తోడేస్తున్నారు

ABN , First Publish Date - 2020-09-25T11:13:57+05:30 IST

మండల పరిధిలోని నేటపల్లె చెరువు వద్ద ఉన్న కొండల్లో ఎర్రమట్టిని ఇష్టారాజ్యంగా ఎటువంటి అనుమతులు

తోడేస్తున్నారు

 అక్రమంగా ఎర్రమట్టి తరలింపు


కమలాపురం, సెప్టెంబరు 24: మండల పరిధిలోని నేటపల్లె చెరువు వద్ద ఉన్న కొండల్లో ఎర్రమట్టిని ఇష్టారాజ్యంగా ఎటువంటి అనుమతులు లేకుండానే తరలిస్తున్నారు. నేటపల్లె ప్రాంతంలో ఎర్రమట్టి (గ్రావెల్‌)తో పాటు మరంతో కూడిన ఎర్రమట్టి అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ గుట్టలు ఉన్నాయి. ప్రభుత్వ రోడ్లకు అనుమతులతో ఈ ఎర్రమట్టిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే సొంత అవసరాలకు కూడా ఎటువంటి అనుమతులు లేకుండానే మట్టిని విచ్చలవిడిగా తోడేస్తున్నారు.


పదుల సంఖ్యలో ట్రాక్టర్లను పెట్టి జేసీబీ సాయంతో మట్టిని పెకలించి ఇతర ప్రాంతాలకు తీసుకెళుతున్నారు. కమలాపురం మండలవాసులే కాకుండా వల్లూరు మండలానికి చెందినవారు కూడా ఈ మట్టినే సొంత అవసరాలకోసం వినియోగిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దారు విజయకుమార్‌ను వివరణ అడుగగా ఎర్రమట్టి తరలింపునకు ఎవరికి అనుమతులు ఇవ్వలేదని, ఈ విషయం తెలియగానే తాను ఆ ప్రాంతానికి వెళ్లడంతో అప్పటికే అక్రమదారులు అక్కడి  నుంచి వెళ్లిపోయినట్లు తెలిసిందన్నారు. గతంలో కూడా ఇలాంటివి జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని, అప్పట్లో వెళ్లి పరిశీలించామని, అక్కడ హిటాచి, సంబంధిత లారీ ఉండగా వాటి తాళాలు తీసుకొచ్చామన్నారు. ఇకపై ఎవరు అక్రమంగా తవ్వకాలు చేపట్టినా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో వీఆర్వో, వీఆర్‌ఏలను పర్యవేక్షించమని ఆదేశాలు ఇస్తామన్నారు. 

Updated Date - 2020-09-25T11:13:57+05:30 IST