ఎర్ర చొక్కా, నల్ల మాస్క్‌.. అతడే నిందితుడా..!?

ABN , First Publish Date - 2021-07-10T19:28:54+05:30 IST

చిన్నారిపై లైంగిక దాడి కేసులో ఎరుపు రంగు టీ షర్టు, మూతికి నల్ల మాస్కు ధరించిన...

ఎర్ర చొక్కా, నల్ల మాస్క్‌.. అతడే నిందితుడా..!?

  • చిన్నారిపై లైంగికదాడి కేసులో పోలీసుల ముమ్మర దర్యాప్తు
  • అదుపులో అనుమానితుడు
  • మరో బాలిక కిడ్నాప్‌నకు కూడా యత్నం


హైదరాబాద్ సిటీ/జవహర్‌నగర్‌ : చిన్నారిపై లైంగిక దాడి కేసులో ఎరుపు రంగు టీ షర్టు, మూతికి నల్ల మాస్కు ధరించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతడు మరో బాలిక కిడ్నా్‌పనకు కూడా ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. నిందితుడి కోసం జల్లెడ పడుతున్నారు. దమ్మాయిగూడ ప్రగతినగర్‌తో పాటు సమీప అడవిలో గాలింపు చర్యలు ముమ్మురం చేశారు. లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతోపాటు క్రైం బ్రాంచ్‌, ఎస్‌ఓటీ, ఐటీ సెల్‌, సీసీఎ్‌సతో పాటు పలు విభాగాలకు చెందిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు.


మరో బాలిక కిడ్నాప్‌నకు యత్నం?

ఎరుపు రంగు టీ షర్టు, మూతికి నల్ల మాస్కు ధరించిన అనుమానితుడు ప్రగతినగర్‌ కాలనీలో ఉన్న దుకాణంలో సిగరెట్‌ కొనుకున్నాడు. అక్కడ ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు అడ్డుకుని నిలదీశారు. అక్కడి నుంచి అనుమానితుడు ఉడాయించాడు. పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడంతో అతడే పాపపై లైంగిక దాడి కేసులో నిందితుడు అయి ఉండొచ్చన్న అనుమానంతో వారు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కీసర పోలీస్‌స్టేషన్‌ పరిసర ప్రాంతంలో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


సంఘటన స్థలానికి సీపీ 

రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ దమ్మాయిగూడకు వచ్చి సమీప అడవి, పలు ప్రాంతాలతో పాటు ప్రగతినగర్‌ వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నీలోఫర్‌కు వెళ్లి పాపను పరామర్శించారు.

Updated Date - 2021-07-10T19:28:54+05:30 IST