యాక్టివ్‌ కేసుల్ని మించి రికవరీ

ABN , First Publish Date - 2020-06-11T07:36:41+05:30 IST

ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ యూకే.. ఇలా చాలా దేశాలు కరోనా విధ్వంసానికి కుదేలయ్యాయి! వైరస్‌ తీవ్రస్థాయిలో ఉన్న ఆ దేశాల్లో.. ఒక దశ తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. యాక్టివ్‌ కేసులకన్నా.. కోలుకున్నవారి సంఖ్య ఎక్కువైన దశ అది. ఒక్కసారి ఆ దశకు చేరుకున్నాక రోజువారీ కొత్త కేసుల నమోదు తగ్గుతూ వచ్చింది...

యాక్టివ్‌ కేసుల్ని మించి రికవరీ

ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ యూకే.. ఇలా చాలా దేశాలు కరోనా విధ్వంసానికి కుదేలయ్యాయి! వైరస్‌ తీవ్రస్థాయిలో ఉన్న ఆ దేశాల్లో.. ఒక దశ తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. యాక్టివ్‌ కేసులకన్నా.. కోలుకున్నవారి సంఖ్య ఎక్కువైన దశ అది. ఒక్కసారి ఆ దశకు చేరుకున్నాక రోజువారీ కొత్త కేసుల నమోదు తగ్గుతూ వచ్చింది! కొవిడ్‌ కేసులతో విలవిలలాడుతున్న భారతదేశం కూడా ఆ దిశగానే సాగుతోందా? కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్నవారి కన్నా.. కోలుకుని ఇళ్లకు చేరుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. 


  • రికవరీ పెరిగితే వైరస్‌ తగ్గుతున్నట్టే!
  • స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌ గణాంకాలే రుజువు

న్యూఢిల్లీ, జూన్‌ 10: దేశంలో కరోనా వైరస్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్యను (1,33,632), ఆ వైరస్‌ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య (1,35,205) అధిగమించింది. భారత్‌లో కొవిడ్‌-19 మొదటి కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలా జరగడం ఇదే తొలిసారి. దేశంలో వైరస్‌ బారిన పడినవారిలో 48.99 శాతం మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. యాక్టివ్‌ కేసుల సంఖ్యను రికవరీ కేసుల సంఖ్య అధిగమించడం అంటే.. అది వైరస్‌ విస్తృతి తగ్గుతోందనడానికి సంకేతమని ఎపిడమాలజిస్టులు చెబుతున్నారు. కరోనా విలయం సృష్టించిన ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో కరోనా ట్రెండ్స్‌ను పరిశీలిస్తే వారి వాదన నిజమేనని అర్థమవుతోంది.


  1. స్పెయిన్‌లో ఏప్రిల్‌ 23న అత్యధికంగా 1,00,106 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఆ మర్నాడే ఆ సంఖ్య 88 వేలకు తగ్గింది. అదే రోజు రికవరీ రేటు 92.4 వేలకు చేరింది. ఆరోజు స్పెయిన్‌లో 6740 కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజూ ఆ స్థాయిలో స్పెయిన్‌లో కొత్త కేసులు నమోదు కాలేదు.
  2. ఇటలీలో అత్యధిక యాక్టివ్‌ కేసులు (1.08 లక్షలు) ఏప్రిల్‌ 19న నమోదయ్యాయి. ఆరోజుకు ఆ దేశంలో కోలుకున్నవారి సంఖ్య యాక్టివ్‌ కేసులతో పోలిస్తే చాలా తక్కువ. ఆ తర్వాత 17 రోజులకు.. అంటే మే 6న అక్కడ యాక్టివ్‌ కేసుల సంఖ్య (91 వేలు)ను రికవరీ కేసుల సంఖ్య (93 వేలు) అధిగమించింది. దానికన్నా ముందే.. ఏప్రిల్‌ 20 నుంచే ఇటలీలో కేసుల సంఖ్య తగ్గడం మొదలైంది. 
  3. ఫ్రాన్సులో తొలిసారి మే 12న.. యాక్టివ్‌ కేసుల సంఖ్య(55.4 వేలు)కన్నా కోలుకున్నవారి సంఖ్య (56 వేలు) ఎక్కువగా నమోదైంది. ఆ తర్వాత ఎప్పు డూ యాక్టివ్‌ కేసుల సంఖ్య రికవరీ కేసుల సంఖ్యను మించలేదు. 


80 శాతం మందికి కొద్దిపాటి లక్షణాలే

ప్రపంచవ్యాప్తంగా కరోనా ట్రెండ్స్‌ చూస్తుంటే.. 80 శాతం కేసుల్లో కొద్దిపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, వారంతా 100 శాతం కోలుకుంటున్నారని ఢిల్లీ సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రిలోని ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు డాక్టర్‌ నీరజ్‌ గుప్తా తెలిపారు. అలాగని,  నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, ఇకపైనా భౌతిక దూరాన్ని పాటించాలని, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని సూచించారు.


Updated Date - 2020-06-11T07:36:41+05:30 IST