రేషన్‌ డీలర్లకు కమీషన్లు ఎప్పుడు..?

ABN , First Publish Date - 2020-10-27T10:30:32+05:30 IST

కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా పనులు దొరకని పేద ప్రజల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టాయి

రేషన్‌ డీలర్లకు కమీషన్లు ఎప్పుడు..?

50 రోజుల కిందటే నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేయని అధికారులు

ఖాతా నెంబర్లలో తప్పుల పేరుతో జాప్యం

టీడీఎస్‌, పాన్‌కార్డుల పేరుతో భారీ కోత


మంచిర్యాల, అక్టోబరు 26: కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా పనులు దొరకని పేద ప్రజల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలో ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున ఏప్రిల్‌, మే మాసాలకు సంబంధించి చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేశారు. ఉచిత బియ్యం పంపిణీని నవంబరు వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అనంతరం జూన్‌ నెల నుంచి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. రేషన్‌ షాపుల్లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసినందుకుగాను డీలర్లకు ప్రభుత్వం క్వింటాలుకు 70 పైసల చొప్పున కమీషన్‌ చెల్లిస్తున్నది. డీలర్లకు ప్రభుత్వం జూన్‌, జూలై నెలల్లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన కమీషన్లతోపాటు ఆర్వో రీఫండ్‌, అలాగే ఏప్రిల్‌, మే నెలల కమీషన్‌ బకాయిలు మొత్తం కలిపి సెప్టెంబరు మొదటి వారంలో విడుదల చేసింది. అయితే 50 రోజులు గడుస్తున్నా డీలర్ల ఖాతాల్లో కమీషన్‌ డబ్బులు జమకాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినా పౌర సరఫరాల శాఖ అధికారులు బ్యాంకుల్లో జమచేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వైఖరి కారణంగా దసరా పండుగ పూట ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆవేదన చెందుతున్నారు. 


జిల్లాకు రూ. కోటిపై చిలుకు నిధులు విడుదల....

జిల్లా వ్యాప్తంగా 423 చౌకధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం సరఫరా జరిగింది. ఏప్రిల్‌, మే నెలల పాత బకాయిలు సరాసరి 423 మంది డీలర్లలో ఒక్కొక్కరికి రూ.10వేలతోపాటు జూన్‌, జూలై నెలల కమీషన్‌ దాదాపు రూ. 50వేలు, అలాగే జూన్‌ నెల బియ్యం కొనుగోలు కోసం డీలర్లు మీ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం పేరిట తీసిన డీడీ డబ్బులు (క్వింటాలుకు 30 పైసల చొప్పున) కలిపి మొత్తం సుమారు రూ. 2 కోట్ల పై చిలుకు  సెప్టెంబరులో పౌర సరఫరాల శాఖ అధికారుల అకౌంట్లలో జమ అయ్యాయి. దాదాపు 50 రోజులు గడుస్తున్నా ఇంతవరకు డీలర్ల అకౌంట్లకు బదిలీ కాకపోవడం గమనార్హం. రూ.కోటి 20 లక్షల పై చిలుకు నిధులను ఇంతకాలం అధికారులు తమ ఖాతాల్లో నిలువ ఉంచుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. అకౌంట్లలో నిల్వ ఉన్న డబ్బులకు గాను బ్యాంకులు ఇచ్చే వడ్డీని కూడా రేషన్‌ డీలర్లకు అందజేస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 


టీడీఎస్‌, పాన్‌ కార్డుల పేరుతో భారీ కోత

కమీషన్ల కింద విడుదలైన మొత్తం నుంచి టీడీఎస్‌ (ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌), పాన్‌ కార్డులు లేవనే పేరుతో దాదాపు 30 శాతం కోత విధిస్తున్నారని రేషన్‌ డీలర్లు మొత్తుకుంటున్నారు. ఒక్కొక్కరికి రూ. 50వేలు కమీషన్‌ దాటుతున్నందున 10 శాతం టీడీఎస్‌, పాన్‌ కార్డులు లేని వారికి మరో 20 శాతం చార్జీల కింద కోత విధిస్తున్నట్లు తెలిపారు. అయితే రెండు నెలలకు కలిపి ఒకేసారి కమీషన్లు విడుదల చేయడంతో రూ. 50 వేలు దాటుతుందని, అదే ఎప్పటికప్పుడు చెల్లిస్తే తమకు టీడీఎస్‌ వర్తించేదికాదని వాపోతున్నారు. ప్రభుత్వ తప్పిదం కారణంగా  తమ కమీషన్లలో కోత విధించడం సరికాదని అంటున్నారు. అయితే పాన్‌కార్డులు అప్పగించిన తరువాత 20 శాతం కమీషన్‌ తిరిగి డీలర్ల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని, అలాగే టీడీఎస్‌ కింద మినయించిన డబ్బులు సైతం డీలర్లు వ్యక్తిగతంగా ఇన్‌కం టాక్స్‌ ఫైల్‌ చేస్తే తిరిగి పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతుండటం విశేషం.  జిల్లా కేంద్రంలోనే పలువురు పాన్‌ కార్డు కలిగి ఉన్న డీలర్లకు సైతం 20 శాతం కమీషన్‌ కట్‌ చేశారని లబోదిబోమంటున్నారు. అధికారుల తప్పిదం కారణంగా తమకు పాన్‌ కార్డులేవని పొరబాటున పేర్కొన్నారని, దానికీ తమనే బలిచేయడం ఏమిటని డీలర్లు ప్రశ్నిస్తున్నారు.


పండుగ ఖర్చులకు అప్పులు చేయాల్సి వచ్చింది....మల్లేశ్వరి, రేషన్‌ డీలర్‌ మంచిర్యాల

కరోనాకు కూడా భయపడకుండా ప్రజల కోసం బియ్యం సరఫరా చేసినప్పటికీ సకాలంలో కమీషన్లు అందక బతుకమ్మ, దసరా పండుగల ఖర్చులకు అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం విడుదల చేసి 50 రోజులైనా ఇంకా బ్యాంకు అకౌంట్లు సరిచేయలేదా..? బ్యాంకు పాసు బుక్కులు, పాన్‌ కార్డులు ఇప్పటికి అనేక సార్లు అందజేయడం జరిగింది. అయినా అకౌంట్లు సరిగ్గా లేవనడం సరికాదు. అధికారులు నగదు బదిలీ వెంటనే చేయాలి.


అకౌంట్లు సరిగ్గా లేనందునే జాప్యం....పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ గోపాల్‌

కొందరు రేషన్‌ డీలర్ల బ్యాంకు అకౌంట్లు సరిగ్గా లేనందునే కమీషన్‌ జమ చేయడంలో జాప్యం జరుగుతోంది. అన్నీ సరిగ్గా ఉన్న వారికి ఈనెల 16న బ్యాంకుల్లో జమ చేయడం జరిగింది. రేషన్‌ డీలర్లకు సంబంధించిన అకౌంట్లు సివిల్‌ సప్లయీస్‌ అధికారుల నుంచి ఆలస్యంగా రావడంతో నగదు బదిలీలో జాప్యానికి కారణమైంది. బ్యాంకు అకౌంట్లు సరి చూసుకోగానే కమీషన్లు బదిలీ చేయడం జరుగుతుంది.  

Updated Date - 2020-10-27T10:30:32+05:30 IST