జిల్లాలో జోరుగా రేషన్‌ దందా

ABN , First Publish Date - 2022-04-15T05:30:00+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేసి పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. వీటి సేకరణకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ముఠాలే పని చేస్తున్నాయి.

జిల్లాలో జోరుగా రేషన్‌ దందా
శుక్రవారం కామారెడ్డి పట్టణంలో పోలీసులు పట్టుకున్న పీడీఎస్‌ బియ్యం

- రీసైక్లింగ్‌ జరుగుతున్నా పట్టని వైనం

- పీడీ యాక్ట్‌కు అవకాశం ఉన్నా అటువైపు దృష్టి సారించని అధికారులు

- రోజుల వ్యవధిలోనే క్వింటాళ్ల కొద్ది పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకుంటున్న సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు


కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 15: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేసి పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. వీటి సేకరణకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ముఠాలే పని చేస్తున్నాయి. చైన్‌ సిస్టంల పనిచేస్తూ ఒకరి నుంచి ఒకరు ప్రజల నుంచి బియ్యం సేకరిస్తున్నారు. వాటిని పెద్దమొత్తంలో సేకరించి పలువురు వ్యాపారులు రైస్‌మిల్లులకు, చేపల పెంపకానికి, పౌలీ్ట్ర పరిశ్రమలకు సరఫరా చేయడం లేదంటే మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేయడం చేస్తున్నారు. కిలోకు రూ.10 వరకు కమీషన్‌ మిగులుతుండడంతో చాలా మంది దీనినే వృత్తిగా మలుచుకుంటున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని కొందరు మిల్లుల యజమానులు, సీఎంఆర్‌గా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, పోలీసులు దాడులు చేసిన సమయంలో పట్టుబడిన వారిపై 6ఏ కేసులు నమోదు చేస్తుండడం, పట్టుకున్న బియ్యం భారీ మొత్తంలో ఉంటే పౌర సరఫరాల గోదాంలోకి, తక్కువ మొత్తంలో ఉంటే సమీపంలోని రేషన్‌ దుకాణాలకు అప్పగించి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను కోర్టుకు అప్పగిస్తున్నారు. అత్యవసర సరుకుల చట్టం 1955 చట్టంలోని 6ఏ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తున్నారు. చిన్నపాటి శిక్షలు ఉండడంతో రేషన్‌ బియ్యం దందాకు అడ్డుకట్టపడడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం సైతం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్డులో 19 టన్నుల వరకు పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తున్న లారీని టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌ పోలీసులు పట్టుకుని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

మూలాల్లోకి వెళ్లని దర్యాప్తు

జిల్లాలో రోజుల వ్యవధిలోనే అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన, తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకుంటున్నారు. కానీ వాటి మూలాల్లోకి మాత్రం వెళ్లడం లేదని సమాచారం. పట్టుబడిన వ్యక్తులు ఎక్కడి నుంచి వాటిని సేకరించారు. ఎన్ని నెలల నుంచి ఈ వ్యాపారం సాగుతోంది. తదితర అంశాలపై లోతుగా దర్యాప్తు జరగకపోవడం వల్లనే కేసులు నమోదైనా మళ్లీ అదే దందా సాగించడమో లేదంటే వారి ప్రతినిధులను ఈ వ్యాపారంలో దింపి వెనుక నుంచి నడిపించడం లాంటివి చేస్తున్నారని తెలుస్తోంది. దొరికిన బియ్యానికి లెక్కలు అడిగి చర్యలు తీసుకుంటున్నారు తప్పితే వారి వ్యాపార చరిత్రపై ఆరా తీయడం లేదు. పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్‌ లాంటి కేసులు నమోదు చేస్తేనే ఈ దందాకు చెక్‌ పెట్టవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇళ్ల వద్దే దందా

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో, గ్రామాల్లో కొంత మంది బియ్యం వ్యాపారులు, దుకాణ సముదాయాల నిర్వాహకులు, మిల్లర్లు ఆటోల్లో వేయింగ్‌ మిషన్‌లు తీసుకుని నేరుగా లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్తు కొనుగోలు చేస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు ఇలా బియ్యాన్ని దళారులకు అమ్ముకుంటుండడంతో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతోంది. రవాణా చేసే వాహనాలకు అడ్వాన్సు మొత్తం ఇచ్చి రేషన్‌ బియ్యం తెప్పిస్తున్నారంటే దందా ఎంత పకడ్బందీగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. బియ్యం తరలింపునకు ఉపయోగించే వాహనాలను తమ పేరుపై లేకుండా వ్యాపారులు జాగ్రత్త పడుతున్నారు. బియ్యం కొనుగోలు చేస్తున్న వ్యాపారులు మూడు సార్లు పట్టుబడితే వారిపై పీడీయాక్ట్‌ నమోదు చేయాలి. దీంతో పట్టుబడిన సమయంలో వారి పేర్లు లేకుండా జాగ్రత్త పడుతుండడంతో మధ్యవర్తుల మీద కేసులు నమోదవుతున్నాయి. గతంలో లింగంపేటలో ఇదే తరహాలో బియ్యం సరఫరా చేసే వ్యాపారి తన దగ్గర పనిచేసే వ్యక్తిని ఆటోలో పంపించడంతో సమాచారం అందుకున్న అధికారులు పట్టుకోగా సదరు వ్యాపారి అతని వద్ద పనిచేసే వ్యక్తిపై నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. వినియోగదారుల నుంచి కిలో బియ్యానికి రూ.10 చొప్పున కొనుగోలు చేసి రూ.20కు అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు.

Updated Date - 2022-04-15T05:30:00+05:30 IST