మేమొస్తేనే సీమ అభివృద్ధి
ABN , First Publish Date - 2020-12-19T05:39:44+05:30 IST
రాయలసీమ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు.
- కర్నూలుకు హైకోర్టును తెస్తాం
- బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
- నగరంలో కార్యకర్తల సమావేశం
- నేడు మంత్రాలయంలో పర్యటన
కర్నూలు(అర్బన్), డిసెంబరు 18: రాయలసీమ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. శుక్రవారం నంద్యాల నుంచి కర్నూలు చేరుకున్న ఆయనకు సాయంత్రం 4 గంటలకు నంద్యాల చెక్‌పోస్టు వద్ద పార్టీ కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా మౌర్యాఇన్‌కు చేరుకున్నారు. అక్కడి పరిణయ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు పోలంకి రామస్వామి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు బీజేపీ విధానాలు, పార్టీ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ బీజేపీ, జనసేన పార్టీలకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. జిల్లాలో ఎయిర్‌పోర్టు, ట్రిపుల్ ఐటీ, డీఆర్‌డీఏ, సోలార్ ప్రాజెక్టులు, నేషనల్ హైవే బీజేపీ వల్లే వచ్చాయన్నారు. రాయలసీమ యూనివర్సిటీకి రూ.200 కోట్లు, హైవేలకు వేల కోట్ల నిధులు, నంద్యాల మెడికల్ కాలేజీకి రూ.50 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. జగన్, చంద్రబాబు సీమకు చేసింది శూన్యమని మండిపడ్డారు. చంద్రబాబు అమరావతి అంటే జగన్ మూడు రాజధానులు అనడం తప్ప వీళ్లకు రాయలసీమ అభివృద్ధి, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి పట్టలేదన్నారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదటి నుంచి తమ పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుతోనే రాష్ట్రం సస్యశ్యామలం కాదని, గాలేరు- నగరి, హంద్రీ నీవా సీఎంకు పట్టదా అని ప్రశ్నించారు. జిల్లాలో గుండ్రేవుల, సిద్ధేశ్వరం, సంగమేశ్వరం ప్రాజెక్టులు నిర్మించాలనే సంగతి విస్మరించారని అన్నారు.
కర్నూలును రెండో రాజధాని చేయాల్సిందే: టీజీ
కర్నూలును రెండో రాజధానిగా ఏర్పాటు చేయాల్సిందే అని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. తమిళనాడు నుంచి విడిపోయాక కర్నూలును రాజధాని చేసినట్లేచేసి హైదరాబాద్‌కు తరలించారని అన్నారు. ఇప్పుడేమో అమరావతి, వైజాగ్ అంటూ సీమ ప్రజల్ని మరో సారి మోసం చేస్తున్నారని అన్నారు. అమరావతి రాజధాని కోసం రైతులు 30 వేల ఎకరాలు త్యాగం చేస్తే.. శ్రీశైలం ప్రాజెక్టు కోసం 85 వేల ఎకరాల భూమిని రైతులు త్యాగం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు శ్రీశైలం కేవలం పవర్ ప్రాజెక్టు మాత్రమే అని కేసీఆర్ అంటున్నారని అన్నారు. కేసీఆర్‌ను తీరును జగన్ ప్రభుత్వం ప్రశ్నించకపోతే మరో ఉద్యమం పుట్టుకొస్తుందని హెచ్చరించారు. టీడీపీ, వైసీపీలు రెండూ రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అభ్యర్థిని గెలిపించడం ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. రాయలసీమను కూడా ఫ్రీజోన్‌గా ప్రకటిస్తేనే రాజధానిలో ఉద్యోగ అవకాశాలుంటాయన్నారు.
సీమను విస్మరించారు: విష్ణు
సీమ నుంచి అత్యున్నత పదవులకు ఎన్నికై ఈ ప్రాంతానికి ద్రోహం చేసిన వారు ఎందరో ఉన్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్టువర్ధన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు నుంచి నేటి జగన్ వరకు చేసిన అభివృద్ధి శూన్య మన్నారు. నీలం సంజీవరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇందులో భాగమే అన్నారు. రాయలసీమలోని 59 సీట్లలో 49 సీట్లు జగన్‌ను గెలిపిస్తే 19 నెలల్లో ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల కోసం ఇప్పటికైనా శాసనసభలో సభ్యులు నోరు తెరవాలని అన్నారు.
పార్టీ అభివృద్ధే లక్ష్యం కావాలి
పార్టీ అభివృద్ధే కార్యకర్తల లక్ష్యం కావాలని పార్టీ నాయకురాలు బైరెడ్డి శబరి అన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేసి జిల్లాలో బీజేపీని బలోపేతం చేయాలన్నారు. కేంద్ర ప్రభత్వుం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసికెళ్లాలని అన్నారు.
జీవో నెం 28తో దోపిడీ
పోలవరం నిర్మాణానికి జీవో నెం 28తో 40 వేల కోట్లు కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేంద్రాన్ని అడిగింది దోపిడీ కోసమే అని రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి అన్నారు. అయిన వారికి కాంట్రాక్టులు కట్ట బెట్టి వేల కోట్లు దోపిడీకి తెరలేపుతున్నారని అన్నారు.
నేడు మంత్రాలయంలో పర్యటన
సోము వీర్రాజు శనివారం మంత్రాల యంలో పర్యటించనున్నారు. కలుదేవకుంట గ్రామ సమీపంలోని బీజేపీ కార్యాలయం నుంచి మంత్రాలయంలోని కర్ణాటక గెస్టుహౌస్ వరకు ర్యాలీలో పాల్గొంటారు. అక్కడి పుష్కర ఘాట్లను పరిశీలిస్తారు.