తగ్గిన కాలుష్యం

ABN , First Publish Date - 2020-04-02T11:39:06+05:30 IST

వాయు, ధ్వని కాలుష్యాల నుంచి కొద్ది రోజులుగా పశ్చిమ వాసులకు సాంత్వన లభిస్తోంది.

తగ్గిన కాలుష్యం

కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్‌

90 శాతానికి పైగా నిలిచిన వాహనాలు

బస్సులు, ప్రైవేటు బస్సులు నిలుపుదల

ఆశించిన స్థాయిలో తగ్గని ఘన, ద్రవ కాలుష్యం 


ఏలూరు, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): వాయు, ధ్వని కాలుష్యాల నుంచి కొద్ది రోజులుగా పశ్చిమ వాసులకు సాంత్వన లభిస్తోంది. వాతావరణంలో స్వచ్ఛమైన గాలి లభిస్తుండటంతో మెరుగైన ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్‌ ప్రభలుతున్న నేపథ్యంలో గత నెల 23వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ లాక్‌డౌన్‌ ప్రకటించారు. అప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా చాలా వరకూ పరిశ్రమలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. బస్సులు, కార్లు, ఆటోలు తిరగడం లేదు. అత్యవసర వాహనాలు, ద్విచక్ర వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. వాహనాల రాకపోకలు తగ్గడంతో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. మునుపటితో పోలిస్తే వాతావరణ పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. రోజువారీ నమోదయ్యే కాలుష్యంకంటే సగటున 60 శాతం తగ్గింది. ఘన వ్యర్థాలు, నీటి కాలుష్యం స్వల్పంగానే తగ్గినప్పటికీ వాయుకాలుష్యం 80 శాతానికి తగ్గినట్లు గణాకాంలు చెబుతు న్నాయి. పది రోజులుగా అమలవుతున్న లాక్‌డౌన్‌ కారణంగా గాలిలో కాలు ష్య కారకాలు భారీగా తగ్గాయి.


గాలి నాణ్యత సంతృప్తిస్థాయి నుంచి స్వచ్ఛ మైన స్థాయికి వచ్చింది. గాలి కాలుష్యంలో అగ్రభాగం వాహనాలు విడుదల చేసే కార్బన్‌ డైయాక్సైడే. జిల్లాలోని 12.36 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటి లో 61 శాతం 10.03 లక్షల ద్విచక్ర వాహనాలు, 71 వేల కార్లు, 32 వేల ట్రాక్ట ర్లు, 41 వేల ఆటోలు, స్కూలు బస్సులు 3,432, క్యాబ్‌లు 6,870, ఆర్టీసీ బస్సు లు 870 రోజూ తిరుగుతుంటాయి. ప్రస్తుతం వీటిలో కనీసం  పదో వంతు కూడా తిరగడం లేదు. అత్యవ సర సేవల మినహా మిగ తావన్ని ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఫలి తంగా గాలిలో కలిసే సల్ఫర్‌, నైట్రోజన్‌, కార్బన్‌ సంబంధ వ్యర్థాల శాతం గణనీయంగా తగ్గింది. ఘన, ద్రవ కాలుష్యం ఆశించిన స్థాయిలో తగ్గలేదని, గృహావసరాల ద్వారా వెలువడే ఘన, ద్రవ వ్యర్థాలు, ఆక్వా వ్యర్థాలు తగ్గక పోవడమే కారణమని తెలుస్తోంది. సాధారణంగా మార్చి నెలాఖరులో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ, ఈ ఏడాది సాధారణంగానే ఉన్నాయి. 


గాలిలో రకాలు 

పీఎం 2.5 : గాలిలో ధూళి కణాలను రెండు రకాలుగా నమోదు చేస్తారు. మొదటిది పీఎం 2.5 (రేణువులు). ఇది వాతావరణంలో కంటికి కనిపించని అతి సూక్ష్మమైన ధూళి కణం. ఇది ప్రమాదకరమైనది. మనకు తెలియకుండానే శ్వాస పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి, అక్కడే ఉండి పోతాయి. తిరిగి బయటకు వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల శ్వాస కోశ వ్యాధులతోపాటు చర్మవ్యాధులు, కేన్సర్‌ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. 


పీఎం 10 : గాలిలో రెండో రకమైన ధూళి కణం పీఎం 10. గాలి పీల్చినప్పుడు పీఎం 10 ధూళి కణాలను ముక్కు నివారిస్తుంది. అయితే ఇది కూడా పరిమితికి మించితే ప్రమాదమే. వాతావరణంలో ధూళి కాలుష్య శాతం పరిమితికి మించి పెరిగితే శ్వాస కోశ, చర్మ వ్యాధులు ప్రబలుతాయి.  


 వాయు కాలుష్యం తగ్గింది : వెంకటేశ్వర్లు, పర్యావరణ ఇంజనీర్‌ 

 మునుపటితో పోల్చుకుంటే వాయు కాలుష్యం బాగా తగ్గింది. లాక్‌డౌన్‌ కారణంగా వాహనాల రాకపోకలు 90 శాతం తగ్గిపోయాయి. ఫలితంగా గాలి కాలుష్యంలో మార్పులు చోటు చేసుకున్నాయి. గాలిలో కలిసే వ్యర్థాల శాతం తగ్గింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి.



జిల్లాలో కాలుష్య పరిస్థితి

కాలుష్య కారకం పరిమితి సాధారణస్థాయి ప్రస్తుతం 

సల్ఫర్‌ డయాక్సైడ్‌ 40-80      30 09

నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ 40-80 40 08

అమోనియా కణాలు 200-400 300 200

ధూళి కణాలు 50-100 100 46

 

Updated Date - 2020-04-02T11:39:06+05:30 IST