గ్రూపు-1లో మెరిసిన రాయచోటి విద్యార్థులు

ABN , First Publish Date - 2022-07-06T04:48:12+05:30 IST

2018 గ్రూప్‌-1 పరీక్షా ఫలితాలను ప్రభుత్వం మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ ఫలితాలలో రాయచోటి విద్యార్థులు మెరిశారు.

గ్రూపు-1లో మెరిసిన రాయచోటి విద్యార్థులు
డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన కొండూరు శ్రీనివాసరాజు

డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులకు ఎంపిక

పలువురి అభినందనలు

రాయచోటి / లక్కిరెడ్డిపల్లె, జూలై 5 (ఆంధ్రజ్యోతి): 2018 గ్రూప్‌-1 పరీక్షా ఫలితాలను ప్రభుత్వం మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ ఫలితాలలో రాయచోటి విద్యార్థులు మెరిశారు. డిప్యూటీ కలెక్టర్‌, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ వంటి పోస్టులను సాధించారు. లక్కిరెడ్డిపల్లె మండలంలోని కుర్నూతల పంచాయతీలోని కోతలగుట్టపల్లె గ్రామానికి చెందిన కొండూరు శ్రీనివాసరాజు డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు రెడ్డెయ్యరాజు, తులశమ్మ. తండ్రి చిన్నపాటి రైతు. శ్రీనివాసరాజు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు తన సొంత గ్రామంలో చదివి 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు రాయచోటిలోని రాజు విద్యాసంస్థల్లో చదివాడు. డిగ్రీ కడప వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో, ఎంసీఏ తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివాడు. అనంతరం ఢిల్లీలో కోచింగ్‌ తీసుకుని మూడుసార్లు సివిల్‌ ఎగ్జామ్స్‌లో పాల్గొని ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. అయినా దక్కకపోవడంతో మళ్లీ కష్టపడి చదివి ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో రెండో ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యాడు. మారుమూల ప్రాంతంలో జన్మించిన కొండూరు శ్రీనివాసరాజు డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపిక కావడంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.  

రాయచోటి పట్టణానికి చెందిన నిమ్మనపల్లె మనోజ్‌రెడ్డి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇతడి తండ్రి ప్రభుత్వ అధ్యాపకుడు. తల్లి కళావతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. 6 నుంచి పదో తరగతి వరకు రాయచోటి రాజు విద్యాసంస్థల్లో చదివిన మనోజ్‌ ఇంటర్మీడియట్‌ హైదరాబాదులోని నారాయణలో చదివారు. అనంతరం ఐఐటీ ముంబైలో పూర్తి చేశారు. 2020లో సివిల్స్‌ రాసి.. స్వల్ప మార్కులతో అవకాశాన్ని కోల్పోయారు. మనోజ్‌రెడ్డిని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అభినందించారు. 

రాయచోటి పట్టణానికే చెందిన విష్వక్సేనుడు వినోద్‌ గ్రూప్‌-1లో అత్యుత్తమ మార్కులు సాధించి అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా ఎంపికయ్యారు. ఇతను ప్రస్తుతం స్టేట్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా రాజంపేటలో పనిచేస్తున్నారు. ఇతను 10వ తరగతి వరకు పట్టణంలోని నేషనల్‌ హైస్కూల్‌లో చదివారు. ఇంటర్మీడియట్‌ రాజు విద్యాసంస్థల్లో చదివారు. ఇతడి తండ్రి పురుషోత్తంనాయక్‌ లక్కిరెడ్డిపల్లె పోలీసుస్టేషన్‌లో ఏఎ్‌సఐగా పనిచేస్తున్నారు. తల్లి హేమావతి గృహిణిగా ఉన్నారు. ఇతడిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అభినందించారు. 

రామాపురం మండలం కొండావాండ్లపల్లెకు చెందిన జరుగు విక్రమ్‌కుమార్‌రెడ్డి గ్రూపు-1లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు. ఇతను సోషల్‌వెల్ఫేర్‌ శాఖలో అధికారిగా ఎంపికయ్యారు. ఇతను పదో తరగతి తిరుపతిలోని కిరణ్‌ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో చదివారు. ఇంటర్‌ తిరుపతి శ్రీచైతన్యలో చదివారు. అనంతపురం జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తి చేసి బంగారుపతకం సాధించారు. ఇతని తండ్రి చలమారెడ్డి, తల్లి విజయలక్ష్మి. ఇతన్ని కుటుంబ సభ్యులు, బంధువులు,స్నేహితులు అభినందించారు.  కాగా తమ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలకు ఎంపిక కావడం గర్వకారణమని రాయచోటి రాజు విద్యాసంస్థల అధినేత, టీడీపీ నాయకుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయన అభినందనలు తెలియచేశారు.



Updated Date - 2022-07-06T04:48:12+05:30 IST