క్రమబద్దీకరణకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-05-25T05:54:34+05:30 IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణకు సమయం ఆసన్నమైంది. గత మార్చి నెలలో రెండో దశ కు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. 2014 సంవత్సరానికి ముందు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారికి రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.

క్రమబద్దీకరణకు గ్రీన్‌సిగ్నల్‌
సిద్దిపేట పట్టణంలో 125 గజాల లోపు ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గృహాలు

తొలి విడతలో 125 గజాల లోపు స్థలాలపై నిర్ణయం

నేటి నుంచి జిల్లాస్థాయి అధికారుల బృందాల క్షేత్రస్థాయి సర్వే


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 24: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణకు సమయం ఆసన్నమైంది. గత మార్చి నెలలో రెండో దశ కు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. 2014 సంవత్సరానికి ముందు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారికి రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. సుమారు రెండు నెలల అనంతరం ఈ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇలాంటి ఇళ్లను క్రమబద్దీకరించడం కోసం 2016లో ప్రభుత్వం జీవో 58, జీవో 59 విడుదల చేసింది. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే ఇలాంటి స్థలాలను రెగ్యులర్‌ చేస్తామని ప్రకటించింది. చెప్పినట్లుగానే దరఖాస్తులు స్వీకరించి చాలా ఇళ్లను రెగ్యులరైజ్‌ చేశారు. ఇంకా 20 శాతం స్థలాలను క్రమబద్దీకరించాల్సి ఉన్నది. మిగిలిన స్థలాల క్రమబద్దీకరణ కోసం మార్చి 31 వరకు మరోసారి మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈసారి 4,594 దరఖాస్తులు వచ్చాయి.


తొలుత 426 దరఖాస్తుల పరిశీలన

జీవో 58 ప్రకారం 125 గజాల లోపు స్థలంలో ఇల్లు నిర్మించుకున్నవారికి ఉచితంగానే క్రమబద్దీకరించి, ప్రభుత్వం తరఫున రిజిస్ర్టేషన్‌ చేయనున్నారు. ఇందుకోసం 426 దరఖాస్తులు వచ్చాయి. మండలాలవారీగా అక్కన్నపేట- 3, బెజ్జంకి- 4, చేర్యాల- 1, చిన్నకోడూరు- 2, దుబ్బాక- 23, గజ్వేల్‌- 24, హుస్నాబాద్‌- 77, కోహెడ- 12, కొమురవెల్లి- 8, కొండపాక- 42, మర్కూక్‌- 1, మిరుదొడ్డి- 23, ములుగు- 37, నంగునూరు- 2, నారాయణరావుపేట- 1, సిద్దిపేటరూరల్‌- 1, సిద్దిపేట అర్బన్‌- 144, తొగుట- 4, వర్గల్‌- 17 దరఖాస్తులు వచ్చాయి. 


పది బృందాల ఏర్పాటు

తొలివిడతలో జీవో 58 ప్రకారం వచ్చిన 426 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి పది బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతీ బృందం ఒక జిల్లాస్థాయి అధికారి నేతృత్వం పనిచేస్తుంది. ఆయా ప్రాంతాల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, రెవెన్యూ సిబ్బంది సహాయకులుగా ఉంటారు. దరఖాస్తు చేసుకున్న స్థలాన్ని సందర్శించి పూర్వాపరాలు పరిశీలిస్తారు. స్థలం కొలతలు, ఇంటి నిర్మాణం, విద్యుత్‌ మీటరు, స్థానికతను సూచించే ధ్రువీకరణ పత్రాలపై విచారణ జరుపుతారు. 2014కు సంబంధించిన ఇంటి పన్ను, విద్యుత్‌ బిల్లులు పరిశీలిస్తారు. ఈ విషయంలో వీరికి శిక్షణ కూడా ఇచ్చారు. ఈ శిక్షణ ఆధారంగా నేటి నుంచి సర్వే చేపట్టనున్నారు. 


జీవో 59 దరఖాస్తులకు త్వరలోనే మోక్షం

తొలివిడత దరఖాస్తులను పరిశీలన ప్రక్రియ పూర్తికాగానే 59 జీవోకు సంబంధించిన 4,168 దరఖాస్తులను విచారించనున్నారు. ఇందులో 2వేల గజాల వరకు స్థలాలను క్రమబద్దీకరించే అవకాశం ఉంది. 500 గజాల వరకు స్థలాలను రిజిస్ర్టేషన్‌ చేసే అధికారం తహసీల్దార్‌కు ఉంటుంది. అంతకంటే పైబడిన స్థలాల రిజిస్ట్రేషన్‌ అధికారం కలెక్టర్‌కు కల్పించారు. జీవో 59 ప్రకారం వచ్చిన 4,168 దరఖాస్తుల్లో 3,324 దరఖాస్తులు సిద్దిపేట అర్బన్‌ మండలానికి సంబంధించినవే కావడం గమనార్హం. జీవో 58 దరఖాస్తులతో పోల్చితే జీవో 59 దరఖాస్తుల సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. ఇందులో కొన్ని వివాదాస్పద దరఖాస్తులు కూడా ఉండే అవకాశాలున్నాయి. విచారణలు పూర్తయినా గతంలో చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచారు. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేశారు.

Updated Date - 2022-05-25T05:54:34+05:30 IST