రేషన్‌ బియ్యంలో.. పురుగులు..తుట్టెలు!

ABN , First Publish Date - 2022-06-25T04:34:56+05:30 IST

పేదలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యం నాసిరకంగా ఉన్నాయి.

రేషన్‌ బియ్యంలో.. పురుగులు..తుట్టెలు!
చేవెళ్లలో ఓ రేషన్‌ షాపునకు వచ్చిన తుట్టెలు కట్టిన బియ్యం

  • బస్తాలో తుట్టెలు కట్టి ఉన్న బియ్యం
  • తినలేమంటున్న లబ్ధిదారులు 
  • గ్రామాల్లో డీలర్లతో గొడవలు


రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 24 : పేదలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యం నాసిరకంగా ఉన్నాయి. బియ్యం అంతా పురుగులు పట్టి తుట్టెలు కట్టి ఉండటంతో ఎలా తినాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. చేవెళ్లలోని ఓ రేషన్‌ షాపులో పురుగులు, బూజు పట్టిన బియ్యం బస్తాలలో వచ్చాయి. ఇవి లబ్ధిదారులకు ఇవ్వడానికి రేషన్‌ డీలర్లు ప్రయత్నించారు. ఈ బియ్యాన్ని తీసుకొని మేమేం చేసుకోవాలని లబ్ధిదారులు నిలదీశారు. వండుకొని ఎలా తినాలని ప్రశ్నించారు. పై నుంచి అలాగే వచ్చాయని రేషన్‌ డీలర్లు సమాధానమిస్తున్నారు. జూన్‌ నెల కోటాకు సంబంధించి ఈనెల ఒకటో తేది నుంచి 15 తేది వరకు రేషన్‌ కార్డులోని కుటుంబ సభ్యునికి 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే.. అన్ని కిలోల చొప్పున బియ్యం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూపాయికి కిలో బియ్యం అందించారు. కేంద్ర ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా పేదలకు జూన్‌ నెల నుంచి మళ్లీ ఉచిత బియ్యాన్ని అందిస్తుంది. ఒకరికి 5కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. గోదాముల్లో నిల్వ ఉన్న స్టాక్‌ను పంపిస్తుండటంతో బియ్యం పురుగులు, తుట్టెలమయంగా మారింది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో నాసిరక బియ్యం సరఫరా అవుతున్నట్లు డీలర్లు ఆరోపిస్తున్నారు. బియ్యం పురుగులు పట్టి తుట్టెలు కట్టి ఉండటంతో తమకు వద్దని, నాణ్యమైన బియ్యం అందించాలని లబ్ధిదారులు డీలర్లతో ఆందోళనకు దిగుతున్నారు. సివిల్‌ సప్లయ్‌ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా నాసిరకం బియ్యం, తూకం తక్కువగా ఉన్న బియ్యం వస్తున్నాయని పలువురు డీలర్లు వాపోతున్నారు. 


తుట్టెలు కట్టిన బియ్యం ఏం చేయాలి

కేంద్ర ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారులకు బియ్యం అందివ్వడం సం తోషం. కానీ నాసిరకం, తుట్టెలు కట్టిన బియ్యం పంపిణీ చేస్తుంది. ఆ బియ్యాన్ని తీసుకుని ఏం చేయాలి. ఎలా వండుకుని తినాలి. నాణ్యమైన బియ్యంను పేదలకు అందించాలి. వీలైతే.. సన్నబియ్యం పంపిణీ చేయాలి. 

- వెంకటేష్‌, లబ్ధిదారుడు, చేవెళ్ల గ్రామం



కుటుంబ ఆహార భద్రత కార్డుల వివరాలు

మొత్తం రేషన్‌ షాపులు : 919

అంత్యోదయ ఆహార భద్రత కార్డులు : 35,256

ఆహార భద్రత కార్డులు : 5,24,591

అన్నపూర్ణ ఆహార భద్రత కార్డులు : 43

మొత్తం ఆహార భద్రత కార్డులు : 5,59,890

బియ్యం కేటాయింపు : 19272.770 టన్నులు



Updated Date - 2022-06-25T04:34:56+05:30 IST