు విడుదల చేయడంతో తాగునీటి పథకాలకు కొంత ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యానికి కనీస చర్యలు చేపట్టేందుకు ఈ నిధులు కొంతమేర ఉపయోగపడతాయని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. కేంద్రప్రభుత్వం పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిందని మార్గదర్శకాలను పరిశీలన చేసి పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు సర్దుబాటు చేయనున్నట్లు డీపీవో పి సాయిబాబు తెలిపారు. 

Updated Date - 2020-07-12T09:46:29+05:30 IST