SBI: భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులు

ABN , First Publish Date - 2022-09-24T21:15:24+05:30 IST

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(State Bank of India)(ఎస్‌బీఐ) ఆధ్వర్యంలోని సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఆర్‌పీడీ) - ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ(Recruitment of Probationary Officer Posts)కి నోటిఫికేషన్‌ విడుదల చేసింది

SBI: భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(State Bank of India)(ఎస్‌బీఐ) ఆధ్వర్యంలోని సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఆర్‌పీడీ) - ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ(Recruitment of Probationary Officer Posts)కి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 1673 పోస్టులు ఉన్నాయి. వీటిలో 1600 రెగ్యులర్‌ పోస్టులు కాగా మిగిలిన 73 బ్యాక్‌లాగ్‌ ఖాళీలు. అభ్యర్థులను ఫేజ్‌ 1-ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌, ఫేజ్‌ 2-మెయిన్‌ ఎగ్జామినేషన్‌, ఫేజ్‌ 3-సైకోమెట్రిక్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులకు ప్రీ ఎగ్జామినేషన్‌ ట్రెయినింగ్‌ (పీఈటీ) సౌకర్యం కల్పిస్తారు.


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిసెంబరు 31 నాటికి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్‌ డ్యూయెల్‌ డిగ్రీ ఉత్తీర్ణులు; మెడికల్‌, ఇంజనీరింగ్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, కాస్ట్‌ అకౌంటెంట్‌ కోర్సులు పూర్తిచేసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు ఏప్రిల్‌ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు వర్తిస్తాయి. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగుసార్లు పీఓ ఎగ్జామ్‌ను రాయవచ్చు. జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ దివ్యాంగులు, ఓబీసీ (దివ్యాంగులు సహా) అభ్యర్థులు గరిష్ఠంగా ఏడు సార్లు రాయవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి పరిమితి లేదు. ఈ చాన్స్‌లను 2010 ఏప్రిల్‌ 18న నిర్వహించిన ఎగ్జామ్‌ నుంచి పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిలిమినరీ ఎగ్జామ్‌ మాత్రమే రాస్తే దానిని ఒక చాన్స్‌గా పరిగణించరు. మెయిన్‌ ఎగ్జామ్‌ రాస్తేనే లెక్కలోకి వస్తుంది.

ఫైనల్‌ సెలెక్షన్‌: మెయిన్‌ ఎగ్జామ్‌ స్కోర్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌ స్కోర్‌లను మొత్తం 100 (75 + 25) మార్కులకు నార్మలైజ్‌ చేసి కేటగిరీలవారీగా మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు.  

ఫేజ్‌ 1-ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌: ఈ పరీక్షని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మూడు సెక్షన్‌లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు 20 నిమిషాలు చొప్పున మొత్తం పరీక్ష సమయం గంట. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 35, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 100. నిర్దేశించిన మేరకు అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను కేటగిరీలవారీగా ఖాళీలకు పది రెట్లమందిని ఎంపిక చేసి మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు అనుమతిస్తారు.

ఫేజ్‌ 2-మెయిన్‌ ఎగ్జామినేషన్‌: ఈ పరీక్షని కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఇందులో నాలుగు ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌లు, ఒక డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌ ఉంటాయి. మొత్తం పరీక్ష సమయం మూడున్నర గంటలు. మొత్తం మార్కులు 250.

ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌లు: రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో 40 ప్రశ్నలు ఇస్తారు. దీనికి 50 నిమిషాల పరీక్ష సమయం, 50 మార్కులు ఉంటాయి. డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంట్రప్రిటేషన్‌ టెస్ట్‌లో 30 ప్రశ్నలు ఇస్తారు. దీనికి 45 నిమిషాల పరీక్ష సమయం, 50 మార్కులు ఉంటాయి. జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ టెస్ట్‌లో 50 ప్రశ్నలు ఇస్తారు. దీనికి 45 నిముషాల పరీక్ష సమయం, 60 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌లో 35 ప్రశ్నలు ఇస్తారు. దీనికి 40 నిమిషాల పరీక్ష సమయం, 40 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌లకు కేటాయించిన మొత్తం పరీక్ష సమయం మూడు గంటలు కాగా మొత్తం మార్కులు 200.  

డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌: ఇందులో లెటర్‌ రైటింగ్‌, ఎస్సే రైటింగ్‌కు సంబంధించి రెండు ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం అరగంట. మార్కులు 50. మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో నిర్దేశించిన మేరకు అర్హత మార్కులు సాధించినవారిని కేటగిరీల వారీగా ఖాళీలకు మూడు రెట్లమందిని ఎంపిక చేసి సైకోమెట్రిక్‌ టెస్ట్‌కు అనుమతిస్తారు.

ఫేజ్‌ 3-సైకోమెట్రిక్‌ టెస్ట్‌: దీనికి 50 మార్కులు నిర్దేశించారు. ఇందులో గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు ప్రత్యేకించారు. 


ముఖ్య సమాచారం

రుణాత్మక మార్కులు: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌, మెయిన్‌ ఎగ్జామినేషన్‌లలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులు వర్తిస్తాయి. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. 

ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.750; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 12 

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ తేదీలు: డిసెంబరు 17 నుంచి 20 

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ సెంటర్లు: ఏపీలో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్‌, కరీంగర్‌, ఖమ్మం, వరంగల్‌

వెబ్‌సైట్‌: www.sbi.co.in





Updated Date - 2022-09-24T21:15:24+05:30 IST