రేషన్‌ రచ్చ!

ABN , First Publish Date - 2020-03-30T10:26:11+05:30 IST

ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ..

రేషన్‌ రచ్చ!

ఉచిత బియ్యం, కందిపప్పు కోసం ఎగబడిన జనం

తెల్లవారుజాము నుంచే డిపోల వద్ద క్యూ

‘సామాజిక దూరం’ అంతంతే

పలుచోట్ల మొరాయించిన ఈ పోస్‌ యంత్రాలు

మండుటెండలో నిలువుగాళ్లపై నిల్చువాల్సిన పరిస్థితి

సొమ్మసిల్లిన వృద్ధులు, మహిళలు

కొందరికే కందిపప్పు... పలు డిపోలకు చేరని బియ్యం

నాసిరకంగా గోధుమపిండి

అమలుకాని క్లస్టర్‌ విధానం

కానరాని వలంటీర్ల వ్యవస్థ

ముందుచూపు లేకుండా వ్యవహరించిన ప్రభుత్వం


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ రచ్చరచ్చగా మారింది. సరుకుల పంపిణీలో అధికారులు, రేషన్‌ డీలర్లు, వలంటీర్ల మధ్య సమన్వయం కొరవడింది. రేషన్‌ పంపిణీలో సరైన ప్రణాళికను అమలు చేయకపోవడంతో రేషన్‌ డిపోలకు జనం ఎగబడ్డారు. ఎక్కడా క్లస్టర్‌ విధానం అమలు కాలేదు. ఆదివారం తెల్లవారుజాము నుంచే కార్డుదారులు రేషన్‌ డిపోల వద్ద క్యూకట్టారు. పలుచోట్ల క్యూలో ఖాళీ సంచులు, డబ్బాలు పెట్టి, ఇళ్లకు వెళ్లిపోయారు. డిపోలు తెరవకముందే తిరిగి క్యూలో నిల్చున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ‘సామాజిక దూరం’ పాటించాలన్న నిబంధన పలుచోట్ల అమలుకాలేదు. ఎక్కువ మంది తరలిరావడం, రేషన్‌ డిపోల వద్ద నీడ సదుపాయం లేకపోవడం, ఎండ మండిపోతుండడం, సామాజిక దూరం పాటించాలని చెప్పడంతో మండుటెండలో నిలువుగాళ్లపై నిల్చువాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలుచోట్ల వృద్ధులు, మహిళలు సొమ్మసిల్లిపోయారు. కాగా కొన్నిచోట్ల ఈపోస్‌ యంత్రాలు మొరాయించడంతో రేషన్‌ పంపిణీ ఆలస్యమైంది. గ్రామీణ ప్రాంతంతో పోల్చితో నగరంలో పరిస్థితి గందరగోళంగా తయారైంది. 


‘కీలు ఎరిగి వాత పెట్టాలి’ అనేది పెద్దల మాట. కానీ ఈ ప్రభుత్వం ప్రజల తీరు తెలిసి మరీ తప్పు చేసింది. ఉచిత రేషన్‌ పంపిణీకి ఆదివారం తెర తీసింది. వార్డు వలంటీర్లే ఇకపై అన్నీ ఇళ్లకు వచ్చి ఇస్తారని, ప్రజలు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అనేకసార్లు ప్రకటించారు. ఆ విధంగానే పింఛన్లు నెలనెలా పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు రేషన్‌ కూడా అలాగే ఇవ్వాల్సి ఉంది. కానీ వలంటీర్లు అంతా కరోనా ఇంటింటా సర్వే పనుల్లో ఉండడం వల్ల ఎవరి రేషన్‌ వారే తీసుకెళ్లవలసి వచ్చింది. బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రభుత్వ ప్రకటించడంతో కార్డుదారులంతా ఆదివారం తెల్లవారుజాము నుంచే డిపోల ముందు క్యూ కట్టేశారు.


కరోనా వైరస్‌, లాక్‌ డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలనాడి ఏమిటో ప్రభుత్వానికి గత నాలుగు రోజులుగా తెలుస్తూనే ఉంది. సాధారణ రైతుబజార్లకు రెట్టింపు సంఖ్యలో బజార్లు ఏర్పాటు చేసినా జనాలు ఎగబడి మరీ కొంటున్నారు. ఎండను సైతం లెక్క చేయడం లేదు. సామాజిక దూరం నిబంధనను పట్టించుకోవడం లేదు. ఆదివారం చికెన్‌, మటన్‌ దుకాణాల వద్ద బారులు తీరారు. ఇక ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు. చాలాచోట్ల మాంసాహారం లేకపోతే ప్రాణం పోతుందన్నట్టుగా వ్యవహరించారు. ప్రభుత్వం ఒకరితో మరొకరు కలవకుండా ఉండటానికే 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఆ విధంగా ఇంట్లో ఉంటే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదని, ఆ చెయిన్‌ తెగిపోతుందని భావించింది. కానీ ప్రభుత్వ ఆశయానికి ప్రజలు ఎక్కడికక్కడ గండి కొట్టేస్తున్నారు.


ఇప్పుడు ఉచిత రేషన్‌ పంపిణీతో  స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ‘సామాజిక దూరం’ నిబంధనను తుంగలో తొక్కినట్టయ్యింది. వారం రోజుల నుంచి ఇళ్లకే పరిమితమైన జనం.... బియ్యం, కందిపప్పు కోసం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. రేషన్‌ డిపోల వద్ద బారులు తీరారు. రేషన్‌ డిపోలు వున్న వీధులన్నీ జాతరను తలపించాయి. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఒక రోజు ఆలస్యమైతే సరకులు అయిపోతాయేమో, మళ్లీ వస్తాయో రావో అనే భయం ప్రజల్లో ఏర్పడింది. అందుకే పంపిణీ ప్రారంభించిన రోజే సరకులు తీసుకోవడానికి ఎగబడ్డారు. డిపోల దగ్గర పరిస్థితిని చూసి కొంతమంది మహిళలు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. డిపోల నుంచి రేషన్‌ సరుకులను వలంటీర్లే ఇంటికి తెస్తారని, కరోనా వ్యాప్తిలో ఉన్న సమయంలో ఇంట్లో ఉండమని చెప్పి, రేషన్‌ పేరుతో రోడ్డు మీదకు లాగారని శాపనార్థాలు పెట్టారు. కనీసం సోమవారం నుంచైనా డిపోల దగ్గర కాకుండా ఇళ్లకే రేషన్‌ పంపించేలా చర్యలు చేపట్టాలని ప్రజలంతా డిమాండ్‌ చేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థను పెట్టిందే అందుకు కాబట్టి, వారి సేవలను ఉపయోగించాలని కోరుతున్నారు. 


ఏదీ క్లస్టర్‌ విధానం

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలులో ఉంది. రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలకు పనులు లేక ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో తెల్లకార్డుదారులకు ఏప్రిల్‌ నెలకు సంబంధించి బియ్యం, కందిపప్పు ఉచితంగాను; గోధుమపిండి, పంచదార  తక్కువ ధరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటో తేదీ నుంచి కాకుండా మూడు రోజుల ముందు.... అంటే ఈనెల 29వ తేదీ నుంచే సరుకులు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. అయితే కార్డుదారులంతో డిపోలకు వస్తే, కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం కష్టమన్న ఉద్దేశంతో రేషన్‌ డిపోలను క్లస్టర్లవారీగా విభజించి సరుకులు పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. కానీ  ఈ విధానం అమలులో అధికారులు విఫలమయ్యారు.


వలంటీర్ల ద్వారా కార్డుదారులకు తేదీలు, సమయం నిర్దేశించి రోజుకు రెండు లేదా మూడు క్లస్టర్లకు సరుకులు పంపిణీ చేయాలి. ప్రతి క్లస్టర్‌కు కనీసం రెండుగంటల వ్యవధి ఉండేలా చూడాలని అధికారులు ఆదేశించారు. దీనిప్రకారం కార్డుదారులకు నిర్దేశించిన సమయాలను చెప్పే బాధ్యత వలంటీర్లదే. దీనిపై వలంటీర్లలలో అవగాహన కొరవడింది. 18 రోజులపాటు సరుకులు తీసుకోవచ్చనే విషయం కాకుండా, ‘‘ఆదివారం సరుకులు ఇస్తారు. డిపోలకు రండి’’ అని వలంటీర్లు శనివారం చెప్పారు. దీంతో తొలి రోజే సరుకులు తీసుకోవాలని, లేకపోతే అయిపోతాయన్న భావనతో కార్డుదారులంతా డిపోల వద్ద క్యూ కట్టేశారు. వచ్చినవారికి టోకెన్లు ఇచ్చారు. తరువాత వారంతా క్యూలో ఉంటేనే సరుకులు ఇస్తామని ప్రకటించారు. డిపోలకు జనం ఒక్కసారి రావడంతో కొన్నిచోట్ల గందరగోళం ఏర్పడింది.


గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటించాలన్న అధికారుల ఆదేశాలు అమలు కాలేదు. వచ్చిన జనాలను అదుపుచేయడంలో కొన్నిచోట్ల వలంటీర్లు పనిచేసినా మరికొన్నిచోట్ల చేతులేత్తేశారు. రోజుకు వంద మంది వరకు రేషన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పినా కొన్నిచోట్ల 200 మంది వరకు కార్డుదారులకు టోకెన్లు ఇచ్చారు. దీంతో మండుటెండలో ఒంటిగంట వరకు సరుకులు పంపిణీచేశారు. సందుల్లో రేషన్‌ డిపోలు వున్న ప్రాంతాల్లో ‘సామాజిక దూరం’ పాటించలేదు.  పలుచోట్ల ఈ పోస్‌ యంత్రాలు మొరాయించడంతో కార్డుదారులు క్యూలో వేచివుండాల్సి వచ్చింది. రేషన్‌ డిపోల వద్ద ఎటువంటి నీడ లేకపోవడంతో మండుటెండలో నిలువుగాళ్లపై నిల్చువాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ తీక్షణంగా కాయడం, ఉక్కపోత చెమట కారణంగా వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు, మహిళలు సొమ్మసిల్లిపోయారు.


అయితే గ్రామీణ ప్రాంతంలో సరుకుల పంపిణీలో పెద్దగా ఇబ్బందులు కనిపించలేదు. కాగా బియ్యంతోపాటు కందిపప్పు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా పలుచోట్ల కందిపప్పు సరఫరా కాలేదు. జిల్లాకు 1,250 టన్నులకుగాను 1,000 టన్నుల వరకు కందిపప్పు వచ్చింది. దీంతో కొన్నిచోట్ల డిపోలలో కందిపప్పు ఇవ్వకపోడంతో ప్రజలు నిలదీశారు. సబ్సిడీపై ఇచ్చే గోధుమపిండిపై కార్డుదారులు పెదవివిరిచారు. గోధుమపిండి నాణ్యత లేదని చెప్పారు. 

Updated Date - 2020-03-30T10:26:11+05:30 IST