అసలు నిజమెంత..?

ABN , First Publish Date - 2020-07-07T18:26:38+05:30 IST

గతనెల 29వ తేదీన మచిలీపట్నం చేపల మార్కెట్‌ వద్ద..

అసలు నిజమెంత..?

మోకా హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్టు వెనుక రాజకీయాలు

నిందితులతో బలవంతంగా చెప్పించారా?

వైసీపీ నేతల ఒత్తిళ్లే కారణమా?

పోలీసుల పొంతనలేని మాటలెందుకు?

అరెస్టు వెనుక కుట్రలు.. కుతంత్రాలు


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం: మోకా భాస్కరరావు హత్య కేసులో తెరవెనుక కుట్రలు జరుగుతున్నాయా? కావాలనే మాజీమంత్రి కొల్లు రవీంద్రను కేసులో ఇరికిస్తున్నారా? హత్య జరిగిన రోజు సాయంత్రమే నిందితులు పోలీసులకు లొంగిపోతే ఆ తరువాత రోజు మాజీ మంత్రితో ఫోన్‌లో ఎలా మాట్లాడతారు? పోలీసుల పొంతనలేని మాటల వెనుక వైసీపీ నాయకుల ఒత్తిడి ఉందా? నిందితుల కాల్‌డేటాను అసలు ఎందుకు బయటపెట్టట్లేదు? టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో అసలు నిజమెంత? అంటే..


గతనెల 29వ తేదీన మచిలీపట్నం చేపల మార్కెట్‌ వద్ద వైసీపీ నాయకుడు మోకా భాస్కరరావు హత్యకు గురయ్యారు. మంత్రి పేర్ని నానికి ప్రధాన అనుచరుడు కావడంతో నిందితులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. మోకా హత్య కేసులో చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాంచారయ్య (పులి), మరో జువైనల్‌ను నిందితులుగా చేర్చారు. ఏ4 నిందితుడిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అనంతరం మరో ఇద్దరిని ఈ కేసులో నిందితులుగా చూపి అరెస్టు చేశారు. అసలు దీని వెనుక కథ ఏంటంటే..


పాతకక్షలే కారణమా..?

పెద ఉల్లింగిపాలెంలో మోకా భాస్కరరావు, చింతా నాంచారయ్య (చిన్ని) కుటుంబాల మధ్య పదేళ్లకుపైగా ఆధిపత్య పోరు, విభేదాలు ఉన్నాయి. వీరిద్దరూ మత్స్యకార సామాజికవర్గానికి చెందినవారు. 2013లో చింతా నాంచారయ్య (చిన్ని) సోదరుడు చింతా సురేంద్ర హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో మోకా భాస్కరరావు ఏ5 నిందితుడిగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోకా భాస్కరరావు పేరును ఈ కేసులో నుంచి తొలగించినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. మోకా భాస్కరరావుపై గతంలో రౌడీషీట్‌ ఉందని, ఇటీవల దానిని తొలగించినట్లు సమాచారం. ఏడాది కాలంగా మోకా భాస్కరరావు, చింతా చిన్ని కుటుంబాల మధ్య విభేదాలు పెరిగి ఆధిపత్య పోరు నెలకొంది. 


కుట్ర చేసి ‘కొల్లు’ పేరు చేర్చారా..?

మచిలీపట్నం 24వ డివిజన్‌ వైసీపీ కార్పొరేషన్‌ అభ్యర్థిగా హత్యకు గురైన మోకా భాస్కరరావు, టీడీపీ అభ్యర్థిగా ఈ కేసులో ప్రధాన నిందితుడు చింతా చిన్ని పోటీలో ఉన్నారు. మోకా హత్యకు గురికావడంతో అధికార పార్టీ నాయకులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఈ కేసులో ఇరికించేందుకు తెరవెనుక మంత్రాంగం నడిపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జూన్‌ 29న మోకా హత్యకు గురికాగా, మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు నిందితులు లొంగిపోయారని మీడియాలో ప్రసారమైంది. మచిలీపట్నం సమీపంలోని గూడూరులో నిందితులు పట్టుబడ్డారని జగన్‌ పత్రికలో వార్త రావడాన్ని టీడీపీ నేతలు ప్రధానంగా చెబుతున్నారు.


వాస్తవానికి హత్య జరిగిన రోజే నిందితులు పోలీసుల వద్ద లొంగిపోయారు. ఈ అంశాలనే ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  కూడా లేవనెత్తారు. పోలీసులకు లొంగిపోయిన నిందితులు ఫోన్లో ఎలా మాట్లాడతారని, మాజీమంత్రిని ఈ కేసులో నిందితుడిగా చేర్చేందుకే ఫోన్‌కాల్‌ డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. హత్య కేసులో నిందితులు పోలీసులకు ఎప్పుడు లొంగిపోయారు, కొల్లు రవీంద్రకు నిందితులే ఫోన్‌ చేశారా, వారితో వేరెవరైనా ఫోన్‌ చేయించారా.. అనే అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని చంద్రబాబు వాదన.


ప్రాథమిక విచారణ కూడా చేయకుండా కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, వైసీపీ కక్షసాధింపునకు నిదర్శనమని ఆయన అన్నారు. ఒకే సామాజికవర్గంలోని రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవ హత్యకు దారితీస్తే కొల్లు రవీంద్రను నిందితుడిగా చేర్చడం ఎంతవరకు సమంజసమని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. హత్య జరిగిన రెండు గంటల వ్యవధిలోనే మాజీమంత్రి కొల్లు రవీంద్ర పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని, అనంతరం ఆయన పేరును నిందితులతో చెప్పించారని టీడీపీ ఆరోపణ.  


పోలీసుల మాటల వెనుక పరమార్థమేంటి...?

నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టి, సాంకేతికపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కొల్లు రవీంద్రను అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశామని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు విలేకరుల సమావేశంలో తెలిపారు. హత్యకు గురైన మోకా భాస్కరరావు బంధువులు, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని చెప్పారు. ఈ కేసులో కొల్లు రవీంద్ర మినహా మిగిలిన ఐదుగురిని అరెస్టు చేసి, వారి నుంచి సమాచారం తెలుసుకుని, నిందితుల కాల్‌డేటాను పరిశీలించి, నిర్ధారణకు వచ్చాకే కొల్లు రవీంద్రను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.


చింతా చిన్ని.. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఆయన ఇంట్లో కలిసి మోకాను అంతమొందించాలని, దీనికి మద్దతు కావాలని అడిగినట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ చెప్పారు. ఇది సరైన సమయం కాదని, తరువాత చూద్దామని కొల్లు రవీంద్ర చెప్పినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. హత్య జరిగిన ఐదారు రోజుల ముందు హత్య కేసులో ప్రధాన నిందితుడు చింతా చిన్ని, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఆయన పీఏ నాగరాజు గదిలో మాట్లాడుకున్నారని తెలిపారు. ఈ సమయంలోనే మోకాను అంతమొందించాలని చెప్పి తన పేరు బయటకు రానివ్వద్దని, మీకు అండగా ఉంటానని, కావాల్సిన  సహాయ సహకారాలు అందిస్తానని కొల్లు రవీంద్ర చెప్పినట్లు తమ విచారణలో వెల్లడైందని ఎస్పీ తెలిపారు.


ఈ హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పీఏలు రిజ్వాన్‌, నాగరాజును కూడా పోలీసులు విచారించారు. హత్య జరిగిన అనంతరం నిందితులు తమ ఫోన్‌ నుంచి రిజ్వాన్‌కు ఫోన్‌ చేయడం, రవీంద్ర వారితో సంభాషించడం, తన నెంబరుకు ఫోన్‌ చేయవద్దని, పీఏలకు మాత్రమే ఫోన్‌ చేయాలని కొల్లు రవీంద్ర చెప్పారని ఎస్పీ పేర్కొన్నారు. 


డేటా ఎక్కడ..?

హత్య జరిగే ముందు ఒకసారి, హత్య జరిగిన 40 నిమిషాలకు పట్టణ సరిహద్దుల నుంచి నిందితులు కొల్లు రవీంద్రతో ఫోన్లో మాట్లాడారని, అనంతరం చింతా చిన్ని తన ఫోన్‌ సిచ్ఛాఫ్‌ చేశాడని పోలీసులు చెబుతున్నారు. చింతా పులి ఫోన్‌ నుంచి కూడా పీఏ రిజ్వాన్‌కు ఫోన్‌ చేశారని తమ విచారణలో వెల్లడైందంటున్నారు. ఆ తరువాత కూడా నిందితులు కోలా రాము, వనబాబు ఫోన్ల నుంచి రవీంద్రతో మాట్లాడారని, టెక్నికల్‌ డేటా తదితర అంశాలన్నింటినీ పూర్తిస్థాయిలో పరిశీలించి కొల్లు రవీంద్రను నిందితుడిగా చేర్చామని ఎస్పీ తెలిపారు. విచారణ కోసం ఆయనకు నోటీసు ఇచ్చేందుకు కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లగా, అప్పటికే ఆయన ఇంటి గోడ దూకి వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. కాగా, కాల్‌డేటాపై అనేక అనుమానాలు ఉన్నాయని, నివృత్తి చేయాలని కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-07-07T18:26:38+05:30 IST