రియల్టర్ల.. బరితెగింపు

ABN , First Publish Date - 2022-09-28T05:45:32+05:30 IST

నరసరావుపేట జిల్లా కేంద్రం కావడంతో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంది. ఈ క్రమంలో రియల్టర్లు బరితెగిస్తున్నారు.

రియల్టర్ల.. బరితెగింపు
నరసరావుపేట ఉప్పలపాడు రోడ్డులోని జగనన్న కాలనీ రోడ్డులో అక్రమ రియల్‌ వెంచర్‌

ప్రభుత్వ స్థలం కబ్జా.. ప్లాట్లగా విక్రయాలు

అధికార పార్టీ అండతో రెచ్చిపోతోన్న వ్యాపారులు

జగనన్నకాలనీ రహదారిలో అక్రమంగా రియల్‌ వెంచర్‌

తహసీల్దారు తొలగించిన హద్దు రాళ్లను మళ్లీ పాతిన వైనం


నరసరావుపేట. సెప్టెంబరు 27: నరసరావుపేట జిల్లా కేంద్రం కావడంతో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంది. ఈ క్రమంలో రియల్టర్లు బరితెగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. పంట కాల్వలు, వాగులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో కొందరు వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలంలో వెంచర్‌ వేశారని తహసీల్దారు గుర్తించి పీకేసిన హద్దురాళ్లను మళ్లీ పాతి ఏకంగా రోడ్డు నిర్మించి ప్లాట్లు విక్రయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఉప్పలపాడు రోడ్డులో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఈ కాలనీకి వెళ్లే రహదారిలోని పేదల భూముల్లో అక్రమంగా అధికార పార్టీకి చెందిన వ్యక్తులు రియల్‌ వెంచర్‌ వేశారు. డీకే పట్టా భూమిలో వెంచర్‌ వేసినట్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ స్థలాన్ని పరిశీలించిన తహసీల్దారు ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిగా నిర్ధారించి వెంచర్‌కు సంబంధించిన రాళ్లను తొలగించేశారు. ఇంతటితో రియల్‌ అక్రమార్కులు తగ్గాలి. అయితే తహసీల్దారు హద్దురాళ్లను పీకేసి పది రోజులు గడవక ముందే సదరు వ్యాపారులు మళ్లీ అదే స్థలంలోని ప్లాట్లకు తిరిగి రాళ్లు పాతారు. ఏకంగా రహదారి కూడా నిర్మించారు. సెంటు రూ.2 లక్షల చొప్పున విక్రయాలు కూడా చేపట్టినట్లు సమాచారం. ఒక సారి అధికారులు రాళ్లు తొలగించినా యథేచ్ఛగా తిరిగి వెంచర్‌ ఏర్పాటు చేయడం వెనుక అధికార పార్టీ నేతల అండదండలు అక్రమార్కులకు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో అధికారులు అనుమతులు ఇచ్చారంటూ స్థలాలను విక్రయించే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటేనే రియల్‌ అక్రమాలకు చెక్‌ పెట్టవచ్చు.


ఆ స్థలం పేదలకు పంపిణీ చేసిందే..

జగనన్న కాలనీకి వెళ్లే రోడ్డులో వెంచర్‌ వేసిన స్థలం ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిందని తహసీల్దారు రమణానాయక్‌ తెలిపారు. ఈ భూమిని స్థలాలుగా విభజించి విక్రయించడం నిషేధమన్నారు. వెంచర్‌ రాళ్లను తొలగిస్తామన్నారు. ఈ సారి స్థలంలో బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.  


Updated Date - 2022-09-28T05:45:32+05:30 IST