‘ఎర్ర’ అంబులెన్సులు

ABN , First Publish Date - 2022-05-27T07:32:06+05:30 IST

కుయ్‌.. కుయ్‌మంటూ హారన్‌ కొడుతూ అంబులెన్సు పరుగు తీస్తోంది. రోడ్డుపై వెళ్లే వాహనాల వాళ్లు దారిస్తున్నారు.

‘ఎర్ర’ అంబులెన్సులు
నిందితులు, దుంగలు, వాహనాలను మీడియాకు చూపుతున్న ఎస్పీ రిషాంత్‌రెడ్డి

పైకి రోగుల సెటప్‌.. లోపల దుంగలు 

అక్రమ రవాణాలో తెలివిమీరిన స్మగ్లర్లు 

పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు 

రెండు చోట్ల రూ.కోటి ఎర్రచందనం, 

15 మంది ఎర్ర దొంగల పట్టివేత 

చిత్తూరు, మే 26: కుయ్‌.. కుయ్‌మంటూ హారన్‌ కొడుతూ అంబులెన్సు పరుగు తీస్తోంది. రోడ్డుపై వెళ్లే వాహనాల వాళ్లు దారిస్తున్నారు. అద్దాల నుంచి చూస్తే రోగి పడుకుని ఉండగా.. కొందరు సహాయంగా ఉన్నారు. అలా ఎక్కడా ఆగకుండా వెళుతున్న అంబులెన్సును చిత్తూరు పోలీసులు ఆపారు. తనిఖీ చేశారు. అప్పుడు తెలిసింది అది రోగులను తీసుకెళ్లే అంబులెన్సు కాదు.. ఎర్రచందనం దుంగలను అక్రమంగా, రాజబాటన తీసుకెళ్తున్న అంబులెన్సు అని. రోగుల మాటున ఎన్నిసార్లు దుంగలను తమిళనాడుకు తరలించారోగానీ.. పక్కా సమాచారంతో బుధవారం సాయంత్రం పట్టుబడింది. దీంతోపాటు మరోచోటా కలిపి మొత్తం రూ.కోటి దుంగలు, 15 మంది స్మగ్లర్లను పట్టుకున్న వివరాలను గురువారం డీఎస్పీ సుధాకర్‌రెడ్డితో కలిసి ఎస్పీ రిషాంత్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన ప్రకారం.. 

- అంబులెన్సులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారనే సమాచారం చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డికి అందింది. దీంతో తాలూకా సీఐ బాలయ్య, ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం చిత్తూరు- వేలూరు రోడ్డులో మాపాక్షి మలుపు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. చిత్తూరు వైపు నుంచి వేలూరు మార్గంలో ఒక అంబులెన్స్‌ను ఆపి తనిఖీ చేశారు. అందులో 36 ఎర్రచందనం దుంగలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందులోని తమిళనాడు రాష్ట్రం జమునమరత్తూర్‌ తాలుకా నమియంబట్టుకు చెందిన ఎం.శివాజి, ప్రశాంత్‌, జయపాల్‌, కె.ఉదయ్‌ కుమార్‌, కె.సత్యరాజ్‌, మేల్సిలంబడికి చెందిన కాశి, కల్‌కుప్పానికి చెందిన దేవరాజ్‌, నల్లపట్టు గ్రామానికి చెందిన రాధాకృష్ణ, మెల్విలమచ్‌ గ్రామానికి చెందిన సెల్వం, ఓడికోల్లైవాసి కుప్పుస్వామి, తాతా్‌సకుప్పానికి చెందిన భాగ్యరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.50 లక్షల విలువైన 36 ఎర్రచందనం దుంగలు, రూ.15 లక్షల అంబులెన్స్‌, గొడ్డలి, మత్తుకత్తిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో ఇది వరకు జిల్లాలో అనేక కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన వారున్నారు. 

గుడిపాల క్రాస్‌ వద్ద.. 

చిత్తూరు రూరల్‌ వెస్ట్‌ సీఐ శ్రీనివాసులు, గుడిపాల ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బందితో కలిసి గురువారం ఉదయం చెన్నై- బెంగళూరు రోడ్డులోని గుడిపాల క్రాస్‌ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ద్విచక్ర వాహనంలో చెన్నై మింట్‌బ్రిడ్జికి సమీపంలో ఉన్న ధర్మరాజులుగుడి వీధికి చెందిన లక్ష్మీపతి, రెడ్‌హిల్స్‌ సమీపంలో ఉన్న ఎల్లమ్మపేటకు చెందిన సామువేలును అనుమానంతో అదుపులోకి తీసుకుంటుండగా.. వెనుకగా మరో వాహనం చిత్తూరు వైపు నుంచి వచ్చింది. దానిని ఆపి తనిఖీ చేయగా రూ.50 లక్షల విలువైన 35 ఎర్రచందనం దుంగలున్నాయి. ఆ వాహనంలోని రెడ్‌హిల్స్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌, తిరుత్తణి తాలూకా గాంధీరోడ్డుకు చెందిన ముత్తురాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ. 10 లక్షల విలువ చేసే రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో నలుగురు స్మగ్లర్లు

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నలుగురు స్మగ్లర్లు తప్పించుకున్నారు. వీరిలో తిరువణ్ణామలైకి జిల్లాకు చెందిన పెరుమాల్‌ పోలీసుల జాబితాలో మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్రాష్ట్ర స్మగ్లర్‌. ఇతడిపై జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. పోలూర్‌ తాలూకా కల్‌కుప్పానికి చెందిన అజిత్‌ అనే స్మగ్లర్‌ పెరుమాళ్‌కు ప్రధాన అనుచరుడు. వీరితోపాటు వినోద్‌కుమార్‌, శరత్‌ కూడా తప్పించుకున్నారు.


పక్కాగా సెటప్‌ చేసి..!

అంబులెన్సులో స్ట్రెచర్‌ కింద ఎర్రచందనం దుంగలు సర్దుతారు. పైన రోగిలా ఓ కూలీని పడుకోబెడతారు. మిగిలిన కూలీలు బంధువుల్లా అతడికి మరోవైపు కూర్చుంటారు. ఇంకో కూలీ వైద్య చికిత్సలు చేసే సిబ్బందిలా బ్లూ షర్ట్‌, బ్లూ ఫ్యాంట్‌ డ్రెస్‌కోడ్‌తో ఉంటాడు. దారి మధ్యలో ఎక్కడైనా పోలీసులు ఆపితే.. బంధువుల్లా నటించే కూలీలు ఏడుపు మొదలు పెడతారు. దీంతో రోగి పరిస్థితి సీరియ్‌సగా ఉందేమోనని పోలీసులు వెంటనే ఆ అంబులెన్సును పంపించేస్తారు. ఇక, అంబులెన్స్‌ నడిపే డ్రైవర్‌ తెల్లచొక్కా, తెల్లప్యాంటు (యూనిఫాం) వేసుకుని ఉంటాడు. ఇలా.. పక్కా స్కెచ్‌తో, ఎవరికీ అనుమానం రాకుండా అంబులెన్సుల్లో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారు. ఎంతకాలం ఇలా సాగిందో కానీ.. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో బుధవారం బయటపడింది. 



Updated Date - 2022-05-27T07:32:06+05:30 IST