నేటి నుంచి రేషన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2020-03-29T11:21:19+05:30 IST

చౌక దుకాణాల ద్వారా ఆదివారం నుంచే నిత్యావసర సరకులను లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

నేటి నుంచి రేషన్‌ పంపిణీ

వేలిముద్ర అవసరం లేదు

ఉదయం 6 నుంచి ఒంటిగంటదాకా..

సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు


   చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 28: చౌక దుకాణాల ద్వారా ఆదివారం నుంచే నిత్యావసర సరకులను లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.  ఆదివారం నుంచి ఏప్రిల్‌ 15 వరకు 11.33 లక్షల మంది కార్డుదారులు సరకులు పొందే వెసులుబాటు కల్పించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సరుకుల పంపిణీ ఉంటుది. ఈనెల తీసుకోలేకపోతే రెండు నెలలకు కలిపి వచ్చే నెలలో తీసుకునేలా కూడా అవకాశం కల్పించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూడు నెలలపాటు వేలిముద్ర పద్ధతికి స్వస్తి పలికారు. లబ్ధిదారుడు బియ్యం కార్డు తీసుకొస్తే సరిపోతుంది. ఒక్కో కుటుంబానికి వారి కార్డులోని సభ్యుల సంఖ్య ఆధారంగా ఒక వ్యక్తికి ఐదు కిలోల చొప్పున బియ్యం, కార్డుకు కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తారు. చక్కెరకు మాత్రం ధర చెల్లించాలి. 


క్యూ పాటించాలి

చౌక దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేయాలి. కార్డుదారులందరూ ఒక్కొక్కరు వెళ్ళే విధంగా రింగ్‌ మార్క్‌ చేయాలి. దుకాణాల వద్ద సబ్బు, నీళ్ళు, శానిటైజర్‌లను ఏర్పాటు చేయాలి. రిజిస్టర్‌లో కార్డుదారులు సంతకం చేయాలి. సంతకం పెట్టలేని వారి ఫొటో తీసుకుంటారు. 

Updated Date - 2020-03-29T11:21:19+05:30 IST