శంబర జాతరకు పటిష్ట బందోబస్తు

ABN , First Publish Date - 2022-01-20T04:52:18+05:30 IST

ఈ నెల 24 నుంచి జరిగే శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఓఎస్‌డీ సూర్యచంద్రరావు చెప్పారు. జాతర ఏర్పాట్లను బుధవారం పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు.

శంబర జాతరకు పటిష్ట బందోబస్తు
సిరిమాను తిరిగే ప్రదేశాన్ని పరిశీలిస్తున్న ఓఎస్‌డీ సూర్యచంద్రరావు

కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

ఓఎస్‌డీ సూర్యచంద్రరావు

మక్కువ/ సాలూరు, జనవరి 19 : ఈ నెల 24 నుంచి జరిగే శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఓఎస్‌డీ సూర్యచంద్రరావు చెప్పారు. జాతర ఏర్పాట్లను బుధవారం పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. సొంత వాహనాలకే అనుమతి ఇస్తున్నామని, బస్సులు, ఆటోలకు అనుమతి లేదన్నారు. జాతరకు 600 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామన్నారు. ఐదుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 58 మంది ఎస్‌ఐలు, 110 మంది ఆర్‌ఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏపీఎస్పీ సిబ్బంది విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు. శంబర గ్రామానికి సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం నుంచి నిత్యం తిరిగే బస్సులకు మాత్రం అనుమతిస్తామన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ కె.సీతారాం, ఈవో బీఎల్‌ నగేష్‌, ట్రస్ట్‌ బోర్డు చైర్మన పూడి దాలినాయుడు పాల్గొన్నారు.

పండుగకు తొందర పడకండి: సీఐ

శంబర పొలమాంబ పండుగ తొమ్మిది వారాల పాటు జరుగుతుందని, భక్తులు ఒకేసారి పెద్ద సంఖ్యలో రావాల్సిన అవసరం లేదని సాలూరు సీఐ అప్పలనాయుడు చెప్పారు. సాలూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, మాస్క్‌ ధరించి రావాలని కోరారు. పండుగలో ఇబ్బందులకు గురిచేసే అకతాయిలను పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్‌ఐ ఫకృద్దిన్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-20T04:52:18+05:30 IST