Maha political crisis: ‘మహా’ సంక్షోభంలో మరో కీలక మలుపు.. ఏక్‌నాథ్ షిండే సంచలన ప్రకటన..

ABN , First Publish Date - 2022-06-28T23:05:23+05:30 IST

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం గౌహతిలోని ఓ లగ్జరీ హోటల్‌లో తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలతో పాటు ఉన్న శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే తాజాగా..

Maha political crisis: ‘మహా’ సంక్షోభంలో మరో కీలక మలుపు..  ఏక్‌నాథ్ షిండే సంచలన ప్రకటన..

ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం గౌహతిలోని ఓ లగ్జరీ హోటల్‌లో తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలతో పాటు ఉన్న శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే తాజాగా కీలక ప్రకటన చేశారు. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. త్వరలో రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ముంబైకి వెళ్లనున్నట్లు షిండే ప్రకటించడం గమనార్హం. తాము శివసేనలోనే ఉన్నామని, శివసేనను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఉన్నామని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని షిండే మీడియాకు తెలిపారు. త్వరలో తాను ముంబై వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గౌహతిలో తనతో పాటు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. త్వరలోనే తాను ముంబై వెళ్లి గవర్నర్‌ను కలుస్తానని షిండే స్పష్టం చేశారు. రెబల్ ఎమ్మెల్యేల్లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రేతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారాన్ని ఏక్‌నాథ్ షిండే కొట్టిపారేశారు. రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత నోటీసులపై స్పందించేందుకు జులై 12 వరకూ సుప్రీం కోర్టు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం లేదు.



దీంతో.. ఏక్‌నాథ్ షిండే తన తదుపరి వ్యూహాలకు పదును పెట్టారు. గవర్నర్‌ను కలిసి అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను ఆయన ముందు పెట్టాలనే ఆలోచనలో ఏక్‌నాథ్ షిండే ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మహారాష్ట్ర బీజేపీ కూడా అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలించి వేగంగా పావులు కదుపుతోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ మంగళవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. మహారాష్ట్ర పరిణామాలపై కేంద్ర అధినాయకత్వంతో చర్చించేందుకు ఆయన వెళ్లినట్లు సమాచారం. సోమవారం నాడు మహారాష్ట్రలో పరిణామాలపై ఫడణవీస్ రాష్ట్ర నేతలతో కోర్ కమిటీ సమావేశం నిర్వహించి చర్చించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్ షిండే క్యాంపులోని ఎమ్మెల్యేలను ఉద్దేశించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ‘‘ముంబైకి తిరిగొచ్చేయండి.. కలిసి మాట్లాడుకుందాం.. మనమంతా కలిసి పరిష్కారం దిశగా అడుగులేద్దాం’’ అని ఉద్ధవ్ ఠాక్రే రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి పిలుపునిచ్చారు.

Updated Date - 2022-06-28T23:05:23+05:30 IST