Abn logo
Aug 11 2020 @ 04:29AM

రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపు

ఈసారి పట్టణ ప్రాంతాల్లోనే..

కరోనా వేళ పెంచడం తగదు

అన్నివర్గాల నుంచి అభ్యంతరం

కార్యాలయాల్లో సర్వర్‌ మొరాయింపు


(ఇచ్ఛాపురం): కరోనా కష్టాలు వెంటాడుతున్న వేళ ప్రజలపై రిజిస్ట్రేషన్ల రూపంలోనూ భారం పడుతోంది. రిజిస్ట్రేషన్‌ చార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది. కానీ జిల్లావ్యాప్తంగా 14 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సోమవారం సర్వర్‌ పనిచేయకపోవడంతో మంగళవారం నుంచి కొత్త చార్జీలు వసూలు చేయనున్నారు. అసలే  కరోనా కాలం... అందులోనూ బహిరంగ మార్కెట్‌లో గత ఏడాదికాలంగా ధరలు పెరగని నేపథ్యంలో రిజిస్ర్టేషన్‌ చార్జీల పెంపు సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనికితోడు పెంపులో కూడా వ్యత్యాసం కనబడుతోంది. ఒకచోట 20, మరోచోట 30, ఇంకొన్నిచోట్ల ఏకంగా 50 శాతం పెంచారు. ఈసారి మాత్రం కేవలం పట్టణ ప్రాంతాలకే పెంపు పరిమితం చేసినట్టు తెలుస్తోంది. పట్టణాల్లో కమర్షియల్‌, శివారు ప్రాంతాల్లో 20 నుంచి 30 శాతం పెంచినట్టు సమాచారం. 


ఆదాయం సమకూర్చుకునేందుకే..

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులను సమకూర్చుకోవడంలో భాగంగానే రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపు నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రిజిస్ర్టేషన్‌ చార్జీలను గ్రామాల్లో రెండేళ్లకు ఒకసారి, పట్టణాల్లో ఏటా ఒకసారి సవరిస్తారు. బహిరంగ మార్కెట్‌లో పెరిగిన ధరలను బట్టి వీటిని పెంచుతారు. గత ప్రభుత్వం 2018-19లో రిజిస్ర్టేషన్‌ విలువలను పెంచలేదు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాదిలో రాష్ట్రంలో ఎక్కడా భూములు, స్థలాలు, అపార్ట్‌మెంట్ల విలువలు పెరిగింది లేదనేది బహిరంగ రహస్యం. వైసీపీ పాలనలో తొలి 10 నెలల్లో ఒడిదుడుకులు, రాజధాని మార్పు, ఇసుక కొరత, ఇతరత్రా ఇబ్బందులు, అనంతరం కరోనా ప్రభావంతో ధరల పెరుగుదల లేదు. ఒకటి, రెండు చోట్ల మినహా జిల్లా అంతటా ఇదే పరిస్థితి. అంటే వాస్తవ విలువలు ఏమాత్రమూ పెరగకపోయినా రిజిస్ర్టేషన్‌ ధరలను మాత్రం పెంచాలని నిర్ణయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.  


ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ పూర్తి

భూముల విలువ పెంపునకు సంబంధించి ఇప్పటికే అన్ని కార్యాలయాలకు స్పష్టమైన ఆదేశాలొచ్చాయి. అధికారులు ఆన్‌లైన్‌లో నమోదును సైతం పూర్తిచేశారు. ఆదివారం రాత్రికే ప్రక్రియ పూర్తయ్యింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పతనమైంది. భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితులో ఛార్జీల పెంపు సహేతుకం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై అన్నివర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ఆగస్టు 1 నుంచే ఛార్జీల పెంపునకు ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కొన్ని కారణాలతో పదిరోజుల పాటు ఆలస్యమైంది. జిల్లాలో 14 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో మంగళవారం నుంచి ఛార్జీలు పెరగనున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.  

Advertisement
Advertisement
Advertisement