సీఎం సభ సాక్షిగా.. రూ.లక్షలు దోచేశారు..!

ABN , First Publish Date - 2020-06-28T07:15:58+05:30 IST

గత ఏడాది డిసెంబర్‌ 24న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్..

సీఎం సభ సాక్షిగా.. రూ.లక్షలు దోచేశారు..!

రాయచోటి(కడప): గత ఏడాది డిసెంబర్‌ 24న సీఎం రాయచోటి నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే సభ సాక్షిగా.. కొందరు కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి లక్షల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దండుకున్నారు. వివరాలిలా..


గత ఏడాది డిసెంబర్‌ 24న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాయచోటి నియోజకవర్గ పర్యటనకు కోసం ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ముందువైపు ఆటస్థలంలో సభా వేదిక, వెనుక వైపు ఉన్న ఆటస్థలంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఆట స్థలాన్ని ముఖ్యమంత్రి కార్యక్రమం కోసం అనువుగా చేసేందుకు రూ.23.50 లక్షల అంచనాతో మొత్తం ఐదు పనులు చేపట్టారు. అయితే వీటిలో కొన్ని పనులు చేయకుండానే లక్షల రూపాయలు కొందరి చేతుల్లోకి మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.


ఇవీ కేటాయించిన పనులు..

  • - జూనియర్‌ కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కల తొలగింపు, గ్రౌండును పూర్తిగా చదును చేసేందుకు రూ.4,80 లక్షలతో ఒక పని చేశారు.
  • సభా వేదిక పరిసరాలలో ఎర్రమట్టి తోలి, చదును చేయడం, హెలీప్యాడ్‌ నుంచి సభా వేదిక వరకు రోడ్డు ఏర్పాటు కోసం ఇంకో పనిని రూ.4,70లక్షలతో చేశారు.
  • హెలీప్యాడ్‌ పరిసరాల్లో ఎర్రమట్టితో గట్టి ఉపరితలాన్ని తయారు చేయడానికి రూ.4,90 లక్షలతో ఇంకో పని చేపట్టారు.
  • కళాశాల మైదానంలో ఉన్న మట్టి కుప్పలు, శిధిలాలను తొలగించేందుకు రూ.4.90 లక్షలతో పనులు చేపట్టారు.
  • తాగునీరు, పారిశుధ్యం, వేదిక అలంకరణ, శిలాఫలకాల ఏర్పాటు వంటి ఇతరత్రా పనుల కోసం మరో రూ.4.20 లక్షల అంచనాతో పనులు చేపట్టారు.


ఇదీ వాస్తవం..

ముఖ్యమంత్రి కార్యక్రమం ఏర్పాటుకంటే చాలా రోజుల ముందు నుంచే ఇక్కడి మైదానంలో పిల్లలు హాకీ ఆడుతున్నారు. గతంలో ఇక్కడ సీఐగా పనిచేసిన చంద్రశేఖర్‌ చొరవతో వెనుక వైపు మైదానాన్ని హాకీ మైదానంగా తయారు చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు జరిగాయి. అలాగే ఇదే మైదానంలో ఓ వైపు కొందరు స్థానిక యువకులు సొంత ఖర్చుతో వాలీబాల్‌ కోర్టును తయారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వెనుక వైపు మైదానంలో దాదాపు ముప్పాతిక భాగం ఎటువంటి రాళ్లు, రప్పలు లేకుండా ఉంది. హెలీప్యాడ్‌ సైతం ఈ ముప్పాతిక భాగంలోనే ఉంది.


ఇలా నొక్కేశారు..

మైదానంలో ఇంకో వైపు మాత్రం పెద్ద పెద్ద మట్టి కుప్పలు ఉండేవి. ఇక్కడే కాంట్రాక్టర్లు తమ తెలివి తేటలు ఉపయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మైదానంలో ఎర్రమట్టిని బయట నుంచి తేకుండా, అక్కడే ఒకచోట పెద్ద గొయ్యి తవ్వి మట్టి తీసి మైదానంలో చల్లి.. రోలర్‌తో చదును చేసినట్లు సమాచారం. ఆపెద్ద గొయ్యిని అక్కడే ఉన్న మట్టి కుప్పలతో పూడ్చి, పైన ఎర్రమట్టి వేసి చదును చేసేసినట్లు తెలిసింది. కేవలం ఎక్సకవేటర్‌, రోలర్‌ ఖర్చుతోనే పని కానిచ్చేసి.. బయట నుంచి ఎర్రమట్టి తోలినట్లు, కళాశాల మైదానంలో ఉన్న మట్టికుప్పలు, శిధిలాలను ఊరిబయటకు తరలించినట్లు బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


పిచ్చిమొక్కల తొలగింపు పనిలోనూ.. అక్రమాలు జరిగినట్లు సమాచారం. కళాశాల ముందు వైపు ఉన్న మైదానంలో ఓ చివర కొన్ని కంపచెట్లు, పిచ్చిమొక్కలు ఉండేవి. వాటిని ఎక్సకవేటర్‌తో తొలగించారు. ఇందుకోసం లక్షల రూపాయలు బిల్లులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సభా వేదిక ప్రాంగణంలో జరిగిన పనుల్లో సైతం రూ.వేలల్లో ఖర్చు చేసి లక్షలు బిల్లులు చేసుకున్నారని సమాచారం. మొత్తంగా రూ.మూడు, నాలుగు లక్షల లోపు పనులు చేసి రూ.పది లక్షల వరకు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై అధికార పార్టీలోనే కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారని, ముఖ్యనాయకులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది.


ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారమే బిల్లులు చెల్లించాం..

ముఖ్యమంత్రి రాక సందర్భంగా చేసిన పనుల్లో ఎటువంటి అవినీతి, అక్రమాలు జరగలేదు. పనులను ప్రభుత్వ చీఫ్‌విప్‌తో పాటు కలెక్టర్‌, ఇతరా ఉన్నతాధికారులు పరిశీలించారు. ఎస్టిమేషన్‌లో పేర్కొన్న పనులన్నీ మా పర్యవేక్షణలోనే జరిగాయి. ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారమే, మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌లో బిల్లులు చెల్లించాం.

 - వెంకట క్రిష్ణారెడ్డి, మున్సిపల్‌ ఏఈ, రాయచోటి

Updated Date - 2020-06-28T07:15:58+05:30 IST