జిల్లాలో ‘రియల్‌’ కష్టాలు

ABN , First Publish Date - 2021-07-31T03:31:46+05:30 IST

ఏడాదిన్నరగా కరోనా రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కోలుకోకుండా చేస్తోంది.

జిల్లాలో ‘రియల్‌’ కష్టాలు

- కరోనాతో నిలిచిన భూముల కొనుగోళ్లు

- ప్రభుత్వ నిర్ణయంతో పెరిగిన ధరలు

- ఆందోళనలో రియల్‌ వ్యాపారులు

- మందకొడిగా రిజిస్ట్రేషన్లు

రెబ్బెన, జూలై 30: ఏడాదిన్నరగా కరోనా రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని కోలుకోకుండా చేస్తోంది. కోట్లు వెచ్చించి వెంచర్లు వేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు వ్యాపారం సాగక కంటి మీద కునుకు లేకుండా పోయింది. కరోనా మొదటి, రెండో వేవ్‌లతో ప్రజల ఆర్థిక పరిస్థితులు తలకిందులై ప్లాట్లు కొనుగోలు చేసందుకు ఆసక్తి చూపడం లేదు. కరోనాకు ముందు ‘రియల్‌’ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగినా ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం సైతం అనుమతి లేని వెంచర్లపై కొరడా ఝుళిపించడంతో గతంలో వేసిన వెంచర్ల వైపు ప్రజలు కన్నెత్తి చూడడం లేదు.

జిల్లాలోని రెబ్బెన, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, కౌటాల తదితర మండలాల్లో లాక్‌డౌన్‌కు ముందు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగింది. గతంలో రోజుకు సుమారు 10నుంచి 20వరకు ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేపట్టగా ప్రస్తుతం వాటి సంఖ్యకు 5కు మించడం లేదు. మొదటి వేవ్‌లో లాక్‌డౌన్‌తో మూడు నెలల పాటు ప్రజలు ఉపాధికి దూరమయ్యారు. పరిస్థితి కాస్త సద్దుమణిగిందనే లోపే రెండో వేవ్‌ విజృంభించింది. దీంతో ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ అమలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక ఉన్న కొద్ది పాటి సొమ్మును పెట్టుబడి పెట్టేందుకు వెనకాడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం వెంచర్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో నిబంధనలు మరింత కఠినం చేయడంతో పూర్తిస్థాయిలో అనుమతులు లేని వందలాది ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ కావడం లేదు.

అనుమతులు ఉంటేనే రిజిస్ట్రేషన్‌..

రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేని వెంచర్లు, ప్లాట్ల పట్ల కఠిన చర్యలు తీసుకుంది. గతంలో వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి సరైన అనుమతులు లేకుండానే విక్రయించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. అలాంటి అనుమతులు లేని వెంచర్లు, ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని తీసుకు వచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌ సమయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వెంచర్లు, ప్లాట్ల వివరాలను క్షేత్రస్థాయిలో అధికారులు సేకరించారు. జిల్లాలో సుమారు 106వెంచర్లు, 5460 వరకు ప్లాట్లు ఉన్నాయి. నాలా కన్వర్షన్‌, డీటీపీసీ అప్రూవల్‌, పంచాయతీ అనుమతి తదితర అన్ని రకాల అనుమతులు ఉన్న వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్‌లకు అవకాశం కల్పించింది.

భారీగా పెరిగిన ప్లాట్ల ధరలు..

ఒకప్పుడు ప్లాట్ల ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నా ప్రస్తుతం సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనలేని స్థాయికి పెరిగాయి. గతంలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి చదును చేసి నాలుగు హద్దు రాళ్లు వేసి ప్లాట్లుగా మార్చి సున్నంతో రోడ్డు వేసి ప్లాట్ల పేరు చెప్పి విక్రయించే వారు. తక్కువ పెట్టుబడులతో వెంచర్లు ఏర్పాటు కావడంతో ప్లాట్ల ధరలు సైతం కొంత తక్కుగానే నిర్ణయించి అమ్మకాలు చేపట్టి జేబులు నింపుకునే వారు. వెంచర్లలో రోడ్లు, డ్రెయినేజీ, కరెంటు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పంచాయతీ అవసరాల కోసం వెంచర్‌ భూమిలో కేటాయించాలి. ఒకప్పుడు ఇవే నిబంధనలు ఉన్నప్పటికీ అవేం పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్‌ చేసే వారు. రియల్‌ వ్యాపారులకు పెట్టుబడులు గణనీయంగా పెరగడంతో పాట్ల ధరలను అమాంతం పెంచుతున్నారు. ఈ కారణంతోనూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆశించిన స్థాయిలో జరగడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. 

ప్లాట్లు విక్రయించడం కష్టంగా మారింది.. 

 - దయాకర్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి

ప్లాట్లు అమ్మడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టంగా మారింది. ప్రభుత్వ నిబంధనలతో ప్లాట్‌ ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఒక ప్లాట్‌ విలువ 10నుంచి 30లక్షల వరకు ఉంటోంది. దీంతో కొనడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ నిబంధనలకు ముందు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగింది. ప్రస్తుతం కష్టంగా ఉంది. 

Updated Date - 2021-07-31T03:31:46+05:30 IST