పరీక్ష ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రిలోనే

ABN , First Publish Date - 2022-05-25T05:52:03+05:30 IST

సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి స్కానింగ్‌ సెంటర్‌కు వచ్చినవారు బయటకు వెళ్లాల్సిన అవసరం రాకుండా అన్ని పరీక్షలు చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాల అనుబంధ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రేడియాలజీ హబ్‌ను మంగళవారం ఆయన జడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాఽధాకృష్ణశర్మతో కలిసి ప్రారంభించారు. అనంతరం రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

పరీక్ష ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రిలోనే

రాష్ట్రవ్యాప్తంగా 43 రేడియాలజీ హబ్‌ల ఏర్పాటు

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి/సిద్దిపేట టౌన్‌, మే 24: సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి స్కానింగ్‌ సెంటర్‌కు వచ్చినవారు బయటకు వెళ్లాల్సిన అవసరం రాకుండా అన్ని పరీక్షలు చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాల అనుబంధ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రేడియాలజీ హబ్‌ను మంగళవారం ఆయన జడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాఽధాకృష్ణశర్మతో కలిసి ప్రారంభించారు. అనంతరం రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో 33 రేడియాలజీ హబ్‌లు, హైదరాబాద్‌ నగరంలో 10 హబ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే పరీక్షల కోసం ప్రైవేట్‌ ల్యాబ్‌లకు రాసేవారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఉచితంగానే ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేస్తున్నారని హరీశ్‌రావు వెల్లడించారు. 70 ఏళ్లలో కేవలం 3 మెడికల్‌ కళాశాలలు ఉంటే,  7ఏళ్లలో 33 మెడికల్‌ కళాశాలలు తెచ్చుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. 700 మెడికల్‌ సీట్ల నుంచి 5,240 మెడికల్‌ సీట్ల వరకు పెంపు జరుగనున్నట్లు తెలిపారు. పీహెచ్‌సీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రిఫర్‌ చేయబడిన రోగులకు జనరల్‌ ఆస్పత్రిలో 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామని ప్రకటించారు. రక్త పరీక్షలతో పాటు ఈసీజీ, టూడీఈకో, ఎక్స్‌రే, అలా్ట్రసౌండ్‌, మమోగ్రఫీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. ప్రజలకు ఏ పరీక్ష అవసరమైనా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్‌ డెలివరీల సంఖ్య పెంచేందుకు వైద్యులు కృషిచేయాలని సూచించారు. అలాగే, సర్కారు దవాఖాల్లో గుండెపోటు వచ్చినవారికి కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా అన్ని జిల్లా ఆస్పత్రుల్లో స్టెమీ కార్యక్రమం ద్వారా రూ. 40 వేల విలువైన ఇంజక్షన్‌ను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, వైస్‌ చైర్మన్‌ జంగిటి కనకరాజు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం, సుడా డైరెక్టర్‌ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, డీఏంఆండ్‌హెచ్‌వో కాశీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:52:03+05:30 IST