వెంకన్న ఆలయ పునర్నిర్మాణం వేగవంతం

ABN , First Publish Date - 2021-06-13T05:09:01+05:30 IST

ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటే శ్వర, కోదండరామస్వామి ఆలయాల పునర్నిర్మాణం పనులు వేగవంతం చేయాలని దేవదాయశాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (విశాఖ) ఎస్‌కే సైదా అన్నారు.

వెంకన్న ఆలయ పునర్నిర్మాణం వేగవంతం
ఆలయ పనులు పరిశీలిస్తున్న డీఈ సైదా

- దేవదాయశాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌  సైదా 

గరుగుబిల్లి : ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటే శ్వర, కోదండరామస్వామి ఆలయాల పునర్నిర్మాణం పనులు వేగవంతం చేయాలని దేవదాయశాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (విశాఖ) ఎస్‌కే సైదా అన్నారు. శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్మించిన ఆలయం కొంతమేర శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు వాస్తులోపం కారణంగా పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు చేయగా, ప్రభుత్వం రూ.83 లక్షలు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు, అర్చకుల గృహాలు, ముఖ మండపం, విద్యుత్‌ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఉన్నతాధికారులు రూపొందించిన డిజైన్ల మేరకు నిర్మాణం చేపడుతున్నామన్నారు. నిర్ధేశించిన సమయానికి పూర్తి చేసి తోటపల్లికి పూర్వ వైభవం వచ్చేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆలయ ఈవో బి.లక్ష్మీనగేష్‌ తెలిపారు. పనుల్లో నాణ్యతా లోపాలకు తావివ్వకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ పరిశీలనలో సిబ్బంది ఎం.మురళీనాయుడు, బలరాంనాయుడు, తదితరులు ఉన్నారు. 

 

Updated Date - 2021-06-13T05:09:01+05:30 IST