Delhi Riots: ముగ్గురు ఉద్యమకారుల విడుదలకు కోర్టు ఆదేశం
ABN , First Publish Date - 2021-06-17T21:28:51+05:30 IST
మంగళవారం బెయిల్ మంజూరు సమయంలో ఢిల్లీ హైకోర్టు స్పందిస్తూ శాంతియుతంగా, నిరాయుధంగా సమావేశమై నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని.. అది చట్టవిరుద్ధం కాదని.. ఉగ్రవాద చర్యగా పరిగణించరాదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు సామాజిక ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి వారికి మంగళవారమే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే చిరునామాల ధృవీకరణ, విధానపరమైన అడ్డంకుల కారణంగా వారు ఇంకా విడుదల కాలేదు. ఈ నేపధ్యంలో స్పందించిన కోర్టు.. ముగ్గరు ఉద్యమకారుల్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ అల్లర్ల అనంతరం 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ, యూఏపీఏఈ, ఆయుధాల చట్టాలు, ప్రజల ఆస్తులకు నష్టాన్ని నివారించే చట్టం కింద పలు కేసులు నమోదుచేశారు. నటాషా నర్వాల్, దేవంగన కలిత, ఆసిఫ్ ఇక్బాల్ తన్హాలకు తాజాగా బెయిల్ లభించింది.
మంగళవారం బెయిల్ మంజూరు సమయంలో ఢిల్లీ హైకోర్టు స్పందిస్తూ శాంతియుతంగా, నిరాయుధంగా సమావేశమై నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని.. అది చట్టవిరుద్ధం కాదని.. ఉగ్రవాద చర్యగా పరిగణించరాదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ప్రభుత్వ/పార్లమెంటరీ చర్యలపై భారీ వ్యతిరేకత నెలకొన్నప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, రాస్తారోకోలు నిర్వహించడం అసాధారణమేమీ కాదని తేల్చిచెప్పింది. ఒకవేళ వీటివల్ల శాంతియుత ఆందోళనలు గాడితప్పినా.. సదరు చర్యలను యూఏపీఏ కింద ఉగ్రవాద చర్యలుగా, కుట్రగా భావించరాదని పేర్కొంది. ఈ సందర్భంగా 113, 83, 72 పేజీలతో కూడిన మూడు వేర్వేరు తీర్పులను వెలువరించింది. మన దేశ పునాదులు ఎంతో దృఢమైనవని.. ఢిల్లీలో ఓ వర్సిటీ విద్యార్థులు కొందరు చేసే నిరసనలతో అవి కదలిపోవని తెలిపింది.