మహనీయుల స్ఫూర్తితో పునరంకితం

ABN , First Publish Date - 2022-08-16T05:47:31+05:30 IST

ఎంతోమంది మహానీయులు దేశ స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసి తమ ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి మహనీయుల ఆశయ సాధన కోసం దేశ ప్రగతికి మనమంతా పునరంకితమవుదామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

మహనీయుల స్ఫూర్తితో పునరంకితం
జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్‌ నందలాల్‌ పవర్‌ తదితరులు

కులమతాలకు అతీతంగా పని చేద్దాం

వ్యవసాయ రంగానికి పెద్దపీట

పేద దళితుల ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు దళితబంధు

పట్టణాలు వేగంగా అభివృద్ది

స్వాతంత్య్ర వేడుకల్లో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌, ఆగస్టు 15: ఎంతోమంది మహానీయులు దేశ స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసి తమ ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి మహనీయుల ఆశయ సాధన కోసం దేశ ప్రగతికి మనమంతా పునరంకితమవుదామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కులమతాలకు అతీతంగా మహబూబ్‌నగర్‌ను మహానగరంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు సోమవారం మహబూబ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి.  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, అడిషనల్‌  కలెక్టర్లు తేజస్‌ నందలాల్‌ పవార్‌, సీతారామారావులతో కలిసి మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు. హైదరాబాద్‌ తరువాత మహబూబ్‌నగర్‌ అభివృద్ధిలో ముందుండేలా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నపుడే పరిశ్రమలు వస్తాయని, ఉపాధి లభిస్తుందని చెప్పారు. కులం, మత జాఢ్యం రూపుమాయాలని, స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలు నెరవేరేలా పనిచేయాలని అన్నారు. భారతీయులం అంతా ప్రతినబూని, దేశ సమగ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇక్కడ చదువుకుని ఎక్కడో ఉద్యోగాలు చేయడం కాదని, ఇక్కడ పుట్టిన వాళ్లు ఇక్కడే ఉపాధి చేసుకోవాలని, వ్యవసాయం చేసుకునేలా వనరులు కల్పించాలని పేర్కొన్నారు.


3.49 లక్షల ఎకరాల్లో పంటలు

జిల్లాలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడకముందు జిల్లాలో 2.18 లక్షల ఎకరాల్లో సాగవగా, ఇప్పుడు 3.49 లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నా రన్నారు. జిల్లాలో చేప డుతున్న పాలమూరు -రంగారెడ్డి పథ కంలో భాగంగా కర్వెన, ఉదం డపూర్‌ రిజర్వాయర్‌లు పూర్త యితే ఈ ప్రాంతం సస్యశ్యా మలం అవుతుం దన్నారు.


ధరణితో అక్రమాలకు అడ్డుకట్ట

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఇదివరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే జరిగేవని, ధరణి పోర్టల్‌ తెచ్చి వ్యవసాయ భూములను తహసీల్దార్‌ కార్యాలయంలోనే రిజిస్ర్టేషన్‌ చేయిస్తున్నామన్నారు. దాంతో అక్రమాలకు అడ్డుకట్ట పడిందన్నారు. రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే పాస్‌ బుక్కులు అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ధరణిలో 55,943 రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేశారన్నారు. 


దళితబంధు అందరికీ ఇస్తాం

దళితబంధు పథకం ద్వారా అర్హులైన ప్రతీ పేద దళితులకు రూ.10 లక్షలు ఇస్తామని మంత్రి అన్నారు. ఇప్పటివరకు 315 మంది లబ్ధిదారులకు దుస్తులు, ఎలక్ర్టికల్‌, సెంట్రింగ్‌, పాడి పశువులు, కోళ్లపెంపకం, ఫొటో స్టూడియో, సిమెంట్‌, ఇటుకల తయారీ వంటి వ్యాపారాలు చేసుకు నేందుకు రూ.31.81 కోట్లు ఖర్చు చేశామన్నారు.


ఆసరాతో చేయూత

తెలంగాణకు ముందు జిల్లాలో 79,093 పింఛన్లకు రూ.100.15 కోట్లు పంపిణీ చేయగా, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎనిమిదేళ్లలో 86,750 మందికి రూ.1246.23 కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 207 క్రీడా మైదానాలు మంజూరుకాగా, 110 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ప్రారంభించామన్నారు. గిరిజన రైతుల భూములను అభివృద్ధి చేసేందుకు గిరి వికాసం కార్యక్రమం కింద 207 బోరు బావులు మంజూరు కాగా, 171 బోరుబావుల పనులను పూర్తి చేశామన్నారు. 


విద్య, వైద్య రంగంలో ఎనలేని ప్రగతి

వైద్య పరంగా ఎన్నో కార్యక్రమాలు చేశామని, అత్యాధునిక హంగులతో ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్‌కు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలతో ప్రభుత్వ ఆస్ప్రతులలో కాన్పుల శాతం 29 నుంచి 65 శాతానికి పెరిగిందన్నారు. జిల్లాలోని 129 ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానాలుగా అప్‌గ్రేడ్‌ చేశామన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో గురుకులాలు, మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా జిల్లాలో 291 పాఠశాలలను ఎంపిక చేసి, రూ.148 కోట్లు నిధులతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు. 218 పాఠశాలల్లో పనులు ప్రారంభించామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో మొదటగా పాలమూరులో రూ.150 కోట్లతో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోనే రూ.3.8 కోట్ల బడ్జెట్‌తో మోడల్‌ రూరల్‌ హెల్త్‌ రీసెర్చ్‌ యూనిట్‌ మంజూరు అయిన ఏకైక కళాశాల ఇదని తెలిపారు. 


మునిసిపాలిటీల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు

జిల్లాలోని మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూర్‌ మునిసిపాలిటీలలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ముడాను ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా మహబూబ్‌నగర్‌ మారుతుందన్నారు. కూడళ్ల అభివృద్ధి, పార్క్‌లు, క్రీడా ప్రాంగణాలు, విద్యాలయాలు, నెక్లెస్‌రోడ్‌, ఐలాండ్‌, సస్పెన్షన్‌ బ్రిడ్జీ, మినీ శిల్పారామం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతాన్ని హైదరాబాద్‌కు ధీటుగా తీర్చిదిద్దేందుకు తమతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఏ.రాములు, ఆర్డీవో అనిల్‌, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ వెంకట్రావు కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

వేడుకల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరిం చాయి. దేశభక్తి గీతాలకు ప్రభుత్వ, గురుకులాలు, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు నృత్యాలు చేశారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు వీక్షించారు.

















Updated Date - 2022-08-16T05:47:31+05:30 IST