భరోసా కావాలి

ABN , First Publish Date - 2022-08-07T05:14:51+05:30 IST

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం నుంచి రైతు బీమా తరహాలో నేతన్నకు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుండటంతో ఆ వర్గాల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.

భరోసా కావాలి
కొత్తకోటలో మగ్గంపై వస్త్రం నేస్తోన్న కార్మికుడు

ఆర్థికంగా ఆదుకోవాలంటున్న నేత కార్మికులు

చేనేత బీమా పథకం అమలుపై హర్షం

60 ఏళ్లు దాటిన వారికీ అమలు చేయాలనే సూచనలు

సొసైటీల మనుగడకు ఊతమివ్వాలని డిమాండ్‌

నేడు జాతీయ చేనేత దినోత్సవం


 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం నుంచి రైతు బీమా తరహాలో నేతన్నకు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుండటంతో ఆ వర్గాల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. దశాబ్దాలుగా నేత వృత్తికి ఆదరణ లేకపోవడం, ప్రభుత్వాలు ప్రకటించే పథకాలు కొందరికే వర్తించడం, పోటీ ప్రపంచంలో వృత్తిదారులు తట్టుకోలేకపోవడం వంటి కారణాలతో వారి పరిస్థితి దినదినగండంగా మారింది. చేనేత ఉత్పత్తులకు ప్రసిద్ధిగాంచిన ఉమ్మడి జిల్లాలోని గద్వాల, నారాయణపేట, కొత్తకోట ప్రాంతాల్లోనూ పరిస్థితి దిగజారడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తమ బతుకు భరోసా ఇచ్చేలా కార్యక్రమాలు అమలు చేయాలని వృత్తిదారులు కోరుతున్నారు.

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి


ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేనేత కార్మికుల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. వృత్తికి ఆదరణ కరువవడంతో పలువురు ఇతర వృత్తుల్లోకి మారుతున్నారు. ప్రభుత్వం నేతన్నలకు మద్దతుగా పలు పథకాలు ప్రవేశపెడుతున్నా, పూర్తి స్థాయి ప్రోత్సాహం దక్కడం లేదనే అభిప్రాయం వెల్లడవుతోంది. ఉమ్మడి జిల్లాలో 4,578 చేనేత కుటుంబాలు ఉన్నాయి. 13,690 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 58 రిజిష్టర్‌ సొసైటీలు ఉండగా, 3,914 చేనేత మగ్గాలు, 94 మర మగ్గాలు పనిచేస్తున్నాయి. చేనేత మగ్గాల్లో 3,914 మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, సహకార సంఘాలకు రుణ పరపతి పథకం, పావలా వడ్డీ పథకాలు ఉమ్మడి జిల్లాలో అమలవుతున్నాయి.


అమలవుతున్న పథకాలు

చేనేత మిత్ర పథకం కింద ఉమ్మడి జిల్లాలో 3,080 మగ్గాలకు గాను 7,313 మందికి నూలు కొనుగోలుకు 40 శాతం సబ్సిడీ కింద రూ.8.68 కోట్ల నిధులు జమ చేశారు. అదేవిధంగా కార్మికుల ప్రయోజనార్థం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్‌  ఫండ్‌ కం సేవింగ్‌ అండ్‌ సెక్యూరిటీ పథకం నేతన్నకు చేయూత ద్వారా ఉమ్మడి జిల్లాలో 9,284 మంది కార్మికులతో ఖాతాలు తెరిపించి వారి ద్వారా రూ.9.32 కోట్ల మొత్తం జమచేయించారు. ఈ పథకం కింద ప్రభుత్వం మరో 50 శాతం నిధులను జమచేసి, నేతన్నలకు మెచ్యూరిటీగా అందిస్తోంది. వీటితో పాటు సంఘాలకు రుణ పరపతి పథకం కింద ఉమ్మడి జిల్లాలో ఏడు సొసైటీలకు రూ.5.55 కోట్ల రుణపరపతి కల్పించారు. ఆ సంఘాలకు పావలా వడ్డీ కింద రూ.50.76 లక్షలు అందించారు.


బీమా కింద 8,698 మంది నమోదు

రైతు బీమా పథకం తరహాలో చేనేత కార్మికులకు సైతం చేనేత బీమా పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈనెల ఏడు ఆదివారం నుంచి ఈపథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. ఈ పథకం కింద 18 నుంచి 60 సంవత్సరాల్లోపు వయసు గల వారిని నమోదు చేస్తున్నారు. ఈ పథకం కింద నమోదైన చేనేత కార్మికులు ఏ రకమైన మరణం సంభవించినా రూ.5 లక్షల బీమా సంబంధిత కుటుంబానికి అందుతుంది. ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో 8,698 మందిని చేనేత, జౌళి శాఖ అధికారులు ప్రాథ మికంగా అర్హులుగా గుర్తిం చారు. అయితే 60 ఏళ్ల వయసుదాటిన వారికీ పథ కాన్ని వర్తింప జేయాలని నేతన్నలు కోరుతున్నారు. 


ప్రోత్సాహమివ్వాలి 

చేనేత బీమా పథకం ప్రవేశపెట్టడం హర్షణీయమే. నారాయణపేట జిల్లాలో సొసైటీలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం కానీ, సబ్సిడీపై ముడిసరుకు గానీ అందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నారాయణపేట సొసైటీలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తే కార్మికులకు ఉపయుక్తంగా ఉంటుంది.

- కెంచె నారాయణ, చేనేత కార్మిక సంఘం నాయకుడు, నారాయణపేట 


మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలి 

నేత కార్మికులు తయారు చేసే వస్త్రాలకు రాష్ట్రంలోనే మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి. నూలు, రంగులు, మగ్గాలను సబ్సిడీపై అందించాలి. బ్యాంకులు ఇచ్చే రుణాలను ఏటేటా రెట్టింపు చేయాలి.

- సూర సరోజ, కొత్తకోట 


సబ్సిడీ రుణాలు ఇవ్వాలి

కార్మికులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. రూ.2 లక్షల రుణసాయంతో పాటు, వడ్డీలో సబ్సిడీ ఇవ్వాలి. 12  ఏళ్ల క్రితం అమరచింత కార్మికులు పొందిన రుణాలను మాఫీ చేయాలి. 

- పారుపల్లి శ్రీనివాసులు, అమరచింత



Updated Date - 2022-08-07T05:14:51+05:30 IST